Abn logo
Sep 30 2020 @ 02:26AM

బాలు.. ఓ తియ్యని జ్ఞాపకం!

Kaakateeya

‘‘బాలుతో నా అనుబంధం ‘ఓ సీత కథ’ సినిమాతో ప్రారంభమయింది. నాకు ఆ సినిమాతో ఇద్దరు మహానుభావులు పరిచయమయ్యారు. ఒకరు బాలు. మరొకరు వేటూరి సుందరరామూర్తిగారు. ఇద్దరినీ పరిచయం చేసింది విశ్వం (కె.విశ్వనాధ్‌)గారే! ఆ సినిమాలో బాలు ‘ చేప పిల్ల’ అనే ఒక పాట పాడారు. వేటూరిగారు హరికథ రాశారు. ఈ సినిమా తర్వాత నేను, మామ(కె.వి. మహదేవన్‌), బాలు దాదాపు ప్రతి ఆదివారం మా ఆఫీసులో కలుసుకొనేవాళ్లం. సరదాగా కబుర్లు చెప్పుకొనేవాళ్లం. కొద్ది కాలం తర్వాత చక్రవర్తి ప్రభంజనం ప్రారంభమయింది. నేను, బాలు, చక్రవర్తి, వేటూరిగారు- మా ఆఫీసులో కలుస్తూ ఉండేవాళ్లం. నేను 50 సినిమాలు తీస్తే వాటిలో కనీసం 200 పాటలు బాలు  పాడి ఉంటాడు. ఎన్టీఆర్‌ను సెట్‌లో చూస్తే ఆయన చుట్టూ భౌతికంగా కనిపించని కాంతి వలయం (ఆరా) ఉందనిపించేది.  అలాగే  బాలును రికార్డింగ్‌ థియేటర్‌లో చూసినా అంతే! మిక్సర్‌ ముందు బాలు-చక్రవర్తి, బాలు- ఇళయరాజాల కబుర్లు భలే సరదాగా ఉండేవి. నేను మహాలింగపురానికి మకాం మార్చిన తర్వాత మేము తరచూ కలుసుకుంటూ ఉండేవాళ్లం. నా సినిమా ఏదైనా సరిగ్గా అడకపోతే- హఠాత్తుగా మా ఆఫీసుకు బాలు  వచ్చేవాడు. కాసేపు సరదాగా కబుర్లు చెప్పి.. ధైర్యం నూరిపోసి వెళ్లిపోయేవాడు. ఇక్కడ బాలు వ్యక్తిత్వంలో మరో పార్శ్వం గురించి తప్పనిసరిగా చెప్పుకోవాలి. కొత్త గాయనీగాయకులకు అవకాశాలు ఇవ్వమని అందరికీ చెబుతూ ఉండేవాడు. ఆయన ప్రోత్సహించిన గాయనీగాయకుల సంఖ్య వందల్లో ఉంటుంది. మా బ్యానర్‌లో నిర్మించిన ‘చూడాలని ఉంది’ అనే సినిమాకు మణిశర్మను సంగీత దర్శకుడిగా పెట్టుకోవాలనుకున్నాం. బాలు దగ్గరకు వెళ్లి - ‘మణి శర్మను పెట్టుకోవాలనుకుంటున్నాం..’’ అన్నా. ‘‘ వెంటనే ఓకే చెప్పేయ్‌.. గొప్ప ట్యాలెంట్‌ ఉన్న వ్యక్తి. నేను మీ వెనకుంటా.. మీకు అవసరమైన సహకారమిస్తా’’ అని భరోసా ఇచ్చారు. ఆ తర్వాత మణిశర్మ మా బ్యానర్‌లో 16 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. ఇలా బాలు ప్రోత్సాహం ఇచ్చిన వారు ఎంతో మంది! ఇక తెలుగు భాషంటే బాలుకి ఎంతో ఇష్టం. గౌరవం కూడా. లతామంగేష్కర్‌, ఆషాబోంస్లే వంటి గాయనీమణులు వచ్చినప్పుడు- వారికి ఒక్కో తెలుగు పదాన్ని వివరించటం.. వాటిని ఎలా పలకాలో చెప్పటం నేను చెవులారా విన్నా! వ్యక్తిగతంగా మా పిల్లలు ప్రొడక్షన్‌లోకి వచ్చి- ‘సరిగమా..’ ‘లిటిల్‌చాంప్స్‌’ వంటి కార్యక్రమాలు చేసినప్పుడు బాలు అందించిన సహకారం మరపురానిది. బాలుతో నాలుగు నెలల క్రితం మాట్లాడా. మా పిల్లలు బాలును ఎయిర్‌పోర్టులో కలిసి- తాము చెన్నెలో ఫ్లాట్‌ కొనుకున్నామని చెప్పారట. ఆ రోజు నాకు బాలు ఆనందంగా ఫోన్‌ చేశాడు. ‘మనం ముందునుంచి మద్రాసులో ఉన్నవాళ్లం. నువ్వు మద్రాస్‌ వచ్చేయ్‌.. మళ్లీ కలుసుకుంటూ ఉందాం’ అన్నాడు. ఇప్పటికీ.. ఎప్పటికీ బాలు నాకు ఒక తీయని జ్ఞాపకం.’’  

Advertisement
Advertisement
Advertisement