Abn logo
Oct 20 2021 @ 23:09PM

రాష్ట్రంలో బీహార్‌ తరహా వాతావరణం

పల్లా శ్రీనివాసరావు

రూల్‌ ఆఫ్‌ లా పరిస్థితి లేదు

టీడీపీ ‘విశాఖ’ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు

విశాఖపట్నం, అక్టోబరు 20: రాష్ట్రంలో రూల్‌ ఆఫ్‌ లా అటకెక్కిందని, బీహార్‌ తరహా పరిస్థితులు నెలకొన్నాయని తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. పార్టీ పిలుపునిచ్చిన బంద్‌ సందర్భంగా బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. అధికార పార్టీ చేసే తప్పుల్ని ప్రజల తరపున ఎత్తిచూపే బాధ్యత ప్రతిపక్షానిదని, విమర్శలు చేసే వారి గొంతు నొక్కుతారా? అని ప్రశ్నించారు.


అధికార పార్టీ విమర్శలు తట్టుకునే శక్తిని కోల్పోయి అప్రజస్వామికంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. పార్టీ కార్యాలయాలపై దాడులకు నిరసనగా బంద్‌కు పిలుపునిస్తే అర్ధరాత్రి నుంచే టీడీపీ నాయకుల్ని ఎక్కడికక్కడ అరెస్టు చేశారన్నారు. రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోందని, గ్రామాల్లో సైతం లభిస్తోందన్నారు. బూతులు సంస్కృతికి తెరలేపిందే వైసీపీ నాయకులు కొడాలి నాని, అంబటి రాంబాబు, అనిల్‌కుమార్‌ యాదవ్‌ వంటి వారని, రాష్ట్ర చరిత్రలో ఇటువంటి సంస్కృతి ఎప్పుడూ లేదన్నారు.


డీజీపీ ఇప్పటికైనా ఐపీఎస్‌గా తన గౌరవాన్ని నిలబెట్టుకోవాలని అన్నారు. దాడులకు పాల్పడడం టీడీపీ సంస్కృతి కాదని, కానీ దాడిచేస్తే ప్రతిదాడులు తప్పవని హెచ్చరించారు. దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకుంటే న్యాయపరంగా పోరాడుతామన్నారు. పార్టీ నాయకుడు శ్రీభరత్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో బీహార్‌ తరహా వాతావరణం చూసి భయం వేస్తోందన్నారు. ఎంతో మంచిపేరున్న రాష్ట్రానికి చెడ్డపేరు తెస్తున్నారని ధ్వజమెత్తారు.


ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ప్రణవ్‌గోపాల్‌, పుచ్చా విజయ్‌కుమార్‌, సర్వశిద్ధి అనంతలక్ష్మి, మహ్మద్‌గౌస్‌, షేక్‌రహ్మతుల్లా, బొట్టా పరదేశియాదవ్‌, ఆరేటి మహేష్‌, కోరాడ రాజబాబు, ఈతలపాక సుజాత తదితరులు పాల్గొన్నారు.