Abn logo
Sep 26 2021 @ 23:54PM

నేటి బంద్‌కు.. సంఘీభావం

నరసరావుపేటలో భారత్‌ బంద్‌ పోస్టర్లను ఆవిష్కరిస్తున్న అఖిలపక్షం నేతలు

అన్ని రాజకీయ, ప్రజా సంఘాల మద్దతు

డిపోలకే పరిమితం కానున్న ఆర్టీసీ బస్సులు

సెలవు ప్రకటించిన విద్యాసంస్థల యాజమాన్యాలు


గుంటూరు, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతుల ఉద్యమానికి 300 రోజులుపూర్తి అవుతున్న సందర్భంగా సోమవారం సంయుక్త కిసాన్‌ మోర్చా భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌ని విజయవంతం చేసి అందరం రైతుల పక్షాన ఉన్నామని తెలియజేసేందుకు జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీతో పాటు సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌ పార్టీలు బంద్‌లో ప్రత్యక్షంగా పాల్గొంటున్నట్లు ప్రకటించాయి. వివిధ ప్రజాసంఘాలు కూడా బంద్‌కు సంపూర్ణ మద్దతిస్తున్నట్లు పేర్కొన్నాయి. బంద్‌ సందర్భంగా ఆర్‌టీసీ బస్సులు మధ్యాహ్నం వరకు డిపోలకే పరిమితమం కానున్నాయి. ప్రైవేటు స్కూళ్లు, కళాశాలలకు ఆయా యాజమాన్యాలు ముందే సెలవు ప్రకటించాయి. సినిమా థియేటర్లలో కూడా ఉదయం ఆటని పలు యాజమాన్యాలు రద్దు చేశాయి. బంద్‌ సందర్భంగా ప్రదర్శన నిర్వహించనున్నట్లు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పేర్కొన్నారు. బంద్‌ దృష్ట్యా ప్రతీ సోమవారం జరిగే డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు డీఆర్వో కొండయ్య ఒక ప్రకటనలో తెలిపారు. రైతు ఉద్యమానికి రెడ్‌ సెల్యూట్‌ పేరుతో సీపీఐ పోస్టరుని విడుదల చేసింది. బంద్‌కు కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌వలి, మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావులు ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు రాజీవ్‌గాంధీభవన్‌ నుంచి ర్యాలీ నిర్వహించి బంద్‌ పాటించనున్నట్లు తెలిపారు. బంద్‌కు చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ మద్దతు తెలియజేస్తుందని చాంబర్‌ జిల్లా అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు. రైతు చట్టాలతో పాటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తలపెట్టిన భారత్‌బంద్‌లో వ్యాపారవర్గాలు హాజరై విజయవంతం చేయాలని  ఆయన పిలుపునిచ్చారు.