Abn logo
Oct 12 2021 @ 19:54PM

డల్లాస్‌లో 'టీపాడ్‌' ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

డల్లాస్, టెక్సాస్: తెలుగు పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్(టీపాడ్) ఆధ్వర్యంలో టెక్సాస్‌లోని డల్లాస్‌లో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సుమారు 500 మంది పాల్గొన్న ఈ సంబురాలు డల్లాస్‌లోని బిగ్‌బ్యారెల్స్‌ రాంచ్‌ ఇన్‌ ఆబ్రేలో నిర్వహించారు. కరోనా నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఈ వేడుకలను 60 ఏకరాల పెద్ద ఫామ్‌హౌస్‌లో నిర్వహించడం జరిగింది. సుమారు 100 వరకు గుర్రాలు, ఆవులు గల ఈ ఫార్మ్‌ పచ్చికలతో నిండిపోయి అచ్చం పల్లేటూరి వాతావరణంలో బతుకమ్మ సంబురాలు జరిగినట్లు అనిపించిందని నిర్వహకులు వెల్లడించారు. ప్రతియేటా డల్లాస్‌లోని ఫుట్‌బాల్‌ స్టేడియంలో పదివేల మందితో బతుకమ్మ వేడుకలు నిర్వహించే టీపాడ్‌.. ఈసారి కరోనా విజృంభణ నేపథ్యంలో పూర్తి గ్రామీణ వాతావరణంలో 60 ఎకరాల ఫామ్‌హౌస్‌లో పచ్చని పంటచేల సమీపంలో నిర్వహించింది. వేడుకల్లో భాగంగా నిర్వాహకులు 14 అడుగుల ఎత్తయిన బతుకమ్మను రంగురంగుల పూలతో ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు. ఈ బతుకమ్మతో సెల్ఫీలు తీసుకోవడానికి పలువురు పోటీపడ్డారు.

మొదట బతుకమ్మ పాటతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. మహిళలు తీసుకొచ్చిన రంగురంగుల బతుకమ్మలు అక్కడికి వచ్చిన వారికి కనులవిందు కలిగించాయి. సాంప్రదాయక బతుకమ్మ పాటలపై మహిళలు ఆడిపాడారు. అనంతరం రాంచ్ ఫార్మ్‌లోని కొలనులో బతుకమ్మల నిమజ్జనం చేశారు. ఇక దసరా వేడుకల్లో భాగంగా ఫ్రిస్కోలోని వేంకటేశ్వరస్వామి ఆలయ పూజారి కుమార్‌ జమ్మీ పూజా నిర్వహించారు. అలాగే సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయస్వామి విగ్రహాలకు పూజలు చేశారు. అందంగా అలంకరించిన ఎడ్లబండిలో శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు విగ్రహాలను ఊరేగించారు. ఈ సందర్భంగా దసరా పాటతో పాటు గౌరీ, శ్రీరాముడి నినాదాలతో భక్తులు పరవశించిపోయారు. ఈ ఊరేగింపు ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రచలంలో నిర్వహించే శ్రీరామ నవమి ఉత్సవాలను తలపించింది. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. ఈ విశేష కార్యక్రమాన్ని అజయ్‌రెడ్డి, జానకిరాం మందాడి నేతృత్వంలో రావు కల్వల, మాధవి సుంకిరెడ్డి, రవికాంత్‌ మామిడి, గోలి బుచ్చిరెడ్డి, రఘువీర్‌బండారు, ఇంద్రాని పంచెర్పుల, రూపా కన్నయ్యగారి, అనురాధ మేకల నేతృత్వంలో TPAD executive committee సభ్యులు వివిధ కమిటీలేగా ఏర్పడి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు.

ఇవి కూడా చదవండిImage Caption

తాజా వార్తలుమరిన్ని...