Advertisement
Advertisement
Abn logo
Advertisement

టెన్నిస్‌కు ‘మెంటల్ బ్రేక్’.. కెనడా స్టార్ బియాంక సంచలన పోస్ట్

మాంట్రియల్: కెనడా టెన్నిస్ స్టార్, యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ బియాంక ఆండ్రీస్కు సంచలన ప్రకటన చేసింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ సహా తర్వాతి సీజన్ నుంచి ‘మెంటల్ బ్రేక్’ తీసుకుంటున్నట్టు తెలిపింది. కరోనా బారినపడి చాలా రోజులపాటు ఐసోలేషన్, క్వారంటైన్‌లో గడపడం తనపై తీవ్ర ప్రభావం చూపిందని బియాంక ఆవేదన వ్యక్తం చేసింది.


వాటి నుంచి తాను బయటపడేందుకు కొంత సమయం అవసరమని పేర్కొంది. అందుకే ఆస్ట్రేలియన్ ఓపెన్ సహా వచ్చే సీజన్ నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపింది. రెండేళ్లుగా తాను ఎదుర్కొన్న శారీరక, మానసిక సమస్యలు, సవాళ్ల నుంచి తనను తాను రీసెట్ చేసుకుని, పుంజుకుని వస్తానంటూ ట్విట్టర్‌లో షేర్ చేసిన ఓ పోస్టులో పేర్కొంది.


21 ఏళ్ల బియాంక 2019లో యూఎస్ ఓపెన్‌ను ఎగరేసుకుపోయి సంచలనం సృష్టించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో కరోనా బారినపడి పలు టోర్నమెంట్లకు దూరమైంది. వచ్చే సీజన్‌కు దూరమవుతున్న తాను ఆ సమయాన్ని శారీరకంగా, మానసికంగా పుంజుకోవడానికి ఉపయోగిస్తానని వివరించింది.


ఈ ఏడాది తాను కొన్ని రోజులపాటు క్వారంటైన్‌లో గడపాల్సి వచ్చిందని, ఇది తనను మానసికంగా, శారీరకంగా తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని, తనపై తీవ్ర ప్రభావం చూపిందని వాపోయింది. దీనికి తోడు తన నాయనమ్మ కరోనాతో కొన్ని వారాలపాటు ఐసీయూలో చికిత్స తీసుకుందని, ఇది కూడా తనను తీవ్రంగా బాధించిందని ఆవేదన వ్యక్తం చేసింది.


‘‘చాలా రోజులపాటు నేను నాలాగా ఉండలేకపోయాను.  మరీ ముఖ్యంగా శిక్షణ సమయంలోను, మ్యాచ్‌లు ఆడుతున్నప్పుడు అలా అనిపించేది. ప్రపంచం మొత్తాన్ని నా భుజాలపై మోస్తున్నట్టుగా భావించేదానిని. నా చుట్టూ ఏదో విచారం, గందరగోళం అలముకున్నట్టు ఉండేది. అందుకని ఈ ఏడాది ఆస్ట్రేలియాలో నా సీజన్ ప్రారంభించను. నన్ను నేను నిరూపించుకోవాలంటే  మరింత సమయం అవసరం. 2022 టెన్నిస్ సీజన్ కోసం శిక్షణ తీసుకుని సన్నద్ధమవుతా’’ అని బియాంక తన సుదీర్ఘ పోస్టులో వివరించింది.  

Advertisement
Advertisement