Oct 15 2021 @ 11:49AM

చంపేస్తామంటూ Big Boss కంటెస్టెంట్‌కు బెదిరింపు ఫోన్ కాల్స్..!

బిగ్ బాస్ సీజన్ 14లో పాల్గొన్నాడు బాలీవుడ్ సింగర్ రాహుల్ వైద్య. ఆ తరువాత, ఆయనకి మంచి గుర్తింపే వచ్చింది. అయితే, బిగ్ బాస్ 15 కొనసాగుతోన్న వేళ ఈ ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్‌కి బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. చంపేస్తామనీ, భౌతిక దాడులు చేస్తామనీ, కేసులు పెడతామని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారట. ఎవరు అంటారా? గుజరాత్‌లోని ‘శ్రీ మొగల్ మాతా’ భక్తులు!

గుజరాత్‌లో స్థానికంగా జనం కొలిచే అమ్మవారి స్వరూపం మొగల్ మాతా. ఆమె ప్రస్తావన తన నవరాత్రి స్పెషల్ సాంగ్‌లో చేశాడు రాహుల్ వైద్య. ‘గర్భే కీ రాత్’ పేరుతో కొద్ది రోజుల క్రితమే ఆయన పాట ఆన్‌లైన్‌లో విడుదలైంది. రాహుల్ వైద్యతో పాటూ నటి నియా శర్మ కూడా ఇందులో కనిపించింది. అయితే, రాహుల్ పాడుతూ, తెర మీద కూడా కనిపించిన ‘గర్భే కీ రాత్’ క్రమంగా వివాదాస్పదమైంది. ‘మొగల్ మాతా’ అన్న మాట తప్పుడు ఉద్దేశంతో వాడారంటూ గుజరాతీలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు.

తమ పాటలో ‘మొగల్ మాత’ను స్మరించుకోవటం దురుద్ధేశంతో చేసింది కాదని రాహుల్ వైద్య టీమ్ మీడియాకు వివరణ ఇచ్చింది. అయినా కూడా తమ వల్ల చాలా మంది హర్ట్ అయ్యారని వారు అంగీకరించారు. అందుకే, పాటని మార్చేయబోతున్నారట. మొగల్ మాత ప్రస్తావన లేకుండా మార్పులు చేర్పులు చేస్తామని అంటున్నారు. కానీ, తమకు కొంత సమయం కావాలని వారు అభ్యర్థిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా ఎడిట్ చేసిన సాంగ్ జనం ముందుకు తెస్తామని హామీ ఇస్తున్నారు...

మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్, సింగర్ రాహుల్ వైద్య, ఈ సమస్య నుంచీ ఎప్పటికి బయటపడతాడో... చూడాలి మరి!    

 

Bollywoodమరిన్ని...