Abn logo
May 13 2020 @ 03:29AM

తప్పుడు వార్తలు పత్రికా స్వేచ్ఛ కాదు

తప్పుడు వార్తలను తనిఖీ చేసేందుకు పత్రికా సమాచార కార్యాలయంలో ఫ్యాక్ట్ చెక్ యూనిట్‌ను ప్రారంభించాము. ఇది తప్పుడు వార్తలను సత్వరం తెలుసుకోవడమే కాదు, వెంటనే ఖండిస్తుంది. తప్పుడు వార్తలను ప్రసారం చేసిన టీవీ ఛానల్స్, ప్రచురించిన ప్రింట్ మీడియా వాటిని ఉపసంహరించుకోవడంతో పాటు వాస్తవాలను వీక్షకులు, పాఠకుల ముందు ఉంచి, క్షమాపణలు చెప్పాలి.


పత్రికలు ఎంత స్వేచ్ఛను అనుభవిస్తున్నాయనే చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంది. 1975 జూన్‌లో జాతీయ అత్యయిక స్థితిని ప్రకటించిన సమయంలో మాత్రం పత్రికా స్వేచ్ఛ అణచివేతకు గురైంది. ఆ సమయంలో మేము విద్యార్థి కార్యకర్తలుగా పత్రికా సెన్సార్‌షిప్‌కు వ్యతిరేకంగా సత్యాగ్రహాన్ని నడిపాము. అత్యవసర పరిస్థితి కాలంలో సెన్సార్‌షిప్ మాత్రమే నియమం! ప్రతి పత్రికా సంస్థకు ఒక ప్రభుత్వ అధికారిని నియమించారు.


స్వేచ్ఛ ఏ రూపంలో ఉన్నప్పటికీ అంటే – ఆలోచించే స్వేచ్ఛ కావచ్చు, మాట్లాడే స్వేచ్ఛ కావచ్చు, నిర్వహణ స్వేచ్ఛ కావచ్చు లేదా పత్రికా స్వేచ్ఛ కావచ్చు – అన్నింటినీ రద్దు చేశారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో అదో చీకటి అధ్యాయం. 1977లో అత్యయిక స్థితిని ఎత్తివేసిన వెంటనే జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ విజయం సాధించింది. కొత్త ప్రభుత్వ తొలి నిర్ణయం పత్రికా స్వేచ్ఛను పూర్తి స్థాయిలో పునరుద్ధరించడమే. అప్పటి నుంచి పత్రికా స్వేచ్ఛకు ఎలాంటి అడ్డంకులు ఎదురు కాలేదు.


ఇటీవల తప్పుడు వార్తలను బలవంతంగా రుద్దే కొత్త ధోరణి కొనసాగుతోంది. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, గందరగోళం సృష్టించడానికి అదే విధంగా జనాల్లో అశాంతి నెలకొల్పడానికి ఉద్దేశపూర్వక ప్రయత్నాలు జరుగుతున్నాయి.


లాక్‌డౌన్ కాలంలో పత్రికలు, మీడియాతో పాటు ట్విట్టర్, ఫేస్‌బుక్, వాట్సాప్ లాంటి సామాజిక మాధ్యమాల్లో విశృంఖలంగా తప్పుడు వార్తలు వెలువడటం మా దృష్టికి వచ్చింది. ఈ ప్రమాదాన్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేసేందుకు, మేము పత్రికా సమాచార కార్యాలయం (పి.ఐ.బి)లో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ (నిజ నిర్ధారణ విభాగం)ను ప్రారంభించాము. ఇది తప్పుడు వార్తలను సత్వరం తెలుసుకోవడమే కాదు, వెంటనే ఖండించడాన్ని కూడా ప్రారంభించింది. ఫ్యాక్ట్ చెక్ యూనిట్ చేసిన స్థిరమైన ప్రయత్నాలు సానుకూల ఫలితాలను అందించగలిగాయి. ఈ తప్పుడు వార్తలను ప్రసారం చేసిన 


టీవీ ఛానల్స్, ప్రచురించిన ప్రింట్ మీడియా వాటిని ఉపసంహరించుకోవడంతో పాటు వాస్తవాలను వీక్షకులు, పాఠకుల ముందు ఉంచి, క్షమాపణలు చెప్పాలి.


