Abn logo
Jun 3 2020 @ 05:41AM

నీటి హక్కుల కోసం బీజేపీ ధర్నా

నెల్లూరు(వ్యవసాయం), జూన్‌ 2 : నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో జిల్లాకు కృష్ణా నది నుంచి కేటాయించిన నికర జలాలు 30 టీఎంసీల నీటిని ఇవ్వాలని కోరుతూ బీజేపీ నాయకులు మంగళవారం సోమశిల ప్రాజెక్టు ఎస్‌ఈ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మిడతల రమేష్‌ మాట్లాడుతూ సాగర్‌ కుడికాలువ ద్వారా నికర జాలాల విడుదలకు ప్రకాశం జిల్లా కురిచేడు వద్ద క్రాస్‌ రెగ్యులేటర్‌ను నిర్మించి కాలువ నిర్మాణానికి సర్వే రాళ్లు నాటారన్నారు. ఆర్థిక భారం వల్ల కాలువను అర్ధంతరంగా ఆపివేయడంతో జిల్లా రైతాంగం ఆందోళన చేసిందన్నారు.


అందుకు స్పందించిన నాటి కేంద్ర జలవనరుల మంత్రి హాసీస్‌ మహమ్మద్‌ ఇబ్రహీం,  రెండో విడత పనుల ద్వారా జిల్లాకు నీరందిస్తామని పార్లమెంటులో హామీ ఇచ్చారన్నారు. కానీ కాలువ పనులు కొనసాగలేదన్నారు. అదేవిధంగా తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా చెన్నై వాసుల దాహార్తి తీర్చేందుకు నీటి తరలింపునకు సంబంధించిన ఒప్పందం ప్రకారం కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలు వాటి వాటా నీటిని విడుదల చేయకుండా మోసం చేశాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సాయి శ్రీనివాసులు, జగన్మోహన్‌రావు, సుబ్బారెడ్డి, బండారు సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement