Abn logo
Aug 6 2020 @ 22:32PM

భారత సంతతి మహిళను సెనెటర్ అభ్యర్థిగా ఆమోదించిన ఒబామా

వాషింగ్టన్: భారత సంతతికి చెందిన సారా గిడియాన్(48) అనే మహిళను మెయిన్ రాష్ట్రం డెమొక్రటిక్ పార్టీ సెనెటర్ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు ఒబామా ఆమోదించారు. నవంబర్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు చెందిన అభ్యర్థుల పేర్లను ఒబామా ప్రకటించగా.. ఆ పేర్లలో భారత సంతతికి చెందిన సారా గిడియాన్ కూడా ఉన్నారు. ఆలోచనాత్మక, అధిక అర్హత కలిగిన వారిని సెనెటర్ అభ్యర్థులుగా ఆమోదించడం గర్వంగా ఉందంటూ ఒబామా ఓ ప్రకటన విడుదల చేశారు. తాను ఆమోదించిన అభ్యర్థులందరూ ప్రజల కోసం పాటుపడతారని, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్క అమెరికన్ కోసం పోరాటం చేస్తారని ఒబామా అన్నారు. అమెరికాలో ప్రతిష్టాత్మకమైన సెనెటర్ స్థానాల్లో మెయిన్ రాష్ట్రం కూడా ఒకటి. సారా గిడియాన్‌ను అభ్యర్థిగా పెడితే ఆ సెనెటర్ స్థానం డెమొక్రటిక్ పార్టీ గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు. ఇటీవల వచ్చిన పోల్స్ ఫలితాల్లో కూడా సారా గిడియాన్‌కు ఎక్కువ శాతం మంది మద్దతు తెలిపినట్టు తేలింది. సారా గిడియన్ ప్రస్తుతం మెయిన్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్నారు.  ఇక రిపబ్లికన్ పార్టీ నుంచి ప్రస్తుతం సెనెటర్‌గా వ్యవహరిస్తున్న సూసన్ కొల్లిన్స్ మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరోపక్క అధ్యక్ష అభ్యర్థి రేస్‌లో ఉన్న జో బైడెన్ సైతం సారా గిడియాన్‌ను సెనెటర్ అభ్యర్థిగా ఆమోదించారు. కాగా.. సారా గిడియాన్ తండ్రి భారతీయుడు కాగా.. ఆమె తల్లి అమెరికన్ దేశస్థురాలు. సారా ఒకవేళ నవంబర్‌లో ఎన్నికైతే అమెరికా సెనెట్‌కు ఎన్నికైన రెండో ఇండియన్ అమెరికన్‌గా రికార్డు సాధిస్తారు. అయితే సారా గిడియాన్‌తో పాటు రిపబ్లికన్ పార్టీ నుంచి మరో ఇద్దరు ఇండియన్ అమెరికన్స్ సెనెట్‌కు పోటీ చేస్తున్నారు. కాలిఫోర్నియా నుంచి మొట్టమొదటి సారి భారత సంతతి మహిళ అయిన కమలా హ్యారిస్ అమెరికా సెనేట్‌కు ఎన్నికయ్యారు.

Advertisement
Advertisement
Advertisement