Abn logo
Aug 7 2020 @ 03:33AM

పవన్‌తోనూ బంధం తెంచుకుంటారా?

  • రాజధానిపై గందరగోళం తగదంటే సస్పెన్షనా?
  • పార్టీ పెద్దలకు ఫోన్లో అన్నీ చెప్పా: ఓవీ రమణ

అమరావతి, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): ‘ఇప్పటికీ జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ రాజధాని అమరావతే అంటున్నారు.. మరి ఆయనతో తెగదెంపులు చేసుకుంటారా? ధైర్యముంటే ప్రకటన చేయండి’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఆ పార్టీ నుంచి సస్పెండైన నేత ఓవీ రమణ సవాల్‌ చేశారు. బలిజ ఉద్యమ నాయకుడిగా, టీటీడీ బోర్టు సభ్యుడిగా రాయలసీమలో బలమైన వాణి వినిపించే ఆయన 9 నెలల క్రితమే పార్టీలో చేరారు. రాజధాని విషయంలో బీజేపీ వైఖరిని ప్రశ్నిస్తూ పత్రికల్లో వ్యాసం రాసినందుకు ఆగ్రహించిన పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆయన్ను బుధవారం సస్పెండ్‌ చేసింది. దీనిపై ఆయన గురువారం విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. ‘రాజధాని విషయంలో గందరగోళం తగదని సూచన చేశాను..


అదే పెద్ద నేరమైతే రాష్ట్ర రాజధాని అమరావతేనని కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడి హోదాలో తీర్మానాలు, దీక్షలు, ప్రకటనలు చేయలేదా? ఒక్క ఇంచ్‌ కూడా కదలబోదని ఎంపీ సుజనా చౌదరి ఎన్నిసార్లు చెప్పలేదు? రాష్ట్ర నాయకత్వం గుంటూరులో చేసిన తీర్మానానికి వ్యతిరేకంగా జీవీఎల్‌ ఢిల్లీలో మాట్లాడలేదా? సుబ్రమణ్యస్వామి తిరుపతిలో, రామ్‌మాధవ్‌ హైదరాబాద్‌లో ఏమి మాట్లాడారో తెలీదా..? ఇంతమందికి వర్తించని రూల్స్‌ పార్టీలో నాకొక్కడికే వర్తిస్తాయా? నోటీసు ఇవ్వకుండా సస్పెండ్‌ చేసే సంప్రదాయం ఎక్కడైనా ఉందా’ అని వీర్రాజును నిలదీశారు. ‘నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం బలపడుతూ అభివృద్ధి చెందుతోందని ఢిల్లీలో పార్టీలో చేరా.. సిద్ధాంతాలతో బతికే పార్టీలో పూర్తి భిన్నంగా నాయకులు వ్యవహరిస్తుండడం పార్టీకి నష్టం కలిగిస్తుంది.. ఇదే విషయాన్ని ఈ రోజు ఉదయమే ఢిల్లీ నుంచి ఫోను చేసిన పార్టీ పెద్దలకు చెప్పా.. అధ్యక్షుడు మారినప్పుడల్లా పార్టీ వైఖరి మారుతుందా.? అమరావతిపై విధానం ఏంటో చెప్పండి.. గందరగోళం ఎందుకు.? సొంత పార్టీ ఎంపీ మొత్తుకుంటున్నా రక్షణ కల్పించని వైసీపీ.. జీవీఎల్‌కు పోలీసు జీపుతో ఎందుకు రక్షణ కల్పిస్తోందో అందరికీ తెలుసు’ అని అన్నారు. 

Advertisement
Advertisement
Advertisement