తప్పుడు వార్తల ప్రచారాన్ని కట్టిపెట్టే క్రమంలో భారత ప్రభుత్వం ఈ సానుకూల చొరవ తీసుకున్నప్పుడు ‘పత్రికా స్వేచ్ఛను హరించే’ ప్రయత్నంగా చిత్రీకరిస్తూ కొన్ని వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి. ఇక్కడ నేను అడిగే ప్రశ్న ఒక్కటే. ప్రతికా స్వేచ్ఛ ముసుగులో తప్పుడు వార్తలను ప్రచారం చేయడం సరైనదేనా? దీనికి ఒక్కటే సమాధానం. ‘కాదు. అలాంటివి జరగకూడదు’. తప్పుడు వార్తలకు కొన్ని ఉదాహరణలు కూడా మీకు తెలియజేయాలనుకుంటున్నాను. కుటుంబానికి ఆహారం లేకపోవడంతో ఉత్తరప్రదేశ్‌లోని ఒక మహిళ తన ఐదుగురు పిల్లలను గోమతి నదిలోకి విసరివేసిందనే వార్తను ఒక ప్రసిద్ధ న్యాయవాది ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. వాస్తవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు, ఆమె ఇంట్లో తగినంత ఆహారం ఉందని తెలిసింది. ఆమె తన భర్తతో జరిగిన గొడవ కారణంగానే ఇలాంటి తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. ఇవి ఆకలి కారణంగా సంభవించిన మరణాలు అని ప్రచారం చేయడంలో ఎలాంటి వాస్తవం లేదు. ఇక అహ్మదాబాద్‌లోని ఒక ఆసుపత్రి, మతం ఆధారంగా రోగులను వేరు చేసిందని ట్విట్టర్ ఖాతా ద్వారా మరొక తప్పుడు వార్త చలామణీ అయ్యింది. ఇది కూడా అవాస్తవం అని తేలింది. ముంబైలోని బాంద్రా స్టేషన్‌లో వలస కార్మికులు, శాంతి భద్రతల యంత్రాంగానికి మధ్య ఘర్షణకు కారణమైన మరో ఆకతాయి తప్పుడు వార్త సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాప్తి చెందింది. బాంద్రా రైల్వే స్టేషన్ వద్ద పెద్ద సంఖ్యలో వలస కార్మికులు గుమి గూడారు. కారణం ఎమిటంటే, కార్మికుల కోసం ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారని, తప్పుడు వార్తను ప్రచారం చేశారు. నిజానికి అధికారికంగా అలాంటి ఏర్పాటు ఏదీ జరగలేదు.


పుకార్లను వార్తలుగా వ్యాప్తి చేసే ఒక విధానం ఉందని మేము గమనించాము. ముఖ్యంగా, సామాజిక మాధ్యమాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నాలను ప్రతికూల దృక్పథంలో విమర్శించడమే వారి పని. ‘రెండు శాతం మంది పేదలు మాత్రమే రేషన్ షాపుల నుంచి ఆహారం పొందుతున్నారు’, ‘పి.డి.ఎస్. షాపుల్లో రేషన్ సామగ్రి లేదు’, ‘ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం జీతం, పెన్షన్ కోత ఉంటుంది’, ‘ఒక లింక్ మీద క్లిక్ చేస్తే, ప్రభుత్వం 1000 రూపాయలు చెల్లిస్తుంది’, ‘జూన్ చివరి వరకూ ప్రభుత్వం ఉచిత ఇంటర్నెట్ అందిస్తుంది’, ‘అక్టోబర్ వరకూ హోటళ్ళను మూసివేస్తారు’ వంటి అనేక పుకార్లు విస్తృతంగా వ్యాప్తి అయ్యాయి. కానీ ఇవన్నీ తర్వాత అవాస్తవాలు అని తేలాయి. వాస్తవాలను ప్రజలకు తెలియజేసిన క్రమంలో వ్యాప్తి చేసిన వారు వీటిని ఉపసంహరించుకోక తప్పలేదు.


