Abn logo
May 28 2020 @ 03:32AM

బీసీలు మనవెంటే!

  • పార్టీ ఆవిర్భావం నుంచీ అండ
  • మరింత దగ్గర కావాలనే లక్ష్యం
  • ప్రతి నేతకూ బీసీల బాధ్యత
  • ‘మహానాడు’లో చంద్రబాబు పిలుపు

అమరావతి, మే 27 (ఆంధ్రజ్యోతి): ‘‘బడుగు, బలహీనవర్గాల రాజ్యాధికారం కోసం కృషిచేసింది తెలుగుదేశం పార్టీయే. వెనుకబడిన వర్గాలకు టీడీపీ వచ్చేదాకా ఎలాంటి రాజకీయ, సామాజిక గుర్తింపు ఉండేదికాదు. పార్టీ ఆవిర్భావంలోనే బీసీలకు పెద్దపీట వే శాం. ఆ తర్వాత అధికారంలో ఉన్నా లేకున్నా బీసీలే తెలుగుదేశానికి వెన్నెముకగా నిలిచారు’’ అని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు. బుధవారం ప్రారంభించిన మహానాడులో బీసీలతో పార్టీకి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘‘బీసీలకు చేయగలిగిందంతా చేశాం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా బీసీలకు సంక్షేమ పథకాలు అత్యధికంగా అందించాం. బీసీలకు సబ్‌ ప్లాన్‌ తెచ్చి... ఐదేళ్లలో రూ.46వేల కోట్లు వారికోసం ఖర్చుచేశాం. అయితే నాడు అధికారంలో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ప్రత్యేక దృష్టి పెట్టలేకపోయి ఉండొచ్చు. తెలిసో, తెలియకో కొన్ని పొరపాట్లు చేసి ఉండొచ్చు. వారందరినీ మళ్లీ దరిచేర్చుకోవాలి. ఈ బాధ్యత ప్రతి నాయకుడు, కార్యకర్త మీద ఉంది’’ అని చచందదబ్రాబు పిలుపునిచ్చారు. ఇప్పుడు కరోనా కాలంలో బీసీలు కష్టాల్లో ఉన్నారని... 140 బీసీ కులాల వారు వారి వృత్తుల్లేక ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పారు. వారిని ఆదుకోవాలని అన్నారు. ‘‘అన్ని ఇతర వర్గాలను తెలుగుదేశం హయాంలో ఆదరించాం. ఎస్సీలకు రూ.40వేల కోట్లు, ఎస్టీలకు రూ.12వేల కోట్ల బడ్జెట్‌ పెట్టాం. మైనారిటీ సోదరులకు బడ్జెట్‌ మూడురెట్లు చేశాం. అత్యంత వెనుకబడిన కులాలకు రూ.100కోట్లు ఇచ్చాం. బ్రాహ్మణులకు ప్రత్యేకంగా రూ.300కోట్లు అందించాం. అభివృద్ధి ద్వారా సంపద పెంచాం. పెరిగిన సంపదను సంక్షేమానికి ఖర్చుచేశాం. ఉద్యోగులను ఆదరించాం. వారికి 43శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చాం. ఉద్యోగ విరమణ వయసును 60ఏళ్లకు పెంచాం’’ అని చంద్రబాబు వివరించారు.

Advertisement
Advertisement
Advertisement