Abn logo
Sep 13 2020 @ 16:02PM

మోడ్రన్ భగీరథ.. కొండపై గంగమ్మను ఒంటిచేత్తో..

Kaakateeya

బక్కచిక్కిన శరీరం. భుజంపై తుండుగుడ్డ. ఒంటిపై ఓ పొట్టి లాగు. ఎండిపోయిన డొక్కలు. బోసి నోరు. అయినా జీవం చావని కళ్లు.. కష్టానికి బెదరని ధైర్యం.. ఇవీ భూయన్‌ను చూడగానే కనిపించే లక్షణాలు. గయ ప్రాంతంలోని కోతిలావా గ్రామవాసి ఇతను. గ్రామంలో ఉన్న ఒకే ఒక్క చెరువు నీరు వ్యవసాయానికి సరిపోవడం లేదని, ఊరిపక్కనే ఉన్న కొండపై నుంచి ప్రతిసారీ జారిపోయే వర్షపు నీటిని చెరువులోకి చేరిస్తే బాగుంటుందని భావించాడు. అలా చేయడానికి కాలువ తవ్వించే ఆర్థిక స్థోమత లేదు. మిగతా వారు ఈ విషయాన్ని పట్టించుకునే పరిస్థితిలో లేరు. అన్నీ ఆలోచించి ఓ డేరింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఎవర్నో ఎందుకు అడగడం ఎంత కాలమైనా, ఎంత కష్టమైనా తన స్వహస్తాలతో తనే ఓ కాలువ తవ్వేయాలనుకున్నాడు.

గ్రామంలో చెరువు నీరు అడుగంటినప్పుడల్లా పంటలకు నీళ్లొదిలేయాల్సిందే. చెమట చిందించి వేసిన పంట చేదికందక తోటి రైతులు పడే బాధను కళ్లారా చూసిన భూయన్‌.. ఈ పరిస్థితిని ఎలాగైనా మార్చాలని నిర్ణయించుకున్నాడు. అంతే కొండపై నుంచి కిందకు జారే నీటిని ఊళ్లోకి తీసుకురావాలని అనుకున్నాడు. ఎవరూ తన వెంట రాలేదు. తన ఆలోచనే ఓ కామెడీ అంటూ నవ్విన వారూ ఉన్నారు. అయినాసరే భూయన్ పట్టుదల సడల్లేదు. తనను తక్కువ అంచనా వేసిన వారందరి నోళ్లూ చేతులతో కాకుండా, చేతలతో మూయించాలని డిసైడయ్యాడు. 30 ఏళ్లు కష్టపడి 3కిలోమీటర్ల కాలువ తవ్వి, చెరువులోకి నీరు తీసుకొచ్చాడు.

తన కష్టం ఫలించి, కొండపై నీటిధారను చెరువుతో కలిపిన క్షణం భూయన్ ఆనందనాకి హద్దుల్లేవు. మొహమంతా నోరు చేసుకొని నవ్వేశాడు. తన కల నెరవేరిందంటూ ఎదురైన దూడకు, ఆవుకు, పక్కింటి మిత్రుడికి అందరికీ చెప్పి సంతోంతో ఊగిపోయాడు. ఇంతటి ఘనకార్యం చేసి కూడా.. 'ఊళ్లో కొద్దోగొప్పో చదువుకున్నోళ్లంతా పొట్టకూటి కోసం పట్టణాలకు వెళ్లిపోతున్నారు. నా వెంట వచ్చిన వాళ్లెవరూ లేరు. అయినా నేనేమీ బాధపడలేదు. నేను చేయాలనుకున్న పని చేశానంతే' అంటూ బోసినవ్వులు నవ్వుతున్నాడు. 30ఏళ్ల కష్టం పెట్టుబడిగా పెట్టిన భూయన్.. 3కిలోమీటర్ల కాలువ తవ్వి, కష్టానికి ఫలితం ఉంటుందని నిరూపించాడు. ఇప్పుడీ తాత కథ చాలా మందికి స్ఫూర్తిదాయకం. సోషల్ మీడియాలో భూయన్‌ ఘనకార్యాన్ని ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు. ఎంతోమంది స్ఫూర్తి పొందుతున్నారు. కొతియాలా గ్రామస్తులు కూడా భూయన్‌కు ధన్యవాదాలు చెప్తున్నారు. తమకోసం ఇంతటి దీక్షపూనిన అతనికి రుణపడిపోయామని, ఈ రుణం ఎన్నటికీ తీర్చుకోలేమని ఆనందభాష్పాలు రాలుస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement