Abn logo
Sep 21 2021 @ 00:27AM

బెంగళూరు బేజారు

  • 92కే ఢమాల్‌
  • వణికించిన రస్సెల్‌, వరుణ్‌
  • 9 వికెట్లతో కోల్‌కతా ఘనవిజయం


విరాట్‌ కోహ్లీ, డివిల్లీర్స్‌, మ్యాక్స్‌వెల్‌.. ఒంటిచేత్తో మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చగల సత్తా ఈ సూపర్‌స్టార్స్‌ త్రయం సొంతం. కానీ కోల్‌కతా బౌలర్ల ముందు వీరి ప్రతాపం ఏమాత్రం పనిచేయలేదు. మిగతా వారూ బ్యాట్లెత్తేయడంతో జట్టు స్కోరు కనీసం వంద పరుగులు కూడా చేరలేదు. ఆ తర్వాత కేకేఆర్‌ ఓపెనర్లు గిల్‌, వెంకటేశ్‌ అయ్యర్‌ ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించి రెండో దశ లీగ్‌లో తమ జట్టుకు శుభారంభం అందించారు.


అబుదాబి: కోల్‌కతా నైట్‌రౌడర్స్‌ ఆల్‌రౌండ్‌ షో ముందు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు బేజారెత్తింది. ముందుగా బౌలింగ్‌.. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ విరుచుకుపడడంతో కేకేఆర్‌ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. అటు విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌ జట్టులో ఉన్నా ఆర్‌సీబీ దారుణంగా చతికిలపడింది.  ఓపెనర్‌ దేవ్‌దత్‌ (22) టాప్‌ స్కోరర్‌గా నిలిచిన ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 19 ఓవర్లలో 92 పరుగులకే కుప్పకూలింది. పేసర్‌ ఆండ్రీ రస్సెల్‌ (3/9), స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి (3/13) బెంగళూరును వణికించారు. ఫెర్గూసన్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత స్వల్ప ఛేదనలో ఓపెనర్లు గిల్‌ (34 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 48), వెంకటేశ్‌ అయ్యర్‌ (27 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 41 నాటౌట్‌) విశేషంగా రాణించడంతో కోల్‌కతా 10 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 94 పరుగులు చేసి గెలిచింది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా వరుణ్‌ చక్రవర్తి నిలిచాడు.సునాయాసంగా..: గాయం నుంచి పూర్తి స్థాయిలో కోలుకున్న ఓపెనర్‌ గిల్‌ బ్యాటింగ్‌లో చెలరేగాడు. తొలి మ్యాచ్‌ ఆడిన మరో ఓపెనర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ కూడా సహకరించడంతో స్కోరు రాకెట్‌ వేగంతో దూసుకెళ్లింది. ఐదో ఓవర్‌లో గిల్‌ రెండు ఫోర్లు, అయ్యర్‌ సిక్సర్‌తో 16 పరుగులు వచ్చాయి. అలాగే ఆరో ఓవర్‌లో గిల్‌ మరో రెండు ఫోర్లు బాదడంతో పవర్‌ప్లేలోనే జట్టు 56 పరుగులు సాధించింది. అయితే అర్ధసెంచరీకి రెండు పరుగుల దూరంలో పదో ఓవర్‌లో గిల్‌ను చాహల్‌ అవుట్‌ చేశాడు. అప్పటికే తొలి వికెట్‌కు 82 పరుగులు రాగా అదే ఓవర్‌లో అయ్యర్‌ మూడు ఫోర్లు సాధించి మ్యాచ్‌ను ముగించాడు.


