Abn logo
Jul 12 2020 @ 03:50AM

ఖాళీలు..కష్టాలు!

గ్రామీణులకు అందని వైద్యం, అరకొర సిబ్బందితో సేవలు

పదోన్నతిపై చేవెళ్ల, పట్నం డిప్యూటీ డీఎంహెచ్‌వోలు

వారి స్థానంలో కొనసాగుతున్న ఇన్‌చార్జిలు 

ఖాళీగా దర్శనమిస్తున్న డీఐవో పోస్టు 

ఆమనగల్లులో ఎనిమిదేళ్లుగా సివిల్‌ సర్జన్‌ పోస్టు ఖాళీ


వర్షాలు కురుస్తున్నాయి. సీజనల్‌ వ్యాధులు ప్రభలుతున్నాయి. పల్లె ప్రజలు  ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో ఏర్పడిన ఖాళీలతో రోగులకు కష్టాలు ఎదురవుతున్నాయి.


ఉన్న అరకొర వైద్య సిబ్బందితో గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు వైద్యం అందని ద్రాక్షలా మారింది. రోగమొచ్చి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్తే పట్టించుకునే వారు కరువయ్యారు. 


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : గ్రామీణ ప్రాంతాల ప్రజలకు స్థానికంగా వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం మండల కేంద్రాలు, పెద్ద గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పల్లెలో ఉప కేంద్రాలు ఏర్పాటు చేసింది. జిల్లాలో 30 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా పట్టణ ఆరోగ్య కేంద్రాలు 16 ఉన్నాయి. అలాగే రెండు సామాజిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. స్థానికంగా ఉండాల్సిన వైద్య సిబ్బంది పట్టణాల్లో, తమ స్వస్థలాల్లో ఉంటూ అప్పుడప్పుడు చుట్టపు చూపులా వచ్చిపోతున్నారు. దీంతో సమయానికి వైద్యం అందడం లేదు. 


జిల్లాలో డీఐవో పోస్టు ఖాళీగా ఉంది. చేవెళ్ల డిప్యూటీ డీఎంహెచ్‌వోగా విధులు నిర్వహిస్తున్న జయచంద్రమోహన్‌ నారాయణపేట డీఎంహెచ్‌వోగా వెళ్లారు. దీంతో ఆయన స్థానంలో కొత్తూరు డాక్టర్‌ దామోదర్‌ చేవెళ్ల డిప్యూటీ డీఎంహెచ్‌వోగా కొనసాగుతున్నారు. అలాగే ఆలూరు డాక్టర్‌ పోస్టు ఖాళీగా ఉండటంతో మైసిగండి డాక్టర్‌ అబ్ధుల్‌ అజీం డిప్యూటేషన్‌పై ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆలూరు పీహెచ్‌సీలో రెండు ఏఎన్‌ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇబ్రహీంపట్నం డిప్యూటీ డీఎంహెచ్‌వో గద్వాల జిల్లా వైద్యాధికారిగా వెళ్లడంతో పోస్టు ఖాళీ ఏర్పడింది. ఐదేళ్లుగా ఆమనగల్లు ఆసుపత్రిలో సివిల్‌ సర్జన్‌ పోస్టు ఖాళీగా దర్శనమిస్తోంది.


వివిధ విభాగాల్లో 18 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొత్తూరు పీహెచ్‌సీలో ఫార్మసిస్టు, ల్యాబ్‌టెక్నిషియన్‌, ఇద్దరు స్టాఫ్‌ నర్సులు, కేశంపేట పీహెచ్‌సీలో డాక్టర్‌, ఇద్దరు సూపర్‌వైజర్లు, ఆరు ఏఎన్‌ఎం పోస్టులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కొందుర్గు పీహెచ్‌సీలో యూడీసీ, ఎంపీహెచ్‌ఎ్‌స ఖాళీగా ఉన్నారు. బూర్గుల పీహెచ్‌సీలో ఏఎన్‌ఎం పోస్టులు నాలుగు ఖాళీగా ఉన్నాయి. 


ఖాళీలు భర్తీ కానున్నాయి..

జిల్లాలో ఏర్పడిన ఖాళీలు భర్తీ కానున్నాయి. ఇప్పటికే వైద్య సిబ్బంది భర్తీకి సంబంధించిన తుది జాబితాను ఆన్‌లైన్‌లో ఇచ్చాము. 9 మంది డాక్టర్లతో  పాటు మరో 9 మంది స్టాఫ్‌ నర్సులు, 13 మంది ఏఎన్‌ఎంలు భర్తీ కానున్నారు. డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ పోస్టుల భర్తీకి సంబంధించి ఈనెల 7వ తేదీన కౌన్సిల్‌ కూడా పూర్తయింది. పట్నంలో ఖాళీగా ఉన్న పోస్టులో పల్లవి అనే డాక్టర్‌ చేరారు. జిల్లాలో డీఐవో పోస్టు ఇంకా భర్తీ కాలేదు. 

- జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి స్వరాజ్యలక్ష్మి

Advertisement
Advertisement