Abn logo
Mar 6 2021 @ 01:44AM

బియ్యం మూటల లోడింగ్‌ మా వల్ల కాదు

చేతులెత్తేసినసంచార వాహనదారులు

వాహనాలను వెనక్కు ఇచ్చేస్తామంటూ తహసీల్దార్‌ కార్యాలయానికి తీసుకువచ్చిన వైనం

చర్చలు జరిపిన తహసీల్దార్‌, పౌరసరఫరాల ఏఎస్‌వో

ఈ నెల వరకు రేషన్‌ పంపిణీకి అంగీకరించిన వాహనదారులు


గొలుగొండ, మార్చి 5: ఇంటింటికీ రేషన్‌ పంపిణీ తమ వల్ల కాదంటూ మండలంలోని సంచార వాహనదారులు చేతులెత్తేశారు. ఆయా వాహనాలను తహసీల్దార్‌కు అప్పగించేందుకు శుక్రవారం మండల రెవెన్యూ కార్యాలయానికి వచ్చారు. మండలంలో 38 రేషన్‌ డిపోల పరిధిలో రేషన్‌ సరకుల పంపిణీకి ప్రభుత్వం 13 మందికి వాహనాలను మంజూరు చేయగా, వీరిలో 10 మంది తమ వాహనాలతో వచ్చారు. తహసీల్దార్‌ వెంకటేశ్వరరావు, పౌరసరఫరాల ఏఎస్‌వో రాజు వారితో చర్చించారు. మీ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని హామీ ఇచ్చారు. దీంతో మార్చి నెల వరకు రేషన్‌ పంపిణీ చేస్తామంటూ వాహనదారులు వెళ్లిపోయారు. ఈ సందర్భంగా రేషన్‌ పంపిణీ వాహనదారులు విలేఖరులతో మాట్లాడుతూ, ఇంటింటికీ రేషన్‌ పంపిణీలో అనేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. రేషన్‌ దుకాణం నుంచి బియ్యం, కందిపప్పు, పంచదార బస్తాలను హమాలీల మాదిరిగా తామే వ్యాన్‌లోకి లోడింగ్‌ చేసుకోవాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. పంపిణీ సమయంలో కార్డుదారుల వేలి ముద్రలను ఈ-పోస్‌ యంత్రంలో నమోదు చేసుకుని, బియ్యం తూకం వేసి ఇస్తున్నామని చెప్పారు. బియ్యం బస్తాల తూకంలో తేడా వుంటున్నదని, దీంతో ఒక్కో వాహనదారుడు 500 నుంచి 2,000 రూపాయల వరకు డీలర్లకు చెల్లించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. రేషన్‌ డిపో నుంచి వ్యాన్‌లోకి బియ్యం లోడింగ్‌, ఈ-పోస్‌ యంత్రంలో వేలి ముద్రల నమోదు పనులను తాము చేయబోమని, బియ్యం తూకం వేసి ఇవ్వడం వరకే తమ పని అని చెప్పారు.  మండల అధికారుల హామీ మేరకు ఈ నెల వరకు రేషన్‌ పంపిణీ చేస్తామని, సమస్యలు పరిష్కరించకపోతే వచ్చే నెల నుంచి రేషన్‌ పంపిణీ చేసేది లేదని వారు స్పష్టం చేశారు.

Advertisement
Advertisement
Advertisement