కాన్పూర్: కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారిలోని కొందరు పలు ఆనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. యూపీలోని కిద్వాయీనగర్ ప్రాంతానికి చెందిన ఒక వృద్ధునికి కరోనా సోకింది. 20 రోజుల చికిత్స అనంతరం నెగిటివ్ రిపోర్టు రావడంతో ఇంటికి చేరుకున్నాడు. అయితే ఇప్పుడు అతని వ్యవహారశైలిలో మార్పులు చోటుచేసుకున్నాయి. కంటి చూపు మసకబారడమే కాకుండా, మతిమరపు సమస్యను ఎదుర్కొంటున్నాడు. స్నానం చేసిన తరువాత దుస్తులు ధరించడం మరచిపోతున్నాడు. ఇదే ప్రాంతానికి చెందిన ఒక బ్యాంకు ఆఫీసర్ కరోనా బారిన పడ్డారు. 16 రోజుల అనంతరం వ్యాధి నుంచి కోలుకున్నారు. తరువాత అతనికి తీవ్రమైన తలనొప్పి ప్రారంభమైంది.
దీంతో వైద్యులను సంప్రదించగా, వారు అతని సమస్యను గుర్తించి, చికిత్స అందించారు. అయితే అతను బ్యాంకుకు చేరుకున్నాక కంప్యూటర్ మొదలుకొని, కరెన్సీ చెస్ట్ లాక్కు సంబంధించిన అన్ని పాస్వర్డ్లను మరచిపోయారు. దీంతో వాటినన్నింటినీ రీసెట్ చేసుకోవాల్సి వచ్చింది. మరోవైపు ఆ బ్యాంకు ఆఫీసర్ కంప్యూటర్ ఫంక్షనింగ్ కూడా మరచిపోయారు. ఇతనిని పరీక్షించిన వైద్యులు ఈ సమస్యను ‘బ్రెయిన్ ఫాగ్’గా పేర్కొన్నారు. కాన్పూర్లో ఇటువంటి నాలుగు కేసులు వెలుగు చూశాయి. ఈ సందర్భంగా కన్పూర్ మెడికల్ కాలేజీ న్యూరాలజీ హెడ్ ప్రొఫెసర్ అలోక్ వర్మ మాట్లాడుతూ కరోనా వైరస్ నరాలలోని రక్తాన్ని గడ్డకట్టేలా చేస్తుంది. ఇదేవిధంగా దీర్ఘకాలం పాటు ఆక్సిజన్ సపోర్టుపై ఉన్న బాధితుల మెదడులోని నరాలు బలహీనపడతాయి. ఫలితంగా నరాల సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఇటువంటి ‘బ్రెయిన్ ఫాగ్’ సమస్య వృద్ధులలో కనిపిస్తోంది. దీని నివారణకు రెండు నుంచి మూడు నెలల పాటు చికిత్స తీసుకోవాల్సి ఉంటుందన్నారు.