Abn logo
Jan 20 2021 @ 18:59PM

ఎన్నికల తర్వాతే ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటన : బీజేపీ

కోల్‌కతా : త్వరలో జరిగే పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల కోసం ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగా ప్రకటించబోమని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలిపింది. ఎన్నికల్లో గెలిచిన తర్వాతే ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. 


బీజేపీ జనరల్ సెక్రటరీ, పశ్చిమ బెంగాల్ బీజేపీ ఇన్‌ఛార్జ్ కైలాశ్ విజయవర్గీయ బుధవారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగా ప్రకటించబోమని చెప్పారు. శాసన సభ ఎన్నికల్లో మెజారిటీ సాధించిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి కావాలో పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారన్నారు. 


పశ్చిమ బెంగాల్ శాసన సభలో 294 స్థానాలు ఉన్నాయి. ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో 200కు పైగా స్థానాలను గెలుస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. బీజేపీ అద్యక్షుడు జేపీ నడ్డా, ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇప్పటికే అనేకసార్లు రోడ్ షోలు, సభలు నిర్వహించారు. ఇక మీదట వీరితోపాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా రాష్ట్రంలో సభలు నిర్వహించాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. నేతాజీ సుభాశ్ చంద్రబోస్ 125వ జయంత్యుత్సవాల సందర్భంగా మోదీ ఈ నెల 23న కోల్‌కతాలో ఓ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. 


Advertisement
Advertisement
Advertisement