Abn logo
Sep 20 2021 @ 19:33PM

BCCI: టీమిండియా హోం సీజన్ షెడ్యూల్ విడుదల

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది తొలి అర్ధ భాగంలో వెస్టిండీస్, న్యూజిలాండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లకు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఇందులో భాగంగా నాలుగు టెస్టులు, మూడు వన్డేలు, 14 టీ20 ఆడనుంది. ఈ మేరకు 2021/22 హోం సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ నేడు విడుదల చేసింది. న్యూజిలాండ్‌, శ్రీలంకతో టీమిండియా టెస్టులు ఆడనుంది. 


కివీస్ పర్యటన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో ప్రారంభం అవుతుంది. నవంబరు 17-21 మధ్య జైపూర్, రాంచీ, కోల్‌కతాలలో ఇవి జరుగుతాయి. ఆ తర్వాత నవంబరు 25న కాన్పూరులో తొలి టెస్టు, డిసెంబరు 13న ముంబైలో రెండో టెస్టు ప్రారంభమవుతాయి. 2016 తర్వాత న్యూజిలాండ్‌కు భారత్‌లో ఇదే తొలి పర్యటన కానుంది. అప్పట్లో కివీస్ 3-0తో టెస్టు సిరీస్‌ను కోల్పోయింది. 


కివీస్ పర్యటన ముగిసిన తర్వాత ఫిబ్రవరిలో వెస్టిండీస్ పర్యటన మొదలవుతుంది. మూడు వన్డేలు, మూడు టీ20ల్లో భారత్‌తో తలపడనుంది. ఫిబ్రవరి 6-12 మధ్య అహ్మదాబాద్‌, జైపూర్, కోల్‌కతా వేదికగా మూడు వన్డేలు జరుగుతాయి. ఆ తర్వాత ఫిబ్రవరి 25 నుంచి శ్రీలంక పర్యటన ప్రారంభం అవుతుంది. ఇందులో భాగంగా రెండు టెస్టులు ఆడుతుంది. తొలి టెస్టుకు బెంగళూరు, రెండో టెస్టుకు మొహాలీ ఆతిథ్యమిస్తుంది. అది ముగిసిన తర్వాత టీ20 సిరీస్ ప్రారంభమవుతుంది. మార్చి 13న తొలి టీ20 మొహాలీలో జరుగుతుంది. రెండు, మూడు టీ20లు వరుసగా ధర్మశాల, లక్నోలో మార్చి 15, 18న జరుగుతాయి. 


ఆ తర్వాత 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం దక్షిణాఫ్రికా భారత్ చేరుకుంటుంది. జూన్ 9 నుంచి 19 మధ్య ఇవి జరుగుతాయి. చెన్నై, బెంగళూరు, నాగ్‌పూర్, రాజ్‌కోట్, న్యూఢిల్లీ వేదికలపై ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. 

ఇవి కూడా చదవండిImage Caption