Abn logo
Oct 19 2021 @ 18:31PM

మత హింసకు పాల్పడినవారిపై కఠిన చర్యలు : బంగ్లాదేశ్ పీఎం

ఢాకా : మతాన్ని ఉపయోగించుకుని హింసను ప్రేరేపించేవారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని బంగ్లాదేశ్ హోం మంత్రిని ఆ దేశ ప్రధాన మంత్రి షేక్ హసీనా మంగళవారం ఆదేశించారు. యథార్థాలను తనిఖీ చేసుకోకుండా సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలను నమ్మవద్దని ప్రజలను కోరారు. హిందూ దేవాలయాలపై దాడులు పెరగడంతో ఈ ఆదేశాలిచ్చారు.


గత బుధవారం ఖురాన్‌కు అపచారం జరిగినట్లు సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్ట్ రావడంతో బంగ్లాదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో దుర్గా పూజల మండపాలపై వందలాది మంది దాడులు చేశారు. గత ఆదివారం రాత్రి హిందువులకు చెందిన 66 ఇళ్ళను ధ్వంసం చేసి, సుమారు 20 ఇళ్లకు నిప్పు పెట్టారు. 


కేబినెట్ సెక్రటరీ ఖండ్కేర్ అన్వరుల్ ఇస్లామ్ మీడియాతో మాట్లాడుతూ, ప్రధాన మంత్రి షేక్ హసీనా మంగళవారం కేబినెట్ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. మతాన్ని ఉపయోగించుకుని హింసను ప్రేరేపించేవారికి వ్యతిరేకంగా తక్షణమే చర్యలను ప్రారంభించాలని హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్‌ను ఆదేశించారన్నారు. యథార్థాలను తనిఖీ చేసుకోకుండా సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలను నమ్మవద్దని ప్రజలను హసీనా కోరారని చెప్పారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని హోం మంత్రిత్వ శాఖను ఆదేశించారన్నారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా సాయం అందిస్తామని హసీనా చెప్పారన్నారు. 


బంగ్లాదేశ్ మీడియా కథనాల ప్రకారం, దుర్గా పూజల సమయంలో జరిగిన హింసాత్మక సంఘటనల్లో ఆరుగురు హిందువులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. 


ఇవి కూడా చదవండిImage Caption