Abn logo
Mar 5 2021 @ 00:33AM

ఆమె అన్నిటా సగం!

బౌద్ధంలో శీలం చాలా ప్రధానమైనది. సాధారణంగా శీలం అంటే కేవలం మహిళల పాతివ్రత్యానికి మాత్రమే భావిస్తాం. కానీ ‘‘శీలం అంటే ‘మంచి నడవడిక’, అది స్త్రీ పురుష బేధం లేకుండా మానవులందరికీ చెందినది’’ అని తొలిసారిగా ప్రవచించిన ప్రబోధకుడు బుద్ధుడు. అంతేకాదు, మహిళలకు చదువులో, అధికారంలో, ఆస్తిలో, సంస్కృతిలో, ధార్మిక మార్గంలో భాగం కల్పించినవాడు కూడా ఆయనే! 


ఆడపిల్ల జన్మించిందని తెలిసి, తన రాజ్యానికి వారసుడు కలగలేదని దుఃఖిస్తున్న కోసలరాజు ప్రసేనజిత్తుతో-

‘‘రాజా! మగపిల్లలకు కల్పించే సౌకర్యాలన్నీ కల్పించి, విద్యల్లో, యుద్ధ విద్యల్లో ప్రావీణ్యత కలిగిస్తే... ఆడపిల్లలు కూడా రాణించడమే కాదు... మగపిల్లలకన్నా ముందుంటారు’’ అని చెప్పాడు బుద్ధుడు. ఆ అమ్మాయిని అన్ని విద్యల్లో తీర్చిదిద్దేలా చేశాడు. ఆమె పెరిగి, పెద్దదై... కొంతకాలానికి కోసలకు యువరాణి అయింది. ఆ తరువాత మగధకు మహారాణి అయింది. ఆమె పేరు వజీర లేదా వజ్రకుమారి.


చరిత్రలో మహోన్నత విప్లవం- స్త్రీలకు భిక్షు దీక్ష ఇవ్వడం, ఆరామాల్లో విద్యలు నేర్పడం, వారితో ధర్మ ప్రబోధాలు చేయించడం, ధార్మిక హక్కు కల్పించడం. తన ధర్మం కన్నా మహిళా సాధికారతే ముఖ్యమని తలచి మహిళా సంఘాన్ని నిర్మించడం. బుద్ధుడు తాను నడిచే ధర్మ మార్గంలోకి తన కుమారుణ్ణీ, సోదరులనూ, బంధు మిత్రుల్నీ తీసుకురావడమే కాదు... తన తల్లినీ, భార్యను సైతం భిక్షుణీలుగా మార్చాడు. వారికి మహోన్నత ధార్మిక జీవనాన్ని కల్పించాడు. 


ఇక సాధారణ కుటుంబ జీవనంలో కూడా స్త్రీల అణచివేతను బౌద్ధం అంగీకరించలేదు. మహిళలు కేవలం వంటింటికి మాత్రమే పరిమితం కారాదనీ, గృహాన్ని నడపడంలో, ఇంటి పూర్తి ఆర్థిక విధానాలను అమలు చేయడంలో స్త్రీలకే హక్కు ఉండాలనీ చెప్పాడు బుద్ధుడు. భార్యను కానీ, ఇతర కుటుంబ స్త్రీలను గానీ తక్కువ చేసి మాట్లాడినా, ఏకవచనంతో సంబోధించినా, అలాంటి పిలుపులతో పిలిచినా హింసగానే పరిగణించాలన్నాడు. మహిళలను సగౌరవంగా పిలవడం బౌద్ధ సంస్కృతిలో ఒక భాగం. ‘స్త్రీలకు స్వర్గార్హత లేదు. అది పురుషులకు మాత్రమే’ అనే భావజాలం బలీయంగా ఉన్న ఆనాటి కాలంలో - ‘స్వర్గం అంటూ ఉంటే... స్త్రీలకు కూడా ఆ అర్హత ఉంటుంది’ అనే విప్లవాత్మక భావాలతో అనేక బౌద్ధ కథలు వచ్చాయి. 


మహిళా స్వేచ్ఛను చాటిచెప్పే ఒక జాతక కథ ఇది:

ఒక గ్రామంలో సునందుడు, భార్గవి అనే భార్యాభర్తలు ఉండేవారు. వారికి ఇద్దరు సంతానం. ఆ దంపతులిద్దరూ పరమ ధార్మికులు. ఒక రోజు, హిమాలయాల నుంచి నలుగురు తాపసులు ఆ గ్రామానికి వచ్చారు. వారికి ఆతిథ్యం ఇచ్చాక, వారి ఉపదేశం విన్న భర్త-

‘‘భార్గవీ! నేనూ ధార్మిక మార్గంలోకి వెళ్ళిపోతాను. గృహ త్యాగం చేస్తాను. తాపసిగా మారి పుణ్యగతులు పొంతుదాను. నీవు నా ఆస్తికి వారసురాలిగా ఉండి, మన బిడ్డలను చక్కగా పెంచి పెద్ద చెయ్యి’’ అన్నాడు.


అప్పుడు ఆమె ‘‘ఆ పని మీరే చేయండి. నేను గృహత్యాగం చేస్తాను. తాపసిని అవుతాను’’ అంటూ భర్తకు బిడ్డలను అప్పగించి, హిమాలయాలకు వెళ్ళింది. తపస్సు చేసి, ధ్యాన ఫలాన్ని పొందింది. ఇల్లు వదలి వెళ్ళేటప్పుడు ఆమె చెప్పిన ఒక శ్లోకం (గాథ) ఆధునికులను సైతం ఆశ్చర్యపరుస్తుంది.


‘‘నేను ఇంతకాలం పురుషుని హస్తాల్లో ఉన్నాను. రెక్కలు వచ్చిన పక్షి ఒంటరిగా, స్వేచ్ఛగా ఆకాశంలో సంతోషంగా ఎగిరిపోతున్నట్టు... నేనూ ఈ పురుష సంకెళ్ళను తెంచుకొని ధార్మిక ఆకాశంలో ఎంతో సంతోషంగా ఎగిరిపోతున్నాను’’ అని ఆ శ్లోకానికి అర్థం.


ఇలా అనేక రూపాల్లో స్త్రీ స్వేచ్ఛా గీతమై పల్లవించింది బౌద్ధం. ‘ఆమె అవనిలో సగం, ఆకాశంలో సగం మాత్రమే కాదు... ధర్మంలోనూ సగం... అన్నింటా సగమే!’ అని ప్రపంచానికి చాటింది బుద్ధ వాణి.

బొర్రా గోవర్ధన్‌

Advertisement
Advertisement
Advertisement