Abn logo
Sep 18 2021 @ 00:26AM

భగ్గుమన్న టీడీపీ

టీడీపీ కార్యాలయం వద్ద ప్లకార్డులతో నేతల నిరసన

  1. జగన్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌
  2. చంద్రబాబు ఇంటిపై దాడికి తీవ్ర నిరసన  


తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నివాసంపై రాళ్ల దాడిని పార్టీ జిల్లా నాయకులు తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన జోగి రమేష్‌తోపాటు వైసీపీ గూండాలను అరెస్టు చేయాలని కర్నూలు, నంద్యాల నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. జిల్లా వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తించారు. 


 కర్నూలు (అగ్రికల్చర్‌), సెప్టెంబరు 17: వైసీపీ నాయకుల దుర్మార్గం పరాకాష్టకు చేరిందని, ముఖ్యమంత్రిగా జగన్‌రెడ్డి సిగ్గుపడాల్సిన సంఘటన ఇది అని టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఆలూరు, పాణ్యం నియోజకవర్గాల ఇన్‌చార్జిలు కోట్ల సుజాతమ్మ, గౌరు చరిత, కోడుమూరు ఇన్‌చార్జి ఆకెపోగు ప్రభాకర్‌ అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ ఈ ఘటనకు బాధ్యత వహించాలని, తమ నేత చంద్రబాబు నాయుడుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. తన అనుచరులను ఇప్పటికైనా సీఎం అదుపులో పెట్టుకోవాలని అన్నారు. నగరంలోని పార్టీ  జిల్లా కార్యాలయం వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు. పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌ తన అనుచరులతో చంద్రబాబునాయుడు నివాసంపై దాడికి పూనుకోవడం అప్రజాస్వామిక చర్య అని, జగన్‌ రాక్షస పాలనకు ఈ ఘటన నిదర్శనమని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ నాయకులు తప్పు చేస్తే విమర్శించే హక్కు, ప్రజల పక్షాన మాట్లాడే బాధ్యత ప్రతిపక్షాలకు ఉందని, ప్రతిపక్ష నాయకులు తప్పు చేస్తే స్పందించే హక్కు అధికార పార్టీపై ఉంటుందని అన్నారు. అధికారం ఉంది కదా అని దాడులకు పూనుకోవడం అప్రజాస్వామికమని అన్నారు. సమస్య ఉంటే రోడ్లపై, ముఖ్య కూడళ్ల వద్ద నిరసన వ్యక్తం చేసే హక్కు ఉంటుందని, కానీ ఏకంగా నాయకుల ఇంటిపైనే దాడికి పూనుకోవడం మంచి పద్ధతి కాదని అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ ప్రమేయం లేకుండా జోగి రమేష్‌ ఇంతటి చర్యకు దిగలేరన్నారు. చంద్రబాబును చూస్తే జగన్‌కు వణుకు పుడుతోందని, తమ అధినాయకుడిని ఎలా ఎదుర్కోవాలో తెలియక అప్రజాస్వామిక చర్యలకు తన అనుచరులను జగన్‌ ఉసిగొల్పడం దారుణమని అన్నారు. అన్ని రాజకీయ పక్షాల వారికి ఇలాంటి పరిస్థితి ఏదోరోజు రాక తప్పదని, టీడీపీ నేతపై జరిగిన దాడిని అన్ని విపక్షాల నాయకులు ఖండించాలని పిలుపునిచ్చారు. అందరూ ఏకతాటిపై నిలిచి ముఖ్యమంత్రి జగన్‌ చర్యలకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈరోజు జరిగిన ఘటన చూసి కొందరు వైసీపీ నాయకులే సిగ్గు పడుతున్నారన్నారు. అయ్యన్న పాత్రుడు తప్పుగా ఏమీ మాట్లాడలేదని, ఆయన వ్యాఖ్యలను పరిశీలిస్తే ఈ విషయం అర్థం అవుతుందని సోమిశెట్టి అన్నారు. గతంలో మంత్రులు అనిల్‌కుమార్‌, కొడాలి నాని ఎలా మాట్లాడారో ప్రజలకు తెలుసన్నారు. జరిగిన ఘటనపై సీఎం జగన్‌ కనీసం స్పందించలేదంటే.. ఈ చర్యల వెనుక ఆయన ప్రమేయం కచ్చితంగా ఉందని అర్థమౌతోందని అన్నారు. ప్రభుత్వం ప్రజలపై విపరీతమైన పన్నుల భారం మోపుతోందని, ఈ అంశాన్ని గురించి తమ నాయకుడు అయ్యన్నపాత్రుడు మాట్లాడారని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఏకంగా తమ అధినేత ఇంటిపైనే విచక్షణ లేకుండా ఎమ్మెల్యే జోగి రమేష్‌ దాడికి పూనుకోవడం సభ్యసమాజం తలదించుకునేలా ఉందని అన్నారు. 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రి, మూడు పర్యాయాలు ప్రతిపక్ష నాయకుడిగా పని చేసిన చంద్రబాబు ఇంటిపై దాడికి దిగడం వారి తెలివి తక్కువ తనానికి నిదర్శనమని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్‌ పెరుగు పురుషోత్తం రెడ్డి, కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ మహిళా కమిటీ అధ్యక్షురాలు ముంతాజ్‌బేగం, నాయకులు జేమ్స్‌, హనుమంతరావు చౌదరి, అబ్బాస్‌, కొరకంచి రవికుమార్‌, సత్రం రామకృష్ణుడు, గున్నా మార్క్‌, ప్రభాకర్‌ యాదవ్‌, మహేష్‌గౌడు, బజారన్న, రాజు యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.