Abn logo
Jul 29 2021 @ 01:11AM

కర్ణాటక సీఎంగా బొమ్మై ప్రమాణం

బెంగళూరు, జూలై 28(ఆంధ్రజ్యోతి): కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బసవరాజ బొమ్మై బుధవారం ‘దేవుడి పేరిట’ ప్రమాణస్వీకారం చేశారు. బెంగళూరులోని రాజ్‌భవన్‌ గ్లాస్‌ హౌస్‌లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌.. బొమ్మైతో ప్రమాణస్వీకారం చేయించారు. బీజేపీ అధిష్ఠానం పరిశీలకులుగా కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్‌, కిషన్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి అరుణ్‌సింగ్‌, సహ ఇన్‌చార్జి డీకే అరుణ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా వచ్చారు.


బొమ్మై ప్రమాణస్వీకారం పూర్తయిన మరుక్షణమే.. మాజీ సీఎం యడియూరప్ప నేరుగా వేదికపైకి వెళ్లి ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు. అనంతరం, నేరుగా సచివాలయానికి వెళ్లిన సీఎం బొమ్మై మంత్రివర్గంతో సమావేశం నిర్వహించారు. తొలి సమావేశంలోనే రైతుల పిల్లలకు ‘ప్రత్యేక స్కాలర్‌షిప్‌’ పథకాన్ని ఆయన ప్రకటించారు. బొమ్మైకి ఎలాంటి ఆర్‌ఎ్‌సఎస్‌ నేపథ్యమూ లేకపోవడం గమనార్హం. సోషలిస్టు భావాలున్న నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది.