Oct 19 2021 @ 11:54AM

సంక్రాంతి సినిమాల బడ్జెట్‌ ఎంత? బిజినెస్‌ ఏ మేరకు!

పండగ సీజన్‌ అంటే సినీ ప్రియులకు పెద్ద పండగే! ప్రతి పండగకు కొత్త సినిమాలు వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతాయి. కరోనాతో కుదేలైన సినీ పరిశ్రమ, థియేటర్‌ వ్యవస్థ ఇప్పుడిప్పుడే దార్లోకి వస్తున్నాయి. ఈ విపత్కర పరిస్థితి వల్ల రెండేళ్లగా ఏ రంగంలోనూ కళ లేదు. ముఖ్యంగా రంగుల ప్రపంచం అయిన సినీరంగంపై కరోనా ప్రభావం ఎక్కువ చూపింది. మధ్యలో కరోనా విజృంభణ తగ్గడంతో అడపాదడపా సినిమాలు రిలీజ్‌ అయినా ప్రేక్షకులు భయంభయంతో థియేటర్లకు వెళ్లి చూశారు. దాని వల్ల సినిమా రెవెన్యూ  బాగా దెబ్బతింది. ఇప్పుడిప్పుడే ప్రేక్షకులు థియేటర్లలో అడుగుపెడుతున్నారు. దాంతో నిర్మాతలు కూడా తమ చిత్రాలను ఓటీటీకి కాకుండా థియేటర్‌లోనే విడుదల చేయడానికి మొగ్గుచూపుతున్నారు. వినాయక చవితితో థియేటర్లతో సినిమా సందడి మొదలైనా.. దసరా సమయానికి అతి మరింత బలపడింది. దసరా పండుగకు విడుదలైన ‘మహా సముద్రం’, ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’, పెళ్లిసందడి’ చిత్రాలు మంచి వసూళ్లు రాబట్టాయి. రానున్న దీపావళి, క్రిస్మస్‌ పండుగలకు సినిమాలు వరుస కడుతున్నాయి. 


అన్నీ బడా చిత్రాలే... 

తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి అంటేనే సినిమా రంగానికి పెద్ద పండుగ. సంక్రాంతి అనగానే స్టార్‌ హీరోల సినిమాలు విడుదలకు పోటీపడతాయి. రానున్న సంక్రాంతి కూడా ప్రేక్షకులకు రెట్టింపు ఉత్సాహం కలిగించేలా ఉండబోతోంది. ఈసారి సంక్రాంతి వారం రోజుల ముందే మొదలుకానుంది. కరోనా వల్ల వాయిదా పడుతూ వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం సంక్రాంతికి వారం రోజుల ముందు అంటే జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. అగ్రహీరోలు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ నటించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాతోపాటు మరి కొన్ని చిత్రాలు కూడా ముందే డేట్లు రిజర్వ్‌ చేసుకున్నాయి. పవన్‌కల్యాణ్‌ – రానా కథానాయకులుగా ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతున్న ‘భీమ్లానాయక్‌’ జనవరి 12న థియేటర్లలో సందడి చేయనుంది. 13న మహేష్‌బాబు ‘సర్కారు వారి పాట,  14న ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’ చిత్రాల విడుదలకు సిద్ధమయ్యాయి. విక్టరీ వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌ హీరోలుగా నటిస్తున్న ‘ఎఫ్‌3’ కూడా సంక్రాంతి బరిలోనే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి సంక్రాంతి సీజన్‌ అగ్ర కథానాయకుల చిత్రాలతో సందడి చేయనుంది. వసూళ్లు కూడా భారీ స్థాయిలోనే ఉంటాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. పండగ బడ్జెట్‌ ఎంత? 

సంక్రాంతి బరిలో ఇప్పటికి నాలుగు భారీ చిత్రాలు క్యూలో ఉన్నాయి. అన్నీ బడా హీరోల చిత్రాలే. అందులోనూ భారీ బడ్జెట్‌ చిత్రాలు! ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ బడ్జెట్‌ దాదాపుగా 400 కోట్లు అని వినికిడి. ‘భీమ్లా నాయక్‌’ రూ.100 కోట్లకుపైగా, సర్కారువారి పాట కూడా దాదాపుగా అంతే! ‘రాధేశ్యామ్‌’ బడ్జెట్‌ మాత్రం రూ.300 కోట్లు అని మేకర్స్‌ మొదటి నుంచి చెబుతున్నారు. అలా చూసుకుంటే సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల బడ్జెట్‌ రూ. 900 కోట్ల పై చిలుకు. ఈ నాలుగు చిత్రాలు సంక్రాంతి బరిలో ఎంత బిజినెస్‌ చేస్తాయి? అంటే.. సుమారుగా 1200 కోట్ల బిజినెస్‌ చేస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ మేరకు చేస్తేనే ఆయా చిత్రాల నిర్మాతలు సేఫ్‌ జోన్‌లో ఉంటారట. ఈ నాలుగు చిత్రాలు దాదాపుగా ప్యానల్‌ ఇండియా స్థాయిలో విడుదలయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి 1200 కోట్లు వ్యాపారం జరిగే అవకాశం బలంగానే కనిపిస్తోంది. దీన్ని బట్టి నిర్మాతలకు కాసుల పంట పండే అవకాశం ఉందన్నది ట్రేడ్‌ వర్గాల మాట.