Abn logo
Sep 27 2020 @ 03:43AM

287 డిజైన్లలో బతుకమ్మ చీరలు

Kaakateeya

99 లక్షల చీరలు తయారీ.. అక్టోబరు రెండో వారంలో పంపిణీ

రేషన్‌ దుకాణాల ద్వారానా?.. నేరుగానా? 


హైదరాబాద్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): బతుకమ్మ చీరలు పంపిణీకి సిద్ధమయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తదుపరి బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని మహిళలందరికీ ప్రభుత్వం ఉచితంగా చీరలను పంపిణీ చేస్తోంది. ఈ సారీ రాష్ట్రంలోని 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకూ చీరలను అందించనున్నారు. 99 లక్షల చీరలను సిరిసిల్ల ప్రాంత నేతన్నలతో తయారు చేయించారు. ఇందుకోసం రూ.317.81 కోట్లు కేటాయించారు. 287 డిజైన్లలో చీరలను తయారు చేశారు.


అక్టోబరు రెండో వారంలో వీటిని పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం చీరలు జిల్లా కేంద్రాలకు చేరుకుంటున్నాయి. త్వరలోనే వీటిని మండలాలకు కేటాయించనున్నారు. కరోనా ప్రభావం ఉన్నందున చీరలను ఏ విధంగా పంపిణీ చేయాలన్న విషయమై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. గతంలో రేషన్‌దుకాణాల ద్వారా చీరలను పంపిణీ చేసేవారు. కానీ, ఈసారి చీరలను నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు చేర్చాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.  


ఒక్కో చీర ధర రూ.320 

బతుకమ్మ చీరల పథకం ప్రారంభించిన తొలి సంవత్సరం ఒక్కో చీరకు రూ.200 మాత్రమే కేటాయించారు. ప్రస్తుతం ఒక్కో చీర రూ.320 విలువ చేస్తుంది. ఈ పథకంతో సిరిసిల్ల చేనేతలకు మంచి ఉపాధి లభిస్తోంది. ఈ ప్రాంతంలో 20 వేల వరకు మరమగ్గాలున్నాయు. ఆకట్టుకునేలా రంగు రంగుల డిజైన్లతో చీరలను తయారు చేశారు. దాదాపు కోటి చీరలను ప్రభుత్వమే ఉత్పత్తి చేయించి, సేకరిస్తుండడంతో మార్కెటింగ్‌ సమస్య కూడా లేదు. వేలాది మంది కార్మికులకు పనిభద్రతతో పాటు వేతనం కూడా పెరిగిందని చెబుతున్నారు. అయితే, సిరిసిల్లతో పాటు రాష్ట్రంలో చీరలు తయారు చేసే సంఘాలన్నింటి వద్ద నుంచి..  బతుకమ్మ చీరలను తయారు చేయించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని పలువురు కోరుతున్నారు. 

Advertisement
Advertisement
Advertisement