Abn logo
May 26 2020 @ 03:27AM

శకం ముగిసింది

హాకీ లెజెండ్‌ బల్బీర్‌సింగ్‌ మృతి 

నివాళి అర్పించిన క్రీడారంగం

చండీగఢ్‌: దేశ హాకీ దిగ్గజం, వరుసగా మూడు ఒలింపిక్‌ స్వర్ణ పతకాల విజేత బల్బీర్‌సింగ్‌ సీనియర్‌ (96) సోమవారం మృతి చెందారు. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను ఈనెల 8న మొహాలీలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. అప్పటినుంచి చికిత్స పొందుతూ ఉదయం 6.17కి తుదిశ్వాస విడిచారు. బల్బీర్‌కు ఓ కుమార్తె, ముగ్గురు కుమారులున్నారు. కుమారులు కెనడాలో స్థిరపడగా.. కూతురు, మనవడు కబీర్‌తో కలిసి ఆయన ఇక్కడ నివసిస్తున్నారు. బల్బీర్‌ అంత్యక్రియలు సోమవారం సాయంత్రం అధికార లాంఛనాలతో జరిగాయి. మనవడు కబీర్‌ అంతిమ సంస్కారాలు నిర్వహించాడు. కాగా.. బల్బీర్‌ సేవలకు గుర్తింపుగా మొహాలీ స్టేడియానికి ఆయన పేరును పెడుతున్నట్టు పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ ప్రకటించారు. 


ఆ రికార్డు ఇప్పటికీ..

దేశంలోని గొప్ప అథ్లెట్లలో బల్బీర్‌ ఒకరు. ఆధునిక ఒలింపిక్స్‌ చరిత్రలో 16 మంది లెజెండ్స్‌ను అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) ఎంపిక చేస్తే.. వారిలో భారత్‌నుంచి బల్బీర్‌సింగ్‌ ఉండడం ఆయన సత్తాకు నిదర్శనం. ఒలింపిక్స్‌ చరిత్రలో పురుషుల హాకీ ఫైనల్స్‌లో అత్యధిక గోల్స్‌ చేసిన వరల్డ్‌ రికార్డు ఇప్పటికీ బల్బీర్‌ పేరిట చెక్కుచెదరకుండా ఉంది. 1952 హెల్సెంకీ ఒలింపిక్స్‌లో నెదర్లాండ్స్‌తో స్వర్ణ పతక మ్యాచ్‌లో ఆయన ఏకంగా ఐదు గోల్స్‌ చేశారు. దాంతో ఆ మ్యాచ్‌లో భారత్‌ 6-1 స్కోరుతో ఘన విజయం సాధించి పసిడి పతకం అందుకుంది. 1957లో బల్బీర్‌కు పద్మశ్రీ ప్రకటించారు. ఓ క్రీడాకారుడికి పద్మ అవార్డు ప్రకటించడం అదే తొలిసారి. భారత జట్టు వైస్‌-కెప్టెన్‌గా లండన్‌ (1948), హెల్సెంకీ (1952)లో, సారథిగా మెల్‌బోర్న్‌ (1956) మూడు ఒలింపిక్‌ స్వర్ణ పతకాలు ఆయన సాధించారు. 1975లో వరల్డ్‌ కప్‌ గెలిచిన భారత జట్టుకు బల్బీర్‌ మేనేజర్‌గా వ్యవహరించారు.


ధ్యాన్‌చంద్‌ స్థాయి..

