Abn logo
Oct 6 2020 @ 03:36AM

వృథాగా నాటి హాస్టల్‌ భవనం

Kaakateeya

ఆమనగల్లులో రెండేళ్ల క్రితం బీసీ హాస్టల్‌ ఎత్తివేత

నిరుపయోగంగా భవనం.. శిథిలమై కళావిహీనం 

స్థలం అన్యాక్రాంతమయ్యే అవకాశం

బీసీ గురుకులం ఏర్పాటు చేయాలని స్థానికుల విన్నపం


ఆమనగల్లు : నాడు ఎందరో విద్యార్థులకు వసతినిచ్చి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసిన బీసీ వసతి గృహం నేడు పిచ్చిమొక్కలతో నిండి కళావిహీనంగా మారింది. నాలుగు మండలాలకు కూడలిగా ఉన్న ఆమనగల్లులో దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన బీసీ వసతి గృహాన్ని అసలు ఎందుకు ఎత్తేశారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఈ విషయమై స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, విద్యార్థి సంఘాలు కనీసం స్పందించకపోవడం విమర్శలకు తావిస్తుంది. దీంతో బీసీ విద్యార్థులు వసతికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  ఎత్తి వేసిన బీసీ వసతి గృహం స్థానంలో బీసీ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలాల బీసీ విద్యార్థుల కోసం ఐదు దశాబ్దాల క్రితం ఆమనగల్లులో బీసీ వసతి గృహాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక పోలీసు స్టేషన్‌ వెనుక మాడ్గుల రోడ్డు పక్కన విశాల భవనం నిర్మించారు.


అప్పట్లో సుమారు 200మంది విద్యార్థుల వరకు వసతి గృహంలో ఉంటూ స్థానిక వివిధ పాఠశాలల్లో చదువుకునేవారు. పేద పిల్లలకు వసతి గృహం ఎంతో సౌకర్యంగా ఉండేది. కాగా ప్రజాప్రతినిధుల, అధికారుల ఉదాసీన వైఖరితో వసతి గృహంలో సమస్యలు పేరుకుపోయాయి. భవనం శిథిలావస్థకు చేరుకుంది. విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఉన్న విద్యార్థుల్లో కూడా ఎస్టీలు ఎక్కువై బీసీ విద్యార్థులు తక్కువయ్యారు. ఈ క్రమంలో 120 మంది విద్యార్థులున్న వసతి గృహాన్ని సొంత భవనంలో వసతులు లేక, భవనం కూలిపోయే దశకు చేరుకోవడంతో 2016లో కల్వకుర్తి రోడ్డులో అద్దె భవనంలోకి మార్చారు.


అక్కడ ఏడాదికే సరైన నీటి వసతి, ఇతర సౌకర్యాలు లేక విద్యార్థుల సంఖ్య సగానికి పడిపోయింది. ఇదిలా ఉంటే అప్పట్లో స్థానిక ఎస్సీ హాస్టల్లో కూడా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో జిల్లా ఉన్నతాధికారులు కొందరు వసతి గృహ అధికారుల ఒత్తిడితో అద్దె వృథా పేరిట బీసీ వసతి గృహాన్ని 2017లో ఎస్సీ వసతి గృహంలోకి మార్చారు. క్రమంగా బీసీ విద్యార్థులు తగ్గడం, స్థానికులు చొరవ తీసుకోకపోవడంతో గుట్టుచప్పుడు కాకుండా అధికారులు 2018లో ఆమనగల్లు బీసీ వసతి గృహాన్ని ఎత్తివేశారు.


దీంతో కోట్లాది రూపాయల విలువ చేసే వసతి గృహ పాత భవనం, స్థలం వృథాగా మారాయి. భవనం అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిందన్న ఆరోపణలున్నాయి. గత విద్యా సంవత్సరమే ఈ భవనాన్ని గిరిజన కళాశాల వసతి గృహానికి కేటాయించినట్లు గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పేర్కొన్నా, నేటికీ ఆ శాఖ కూడా స్థలాన్ని స్వాధీనం చేసుకోలేదు. శిథిలమైన భవనాన్ని తొలగించనూలేదు.

Advertisement
Advertisement