Abn logo
May 23 2020 @ 14:04PM

ఇసుక మాఫియాతో వైసీపీ నేతలు కోట్లు దండుకుంటున్నారు: బోండా ఉమ

అమరావతి: జగన్ పాలనలో అభివృద్ధి తిరోగమనంలో ఏపీ మొదటి స్థానంలో ఉందని టీడీపీ నేత బోండా ఉమ విమర్శించారు. ఏడాది కాలంలో కార్మికుల నుంచి వ్యాపారస్తుల వరకు అన్ని వర్గాల నడ్డి విరిచారన్నారు. ఇసుక మాఫియాతో వైసీపీ నాయకులు కోట్లు దండుకున్నారని ఆరోపించారు. వైసీపీ అనాలోచిత చర్యలకు 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు 6 నెలల పాటు పస్తులు ఉన్నాయన్నారు. 


రాష్ట్రంలోని పరిశ్రమలన్నీ తరలిపోయాయని.. గడిచిన ఏడాదిలో ఒక్క రూపాయి పెట్టుబడి కూడా రాష్ట్రానికి రాలేదని బోండా ఉమ పేర్కొన్నారు. జననం నుంచి మరణం వరకు చంద్రబాబు అన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. జగన్ పాలనలో ప్రజలు సంక్షేమాన్ని మరిచిపోయారన్నారు. 5 రూపాయలకే కడుపు నిండా భోజనం పెట్టే అన్న క్యాంటీన్లను తీసివేశారన్నారు. పెళ్లి కానుక, చంద్రన్న బీమా, నిరుద్యోగ భృతి, కాపు కార్పొరేషన్ రుణాలు అన్నింటినీ నిర్వీర్యం చేశారని బోండా ఉమ పేర్కొన్నారు.