Abn logo
Oct 23 2021 @ 00:29AM

సీసాలో నాటు సారా

తాజాగా విక్రయాలు జరుపుతున్న నాటు సారా బాటిళ్లు

  • ప్యాకెట్ల నుంచి బాటిళ్లకు మారిన సారా వ్యాపారులు
  • జిల్లాలో ఏరులై పారుతున్న సారా
  • లీటరు రూ.160 నుంచి రూ.200కు లభ్యం
  • ఎగబడుతున్న కూలీనాలీ జనం 

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

‘సారా’ స్మార్ట్‌గా మారుతోంది. ప్యాకెట్ల రూపంలో అమ్మే సారా ప్రభుత్వ లిక్కర్‌ మాదిరిగా సీసాలలో పోసి అమ్ముతున్నారు. కొబ్బరినీళ్లు పోసే బాటిళ్ల మాదిరిగా ఉండే తెల్లటి బాటిళ్లలో తెల్లని నాటు సారా నింపి అమ్మేస్తున్నారు. కాకపోతే ఈ బాటిళ్లపై లేబుల్స్‌ ఒక్కటే ఉండవు. ఎంఆర్‌పీ, ఇతర వివరాలూ ఉండవు. కొబ్బరి బొండాల విక్రయదారులు వద్ద ఉండే ప్లాస్టిక్‌ బాటిళ్లలో చిన్నసైజు ఇవి. అర లీటరు, పావు లీటరు సారా పట్టే సీసాలు తెగ తయారవుతున్నాయి. సారా వ్యాపారులు వీటిలోకి నాటుసారా పట్టి హుందాగా వ్యాపారం చేస్తున్నారు. తాగేవారూ ఎవరికీ అనుమానం లేకుండా మంచినీళ్లు తాగినట్టు బాటిల్‌ చేతిలో పట్టుకుని గడగడా తాగేస్తున్నారు. ఇంతకుముందు రాజమహేంద్రవరం రూరల్‌, రాజానగరం మండలంలోని పలు గ్రామాలలోనే నాటు సారా బట్టీలు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు అన్నిచోట్లా విస్తరించాయి. ఏజెన్సీ, కాకినాడ, కోనసీమ, మెట్ట ప్రాంతంలో ఎక్కడ చూసినా నాటు సారా లభ్యమవుతోంది. మధ్యాహ్నం, రాత్రి వేళల్లో జోరుగా విక్రయాలు సాగిపోతున్నాయి. కష్టజీవులే కాకుండా యువకులు కూడా అలవాటు చేసుకోవడంతో మరి ప్రమాదంగా మారింది. ప్రభుత్వం మద్యం ధరలు ఎక్కువగా ఉండడంతోపాటు సారా తక్కువ ధరకే లభించడం వల్ల అందరూ దీనిపై పడ్డారు. లీటరు నాటు సారా రూ. 160 నుంచి 200 వరకూ ఉంది. రాజమహేంద్రవరం రూరల్‌, రాజానగరం మండలంలోని పలు గ్రామాలో లీటరు నాటుసారా  కేవలం రూ.160కి లభ్యం కావడం గమనార్హం. అర లీటరు బాటిల్‌ మాత్రం రూ.100కి అమ్ముతున్నారు.పావు లీటరు సారా బాటిల్‌ రూ.50కి అమ్మేస్తున్నారు. దీంతో కష్టజీవులు, వృత్తి పనులు చేసుకునేవారు, గ్రామాలు, నగరాల్లో రకరకాల పనులు చేసుకునేవారు ఎక్కువగా ఇది తాగేస్తున్నారు. దీంతో నల్లబెల్లం అమ్మకాలు కూడా పెరిగాయి. వాటితోపాటు వివిధ రకాల పదార్థాలు, రసాయనాలు కూడా వాడుతున్నారు. ఈ నాటుసారా చాలా ప్రాణాంతకం. కానీ గ్రామాల్లో ఎవరూ పట్టించుకోవడంలేదు. ఎవరి చావు వారిది అన్నట్టు వ్యవహరిస్తున్నారు. వీటిని అరికట్టడానికి స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఉన్నప్పటికీ, ఈ నాటు సారా తయారీ, రవాణా, విక్రయం, తాగడం ఆగడం లేదు. అధికారులు ప్రతీరోజూ ఏదో మూల ఎవరినో పట్టుకున్నప్పటికీ ఇది ఆగడం లేదంటే కచ్చితంగా ఇందులో ఏదో లొసుగు ఉండే ఉంటుందని ప్రజలు అనుమానిస్తున్నారు. లంకలు, జీడితోటలు, అడవిలా వివిధ చెట్లతో ఉన్న పొలాల వద్ద సారా బట్టీలు ఎక్కువగా ఉన్నాయి. లక్షల కొలదీ బెల్లం ఊట తయారు చేస్తున్నారు. వీటి తయారీకి కొందరు తమ పొలాలను లీజుకివ్వడం గమనార్హం. గతంలో తయారు చేయడం, రవాణా చేయడం, అమ్మడంతో పాటు భూమిని లీజుకివ్వడం కూడా నేరమేనని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆచరణలో ఏదీ అమలు కావడం లేదు. దీంతో ప్యాకెట్లు, బాటిళ్ల రూపంలో మందుబాబుల చేతుల్లోకి చేరిపోతున్నాయి.