తప్పుడు వార్తల్లో మరో భయంకరమైన కోణం కూడా ఉంది. ఇది ప్రజల్లో భయాందోళనలను సృష్టించింది. భారతదేశం హెడ్రాక్సీ క్లోరోక్విన్‌ను అమెరికా, ఇతర దేశాలకు ఎగుమతి చేసిన తర్వాత ‘భారతదేశంలో ఇక్కడి ప్రజల కోసం హైడ్రాక్సీ క్లోరోక్విన్ నిల్వలు లేవు’ అనే ఒక తప్పుడు వార్త చెలామణీలోకి వచ్చింది. అంతేనా, ‘తమిళనాడు ఆర్డర్ చేసిన పరీక్షా సామగ్రిని అమెరికాకు మళ్ళించారు’ అనేది మరో అసత్య ప్రచారం. ‘ఇషా ఫౌండేషన్‌లోని 150 మంది విదేశీయులకు కొవిడ్ పాజిటివ్ వచ్చింది’, ‘30 వేల మంది వస్త్ర కర్మాగార కార్మికులు తమిళనాడులోని తిరుప్పూర్‌లో చిక్కుకుపోయారు’, ‘ముంబైలో ఒక బి.ఎం.సి. ఆఫీసర్ నుంచి వైరస్ సామాజిక వ్యాప్తి ప్రారంభమైంది’, ‘జమ్మూ & కాశ్మీర్‌లో వైద్య సామగ్రి కొరత’, ‘మణిపూర్‌లోని చుర్ చందాపూర్ జిల్లాలో రేషన్ నిల్వలు లేవు’ వంటి అనేక తప్పుడు వార్తలు విశృంఖలంగా ప్రచారమయ్యాయి. ఇక ప్రముఖ వార్తా పత్రిక ఒకటి ముంబైలో కొవిడ్ వైరస్ సోకిన వారి సంఖ్య పెరుగుతుందని, ఏప్రిల్ చివరి నాటికి 40 వేల మందికి సోకుతుందని, మే రెండో వారానికి 6.5 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేసింది. ఇవన్నీ ప్రజలను భయాందోళనలకు గురిచేసే వార్తలు. అయితే అవన్నీ తప్పుడు వార్తలు అని నిరూపితమయ్యాయి. వాటిని ప్రచారం చేసిన వారు తర్వాత ఉపసంహరించుకోవలసి వచ్చింది. మేము నిరంతరం వాస్తవాలను తనిఖీ చేసి, వెంటనే వీటిని ఖండించకపోయి ఉంటే, తప్పుడు వార్తలను చెలామణీ చేసే  ధోరణి హద్దులు లేకుండా కొనసాగుతుండేది.


తప్పుడు వార్తలను ప్రచారం చేయడం వెనుక ఒక క్రూరమైన ఉద్దేశం దాగి ఉంది. హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చిన ఒక తప్పుడు వార్తను గమనిస్తే– ‘పాలు సరఫరా చేసిన ముస్లిం గుజ్జర్లకు ప్రవేశం నిరాకరించబడింది’ అనేది దాని సారాంశం. ‘మణిపూర్‌లోని టామెంగ్లాంగ్ జిల్లా ఆసుపత్రిలో సిబ్బంది లేరు, పరికరాలు లేవు’ అనేది మరో వార్త. ఇవన్నీ పూర్తిగా అవాస్తవాలు అని తర్వాత నిరూపితమయ్యాయి. ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే, దీని ఫలితం ఏమిటి? దీని ద్వారా కనుగొన్నది ఏమిటి? – దీనికి ఒకే ఒక్క సమాధానం – ‘తప్పుడు వార్తలను సృష్టించడానికి ఉద్దేశపూర్వక ప్రయత్నాలు జరిగాయి’. చివరగా ఒక్కటి మాత్రం కచ్చితంగా చెప్పగలను. పత్రికా స్వేచ్ఛ పేరిట తప్పుడు వార్తలను ప్రచారం చేయడాన్ని మేము అనుమతించే ప్రసక్తే లేదని అందరూ అంగీకరిస్తారు.


ప్రకాశ్ జావడేకర్

కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి

Advertisement
Advertisement
Advertisement