Abn logo
Jun 4 2020 @ 09:22AM

పగలు.. పంతాలు

పంతానికి పోయిన సందీప్

పగబట్టిన పండు

తల్లి మాటలతో మరింత కర్కశంగా..

కేసులో కీలకంగా మారిన వన్‌టౌన్ బ్యాచ్

ఆ ముగ్గురు అదృశ్య నేరగాళ్లు ఎవరు?

పండుకు మతిస్థిమితం లేదని ముందే ధ్రువీకరణ పత్రం

గంజాయి అమ్మడంలో, యువతకు అలవాటు చేయడంలో సూత్రధారి అతనే..


విజయవాడ(ఆంధ్రజ్యోతి): బెజవాడలో ఒక్కసారిగా కలకలం రేపిన గ్యాంగ్‌వార్‌ వెనుక కథ ఏంటి? అసలు సందీప్‌, పండుకు మధ్య వివాదాలు చంపుకొనే స్థాయికి ఎందుకు చేరాయి? ఓ అపార్ట్‌మెంట్‌ సెటిల్‌మెంట్‌ విషయంలో మహదేవపురం కాలనీకి చెందిన ధనేకుల శ్రీధర్‌కు, యనమలకుదురుకు చెందిన ప్రదీప్‌రెడ్డి మధ్య వివాదంలో వీరెందుకు జోక్యం చేసుకున్నారు? సోనాలిక్‌ నాగబాబు ఎవరు? తల్లి అన్న మాట ప్రకారమే పండు.. సందీప్‌ను కక్షకట్టి చంపాడా? పండు మానసిక పరిస్థితి లేదన్న ధ్రువీకరణ పత్రాన్ని అతని తల్లి ఎందుకు తీసుకొచ్చింది? ఒక్కసారిగా కత్తులు దూసిన గ్యాంగ్‌వార్‌లో తవ్వేకొద్దీ పగలు.. పంతాలు వెలుగులోకి వస్తున్నాయి. 


ఎవరీ నాగబాబు..?

సోనాలిక్‌ నాగబాబు.. గ్యాంగ్‌వార్‌లో వినిపిస్తున్న పేరు. ట్రాక్టర్ల డీలర్‌గా ఉన్న నాగబాబు ఇటీవల బిల్డర్‌గా మారాడు. స్థానిక ఎన్నికల్లో పోటీచేస్తున్న ఓ పార్టీ అభ్యర్థికి ఎన్నికల ఖర్చు సర్దుతానని భరోసా ఇచ్చినట్టు సమాచారం. కంకిపాడులోని ఒక పోలీస్‌స్టేషన్‌లో నాగబాబు చెప్తే జరగని పనంటూ ఉండదు. పోలీసులతో సంబంధాలను కొనసాగిస్తూనే నాగబాబు తాడిగడపలో ఒక పెద్ద మనిషిగా అవతరించాడు. ధనేకుల శ్రీధర్‌, ప్రదీప్‌రెడ్డితో సిట్టింగ్‌కు ముహూర్తం నిర్ణయించింది నాగబాబే. పేకాటలో నాగబాబుకు, సందీప్‌కు మధ్య స్నేహం ఏర్పడింది. సందీప్‌ వద్ద ఉన్న కుర్రోళ్లను చూసి అతడ్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నాడు.


ఈ ఆలోచనతో తాడిగడపలో నాగబాబు, సందీప్‌కు కామన్‌ ఫ్రెండ్‌కు చెందిన కోళ్లదొడ్డిలో ప్రదీప్‌, శ్రీధర్‌ మధ్య సిట్టింగ్‌ ఏర్పాటు చేశాడు. దానికి సందీప్‌ను పిలిచాడు. ఒక సిట్టింగ్‌ పూర్తయ్యాక శ్రీధర్‌.. పండుకు ఫోన్‌ చేసినట్టు సమాచారం. ఆ తర్వాత జరిగిన సిట్టింగ్‌కు పండు వెళ్లాడు. కాసేటికి వెళ్లిన సందీప్‌ అతడ్ని చూసి రెచ్చిపోయినట్టు సమాచారం. దీంతో సందీప్‌.. పండు కాలర్‌ పట్టుకున్నాడు. అక్కడే ఉన్న నాగబాబు, మరికొంతమంది వారిని విడదీసి చెరోపక్కకు పంపేశారని తెలిసింది. 


సందీప్‌ను చంపాకే ఇంటికి రా...

అప్పటి వరకు తన వద్ద తిరిగిన పండు ఎదురు తిరగడంతో సందీప్‌కు కోపం వచ్చింది. ఈ గొడవ జరిగిన రోజు రాత్రే సందీప్‌ కొంతమంది అనుచరులను సనత్‌నగర్‌ రామాలయం వద్ద ఉన్న పండు ఇంటికి పంపాడు. అప్పటికి పండు ఇంట్లోనే ఉన్నాడు. కొడుకును రహస్యంగా ఇంట్లో దాచిపెట్టిన తల్లి పద్మ మరో ఆరుగురు మహిళలతో కలిసి కారం డబ్బాలు, పూలకుండీలను వాళ్లపైకి విసిరేసింది. దీంతో వారంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇది జరగడానికి ముందే పండుకు సందీప్‌ ఫోన్‌చేసి తిట్టాడు. అదేస్థాయిలో అతడూ తిట్టాడు.