పోరాటమే లేదు..: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ తీసుకున్న బెంగళూరు శుభారంభం దక్కలేదు. కోల్‌కతా బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీసి జట్టును కుదురుకోనీయలేదు. అలాగే మధ్యలో తొమ్మిది ఓవర్లపాటు కనీసం ఫోర్‌ కూడా సాధించలేకపోయింది. ముఖ్యంగా మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి బంతులకు విలవిల్లాడింది. రెండో ఓవర్‌లోనే కెప్టెన్‌ కోహ్లీ (5)ని ప్రసిధ్‌ ఎల్బీ చేశాడు. దీనిపై అతడు రివ్యూకు వెళ్లినా ఫలితం లేకపోయింది. ఆ తర్వాత ఆర్‌సీబీ తరఫున తొలి మ్యాచ్‌ ఆడిన  కేఎస్‌ భరత్‌తో కలిసి దేవ్‌దత్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ జోడీ కాసేపు కేకేఆర్‌ బౌలర్లను ఎదుర్కొని పవర్‌ప్లేలో 41 పరుగులు జత చేసింది. అయితే మూడు ఫోర్లతో జోరు మీదున్న దేవ్‌దత్‌ ర్యాంప్‌ షాట్‌ ఆడే ప్రయత్నంలో కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో రెండో వికెట్‌కు 31 పరుగుల అత్యధిక భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత తొమ్మిదో ఓవర్‌లో రస్సెల్‌ రెండు వికెట్లతో జట్టుకు భారీ షాక్‌ ఇచ్చాడు. ఆత్మవిశ్వాసంతో కనిపించిన భరత్‌ తొలి బంతికి  పుల్‌ షాట్‌ ఆడి డీప్‌ స్క్వేర్‌ లెగ్‌లో గిల్‌కు క్యాచ్‌ ఇవ్వగా డివిల్లీర్స్‌ (0)ను యార్కర్‌తో బౌల్డ్‌ చేశాడు. దీంతో 63 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఆదుకుంటాడనుకున్న మ్యాక్స్‌వెల్‌ (10) కూడా నిరాశపరిచాడు. భారీ షాట్లు ఆడే క్రమంలో స్పిన్నర్‌ వరుణ్‌ ఓవర్‌లో బౌల్డయ్యాడు. మరుసటి బంతికే హసరంగ (0) గోల్డెన్‌ డకౌట్‌ కావడంతో ఆర్‌సీబీ పీకల్లోతు కష్టాల్లో పడింది.  సచిన్‌ బేబి (7)ని కూడా అతడే పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత హర్షల్‌ (12) రెండు ఫోర్లతో  ఆకట్టుకున్నా ఉపయోగం లేకపోయింది. 19వ ఓవర్‌లో సిరాజ్‌ (8)ను రస్సెల్‌ అవుట్‌ చేయడంతో ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌ ముగిసింది. 


200 

విరాట్‌ కోహ్లీకి ఇది ఆర్‌సీబీ తరఫున 200వ ఐపీఎల్‌ మ్యాచ్‌. ఒకే జట్టుకు ఇన్ని మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌ అయ్యాడు.


స్కోరుబోర్డు

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు: కోహ్లీ (ఎల్బీ) ప్రసిధ్‌ కృష్ణ 5; దేవ్‌దత్‌ (సి) దినేశ్‌ కార్తీక్‌ (బి) ఫెర్గూసన్‌ 22; భరత్‌ (సి) గిల్‌ (బి) రస్సెల్‌ 16; మ్యాక్స్‌వెల్‌ (బి) వరుణ్‌ చక్రవర్తి 10; డివిల్లీర్స్‌ (బి) రస్సెల్‌ 0; సచిన్‌ బేబి (సి) రాణా (బి) వరున్‌ చక్రవర్తి 7; హసరంగ (ఎల్బీ) వరుణ్‌ చక్రవర్తి 0; జేమిసన్‌ (రనౌట్‌) 4; హర్షల్‌ (బి) ఫెర్గూసన్‌ 12; సిరాజ్‌ (సి) వరుణ్‌ చక్రవర్తి (బి) రస్సెల్‌ 8; చాహల్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 19 ఓవర్లలో 92 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-10, 2-41, 3-51, 4-52, 5-63, 6-63, 7-66, 8-76, 9-83, 10-92. బౌలింగ్‌: వరుణ్‌ చక్రవర్తి 4-0-13-3; ప్రసిధ్‌ కృష్ణ 4-0-24-1; ఫెర్గూసన్‌ 4-0-24-2; నరైన్‌ 4-0-20-0; రస్సెల్‌ 3-0-9-3.


కోల్‌కతా నైట్‌రైడర్స్‌: గిల్‌ (సి) సిరాజ్‌ (బి) చాహల్‌ 48; వెంకటేశ్‌ అయ్యర్‌ (నాటౌట్‌) 41; రస్సెల్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 10 ఓవర్లలో 94/1. వికెట్‌ పతనం: 1-82. బౌలింగ్‌: సిరాజ్‌ 2-0-12-0; జేమిసన్‌ 2-0-26-0; హసరంగ 2-0-20-0; చాహల్‌ 2-0-23-1; హర్షల్‌ 2-0-13-0. 

క్రైమ్ మరిన్ని...