హాకీ నైపుణ్యాల్లో బల్బీర్‌ది మరో లెజెండ్‌ ధ్యాన్‌చంద్‌ స్థాయిగా చెబుతారు. ధ్యాన్‌చంద్‌, బల్బీర్‌ కలిసి ఆడకపోయినా..భారత హాకీ ఆణిముత్యాలుగా వారు ప్రసిద్ధి చెందారు. 1924లో పంజాబ్‌లోని హరిపూర్‌ ఖల్సాలో జన్మించిన బల్బీర్‌సింగ్‌లోని హాకీ నైపుణ్యాలను ఖల్సా కాలేజి నాటి కోచ్‌ హర్బెయిల్‌సింగ్‌ గుర్తించారు. హర్బెయిల్‌ అనంతరం 1952, 1956 ఒలింపిక్స్‌లో భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించారు. కాగా..ధ్యాన్‌చంద్‌లాగే హంగూ ఆర్భాటాలకు దూరంగా ఉండే బల్బీర్‌కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలని ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ కొంతకాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. ఈమేరకు ఆయన ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు. పంజాబ్‌ ప్రభుత్వం ‘మహారాజా రంజీత్‌ సింగ్‌’ అవార్డుతో బల్బీర్‌ను సత్కరించింది. 


ఆరోజు చిన్న పిల్లాడిలా ఏడ్చాడు..

1971 బార్సిలోనా ప్రపంచకప్‌ సెమీఫైనల్లో పాకిస్థాన్‌ చేతిలో భారత్‌ ఓటమి అనంతరం..అప్పుడు జట్టు మేనేజర్‌గా ఉన్న బల్బీర్‌సింగ్‌ చిన్నపిల్లాడిలా ఏడ్చారట. ఈ విషయాన్ని నాటి జట్టు సభ్యుడు అశోక్‌కుమార్‌ గుర్తు చేసుకున్నాడు. ‘ఆ రోజును నేను ఎప్పటికీ మరిచిపోలేను. సెమీ్‌సలో మేం పాకిస్థాన్‌పై ఓడి కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాం. పరాజయం అనంతరం బల్బీర్‌ పరుషంగా ఏమీ మాట్లాడలేదు. కానీ సాయంత్రం ఆయన గదికి వెళ్లే సరికి చిన్నపిల్లాడిలా ఏడుస్తూ కనిపించారు. అంతేకాదు..‘‘ఈ రోజును చూసేందుకా నేనింకా బతికి ఉంది’’అని తీవ్ర వేదనతో అన్నారు’ అని అశోక్‌కుమార్‌ జ్ఞప్తికి తెచ్చుకున్నాడు.


 మృదుస్వభావం.. ఆటలో కాఠిన్యం..

మృదుస్వభావి అయిన బల్బీర్‌ మైదానంలోకి దిగితే కఠినంగా మారిపోతారు. ‘బయటి బల్బీర్‌కు, మైదానంలో బల్బీర్‌కు ఎంతో తేడా ఉంటుంది. టర్ఫ్‌పైకి అడుగుపెట్టారంటే హాకీ పాఠాలపై తప్ప మరే ధ్యాసా ఉండదు. ఆయన మాలో కలిగించిన ప్రేరణ, నెలకొల్పిన ఆత్మవిశ్వాసం వల్లే 1975 వరల్డ్‌ కప్‌ గెలిచాం’ అని నాటి కెప్టెన్‌ అజిత్‌పాల్‌ సింగ్‌ గుర్తు చేసుకున్నాడు. 


జీవితం హాకీకే అంకితం 

బల్బీర్‌ జీవితాన్ని పూర్తిగా హాకీకే అంకితం చేశారు. ఆయన మృతిలో హాకీ క్రీడ దిక్సూచి కోల్పోయింది.

                         అంతర్జాతీయ హాకీ సమాఖ్య

అద్భుత ఆటతో బల్బీర్‌  కలకాలం గుర్తుండిపోతారు. 

                            ప్రధానమంత్రి నరేంద్ర మోదీ


బల్బీర్‌ ఆత్మకు శాంతి చేకూరాలి

                             క్రీడల మంత్రి కిరణ్‌ రిజిజు

గొప్ప మిత్రుడిని కోల్పోయా -మిల్కాసింగ్‌

హాకీని సుసంపన్నం చేసిన గొప్ప ఆటగాడు

-సచిన్‌ టెండూల్కర్‌

Advertisement
Advertisement
Advertisement