తర్వాత ఆరోజు రాత్రే పండు, తన తల్లి పద్మకు మధ్య వివాదం జరిగింది. ఈ విషయంలో పండు ఆమెను దూషించాడు. పట్టుదలకు పోయిన పద్మ ‘సందీప్‌ను చంపితేనే ఇంటికి రా..’ అని తిట్టింది. పండుపై పోలీసుల రికార్డుల ప్రకారం ఉన్న కేసులు మూడే అయినా, వ్యవహారాలు మాత్రం చాలా ఉన్నాయి. కొడుకు తరచూ గొడవలకు వెళ్లడం, ఎవరినో ఒకర్ని కొట్టడంతో అతడి మానసిక పరిస్థితి బాగోలేదన్న ధ్రువీకరణ పత్రాన్ని పద్మ తీసుకొచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.


గంజాయిలో మునిగితేలి..

పండు నిత్యం గంజాయి తీసుకుంటాడు. తన వెంట తిరిగేవాళ్లకూ దాని రుచి చూపించాడు. పండు విజయవాడలో సుమారు రెండేళ్ల నుంచి గంజాయిని విక్రయిస్తున్నాడని సమాచారం. ఒక హత్య కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు రౌడీషీటర్ల ద్వారా పండుకు గంజాయి సరుకు అందుతోంది. హైస్కూల్‌ రోడ్డు, సనత్‌నగర్‌, కానూరు, పటమట ఆర్టీసీ కాలనీలో యువతను గంజాయి మత్తులో దించారు. తాడిగడపకు చెందిన ఈ ఇద్దరు రౌడీషీటర్లు సబ్‌జైలులో శిక్ష అనుభవిస్తున్నప్పుడు గంజాయి బ్యాచ్‌తో పరిచయం ఏర్పడింది. వారికి వన్‌టౌన్‌కు చెందిన మరో ఇద్దరు రౌడీషీటర్లు పరిచయమయ్యారు. ఇందులో ఒక రౌడీషీటర్‌ కేవలం గంజాయిపైనే రూ.80లక్షలు సంపాదించినట్టు తెలుస్తోంది.


అతడితో పరిచయం పెంచుకున్న పండు గంజాయిను అమ్మడం మొదలుపెట్టాడు. ఆ రౌడీషీటర్‌ నెలకు రూ.20లక్షల సరుకును పండుకు ఇస్తాడని తెలుస్తోంది. తన వద్ద తిరిగే యువకులతో రహస్యంగా దీన్ని అమ్మిస్తున్నాడు. వీరంతా కలిసి కానూరులోని 80 అడుగుల రోడ్డులో డెన్‌ ఏర్పాటు చేసుకునేవారు. అక్కడే గంజాయి తాగడం, అమ్మడం చేస్తారు. పండు మాత్రం పటమట డొంకరోడ్డులోని గ్యాంగ్‌వార్‌ జరిగిన ఖాళీ స్థలంలో కూర్చుని గంజాయిని అమ్మేవాడని స్థానికులు చెబుతున్నారు. 


స్థానిక యువకులకూ గంజాయి అమ్మకాలు

పటమటతో పాటు కానూరు, తాడిగడప, తాడేపల్లిలోని యువతకు ఈ గంజాయి మత్తును అంటించారు. తాడేపల్లిలో సీఎం నివాసం ఉండటం, పోలీసుల నిఘా పెరగడంతో ఆ గ్యాంగ్‌ అంతా ఇక్కడికి వలస వచ్చేసింది. నెల క్రితం కానూరు చిన్న వంతెన వద్ద పండును కట్టేసి స్థానికులు కొట్టినట్టు సమాచారం. సందీప్‌తో వివాదమైన రోజు నుంచే గంజాయిని బాగా తీసుకుని ఆ మత్తులో అతడ్ని చంపేస్తానని స్నేహితులు, కనిపించే వారితో చెప్పేవాడు. అతడి అనుచరులూ ఇదే మాట చెప్పినట్టు తెలిసింది.


సందీప్‌ వర్గంపైకి రాళ్లు వేగంగా రువ్వడానికి, ఇష్టానుసారంగా కత్తులు తిప్పడానికి ఈ మత్తే కారణమని తెలుస్తోంది. గొడవ జరిగిన రోజున సందీప్‌ వెంట వన్‌టౌన్‌, తాడిగడప, ఉయ్యూరుకు చెందిన యువకులు వచ్చినప్పటికీ పండు గ్యాంగ్‌ చేసిన దాడికి ఆగలేక పారిపోయారు. సందీప్‌ వెంట కత్తితో పాటు తన తమ్ముడ్ని కూడా తీసుకెళ్లాడు. తమ్ముడిపై పండు వర్గంలోని వ్యక్తి ఎటాక్‌ చేస్తుండడంతో అడ్డుకోవడానికి వెళ్లిన సందీప్‌ను ఆ వ్యక్తే బ్లేడ్‌తో కోసినట్టు తెలుస్తోంది. పండు మాట్లాడుతూ కారం చల్లి కత్తితో దాడి చేశాడన్న వాదనా వినిపిస్తోంది. ఆ సమయంలో వన్‌టౌన్‌కు చెందిన ఇద్దరు రౌడీషీటర్లు గంజాయి సేవించి పండు పక్కనే ఉన్నారని సమాచారం. 


ఇవి కూడా చదవండి:

-----------------------

పోలీసుల విచారణలో.. పండు గురించి కొత్తకొత్త విషయాలు వెలుగులోకి..


పిన్న వయసులోనే పెద్ద చరిత్రలు


గ్యాంగ్‌వార్‌!

Advertisement
Advertisement
Advertisement