Abn logo
Jul 28 2021 @ 23:38PM

వద్దన్నచోటనే...

భూమిపూజ చేస్తున్న అధికారులు

- మడ్డువలస నిర్వాసిత భూమిలో సచివాలయం, రైతుభరోసా కేంద్రాల నిర్మాణానికి భూమిపూజ

- గతంలో అడ్డుకున్న అధికారులు

- ఆ భూమిలోనే తాజాగా పనులు ప్రారంభం

- అధికారుల తీరుపై స్థానికుల మండిపాటు 

వంగర, జూలై 28: వంగరలో గ్రామ సచివాలయం, రైతుభరోసా కేంద్రాల నిర్మాణం..వివాదాస్పదమవుతోంది. గతంలో మడ్డువలస రిజర్వాయర్‌ ప్రాజెక్టు(ఎంఆర్‌పీ)కు సంబంధించిన స్థలంలో వీటిని నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు మడ్డువలస నిర్వాసిత భూమిలో(సర్వే నెంబర్‌ 272-2) కొంతకాలం కిందట వీటి నిర్మాణానికి కాంట్రాక్టర్‌ సిద్ధమయ్యాడు. దీనిపై గ్రామానికి చెందిన కొందరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని కోరారు. దీంతో మడ్డువలస అధికారులు దర్యాప్తు చేసి.. నిర్మాణాలను అడ్డుకోవడంతో కాంట్రాక్టర్‌ వెనుదిరిగాడు. తర్వాత తహసీల్దార్‌ కార్యాలయ ప్రాంగణంలో వీటిని నిర్మించాలని రెవెన్యూ అధికారులు భావించారు.  గ్రామంలో రెండు పార్టీల మధ్య ఈ వివాదం జఠిలమైంది. దీంతో ఎంఆర్‌పీ భూమిలో నిర్మాణాలు చేపట్టనీయబోమని ఒక వర్గం పట్టుబట్టింది. అదే భూమిలో నిర్మాణాలు చేపడతామని మరో వర్గం పంతానికి పోయింది. ఈ క్రమంలో బుధవారం ప్రత్యేకాధికారి జయప్రకాష్‌, తహసీల్దార్‌ ఐజాక్‌లు ఈ స్థలంలో సచివాలయం, రైతుభరోసా కేంద్రాల నిర్మాణానికి భూమిపూజ చేశారు. దీనిపై కొందరు స్థానికులు ప్రశ్నించారు. గతంలో ఎంఆర్‌పీ స్థలంగా గుర్తించి.. ఇప్పుడెలా భూమి పూజ చేస్తారని మండిపడ్డారు. ఇది నిర్వాసిత భూమిగా తహసీల్దార్‌ కూడా ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారని గుర్తుచేశారు. ఈ విషయమై హైకోర్టును ఆశ్రయించేందుకు సన్నద్ధమవుతున్నారు.  


నిబంధనలివీ..  

నిబంధనల ప్రకారం ఎంఆర్‌పీ భూమిలో ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు నిర్మించరాదు. గతంలో కలెక్టర్‌ ధనుంజయరెడ్డి.. ఈ భూముల్లో ఉపాధిహామీ పథకం ద్వారా మొక్కలు నాటాలని సూచించారు. ఈ స్థలాన్ని ఎవరు ఆక్రమించినా చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్‌ సిబ్బందికి ఆదేశించారు. కానీ, దానికి విరుద్ధంగా అధికారులు ఎందుకు వ్యవహరించారనేది చర్చనీయాంశమవుతోంది. 


కలెక్టర్‌ ఆదేశాల మేరకే..

వంగరలో సచివాలయం, రైతుభరోసా కేంద్రాల నిర్మాణానికి స్థలం లేదు. దీంతో ఎంఆర్‌పీ భూమిలో నిర్మాణాల కోసం ఉన్నతాధికారులకు నివేదిక పంపాం. ఈ విషయాన్ని ఇటీవల గ్రామ సందర్శనకు వచ్చిన కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాం. ఆయన ఆదేశాల మేరకే భూమి పూజ చేశాం. 

- ఐజాక్‌, తహసీల్దార్‌, వంగర  


 తహసీల్దార్‌ అనుమతితో.. 

వంగరలోని ఎంఆర్‌పీ భూమిలో గతంలో ఇంజనీరింగ్‌ సిబ్బంది పనులు అడ్డుకున్న మాట వాస్తవమే. కానీ,  సర్వేనెంబర్‌ 272 -2లో నిర్మాణాలు చేపట్టవచ్చని మంగళవారం తహసీల్దార్‌ అనుమతి ఇచ్చారు. దీంతో కొలతలకు అంగీకరించా. 

- శివమనోజ్‌, జేఈ, పీఆర్‌