Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఊపందుకున్న ‘బీ–టీమ్‌’ వ్యూహాలు

వానాకాలం, చలికాలం, ఎండాకాలం లాగా దేశంలో బీ–టీమ్‌ కాలం నడుస్తోంది. రాష్ట్రాల్లో బలం లేనప్పుడు, ఆ రాష్ట్రాల్లో ప్రధాన ప్రత్యర్థిని (కాంగ్రెస్‌ని) బీ–టీమ్‌లతో నామరూపాల్లేకుండా చేయాలి. ప్రస్తుతం బీజేపీ దేశవ్యాప్తంగా అనుసరిస్తున్న వ్యూహం ఇదే. జాతీయ కిసాన్‌ నాయకుడు రాకేష్‌ తికాయత్‌ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఇందిరాపార్కు వద్ద బీజేపీకి టీఆర్‌ఎస్‌ బీ–టీమ్‌ అని ప్రకటించి సంచలనం రేపారు. నిజానికి 2014 ఎన్నికల తర్వాత బీజేపీకి అనుబంధంగానే టీఆర్‌ఎస్‌ కార్యకలాపాలు ఉంటున్నాయి. కేంద్రంలో బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి బలంగా సమర్థన ఇచ్చే నాయకుడిగా కేసీఆర్‌ గుర్తింపు పొందారు. జీఎస్టీ చట్టాన్ని దేశంలో ఆమోదించిన తొలి రాష్ట్రం తెలంగాణయే. నోట్ల రద్దు నిర్ణయానికి కేసీఆర్‌ ఇచ్చినంత సమర్థన మరెవరూ ఇవ్వలేదు. ఇదొకటే కాదు, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు, సమాచార హక్కు చట్టానికి సవరణతో పాటు కీలక చట్టాల ఆమోదంలో టీఆర్‌ఎస్‌ పాత్రను, అది బీజేపీకి చేసిన మేలును ఎవరూ మరిచిపోరు. దేశంలో రెండు రకాల బీ–టీమ్‌లు ఉన్నాయి: జాతీయస్థాయిలో బీజేపీని సమర్థిస్తూ రాష్ట్రస్థాయిలో వ్యతిరేకించే టీమ్‌లు. రెండు స్థాయిల్లోనూ బీజేపీని వ్యతిరేకించే టీమ్‌లు. మొదటి కోవకు చెందినవే ఏపీలో వైసీపీ, తెలంగాణలో టీఆర్‌ఎస్‌. ఇక రెండో కోవకు చెందిన పార్టీలుగా ఆమ్‌ ఆద్మీతో పాటు తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ), మజ్లిస్‌లను పేర్కొనవచ్చు. 2014 సాధారణ ఎన్నికల తర్వాత వీటి కార్యకలాపాలు క్రియాశీలంగా మారాయి. టీఎంసీని పరిశీలిస్తే బెంగాల్‌లో బీజేపీకి ప్రాణం పోసి పెంచుతున్న పార్టీ ఇదేనని అర్థమవుతుంది. బీజేపీని ఎదిరించే సత్తా తమకే ఉందని ప్రకటించి, ప్రస్తుతం ఆ పార్టీ కోసం దేశమంతా విస్తరించే పనిలో పడింది. అందులో భాగంగానే కాంగ్రెస్‌ను మేఘాలయ, గోవా, త్రిపుర, అసోంలో దెబ్బతీయడానికి బలంగా ప్రయత్నాలు ప్రారంభించింది. గోవాలో మాజీ ముఖ్యమంత్రిని పార్టీలో చేర్చుకుంది. మేఘాలయలో 12మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను, అసోంలో మాజీ ఎంపీని చేర్చుకొని రాజ్యసభ పదవిని కట్టబెట్టింది. 2007 బెంగాల్‌ ఎన్నికల్లో బీజేపీ పొత్తుతో బరిలో దిగిన టీఎంసీ ఆ ఎన్నికల్లో 30 స్థానాల్లో గెలిచింది. 2011 ఎన్నికల్లో లెఫ్ట్‌ ఫ్రంట్‌ను ఓడించి ఆ రాష్ట్రాన్ని కల్లోలిత రాష్ట్రంగా మార్చడంలో టీఎంసీ సఫలీకృతమయింది. ఏ పార్టీని దేశంలో తానే ఎదిరించగలనని టీఎంసీ ప్రకటించిందో, ఆ పార్టీకి 2021 ఎన్నికల్లో 77 స్థానాలతో ప్రధాన ప్రతిపక్ష స్థాయిని కట్టబెట్టడంలో మమతా బెనర్జీ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. ఆ రాష్ట్రంలో ప్రగతిశీల–సెక్యులర్‌ శక్తులు నామరూపాల్లేకుండా పోవడానికి మమతా బెనర్జీ విధానాలే కారణం. 2021 ఎన్నికల్లో కాంగ్రెస్‌, లెఫ్ట్‌ఫ్రంట్‌లకు ఒక్క సీటు కూడా రాకుండా పోవడంలో పరోక్ష పాత్ర బెనర్జీదే. ‘నువ్వు నేను కొట్లాడుదాం, మధ్యలో మిగిలిన ఏ పార్టీ లేకుండా నమిలేద్దాం, చివరికి మనమిద్దరమే ఉందాం’ అనే సూత్రం బెంగాల్‌లో విజయం సాధించింది. ఆ తర్వాత న్యూఢిల్లీలోనూ సఫలమైంది. తెలంగాణలో 2019 పార్లమెంట్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌, తాజాగా జరిగిన హుజూరాబాద్‌ ఎన్నికల వాతావరణం, ఫలితాలు ఇవే నిరూపించాయి. తెలంగాణ సమాజంలో మిగిలిన కొంత చైతన్యం ఈ కుట్రలను గుర్తించింది. అందుకే కాంగ్రెస్‌ ఉనికి వాటికి మిణుగురు వెలుగులా కనిపిస్తోంది. రాకేష్‌ తికాయత్‌ మరో వాస్తవాన్ని కూడా వెల్లడించి తెలంగాణ ప్రజలను అప్రమత్తం చేసి వెళ్లారు. బీజేపీ దేశంలో ఎక్కడ బలహీనంగా ఉంటుందో, ఓడిపోయే అవకాశం ఉంటుందో ఆ రాష్ట్రంలో, ఆ ప్రాంతంలో మజ్లిస్‌ వెళ్లి పోటీ చేస్తుందన్నారు. తెలంగాణలో 12శాతం నుంచి 14శాతంగా ఉన్న ముస్లింల జీవన ప్రమాణాలు మార్చడానికి మజ్లిస్‌ చేసిన ప్రయత్నాలేవీ లేవు. పాతబస్తీలో ప్రభుత్వ విద్యారంగాన్ని నాశనం చేయడంలో కీలకపాత్ర మజ్లిస్‌దే. డజన్లకొద్దీ ప్రభుత్వ పాఠశాలల స్థలాలను మాయం చేయడంలో ఆ పార్టీ ప్రముఖ భూమికను పోషించింది. ముస్లింల జీవితాలు మార్చడానికి పుట్టుకొచ్చిన ఈ పార్టీ వారి జీవితాలను మార్చే పని ఒక్కటి కూడా చేయకపోగా దేశంలో ముస్లింలకు మరింతమంది కొత్త శత్రువులను కట్టబెడుతోంది. దేశవ్యాప్తంగా ఆ పార్టీ విస్తరణ సెక్యులర్‌ శక్తులకు ప్రమాదకరంగా మారి మతతత్వశక్తులకు బలాన్ని పెంచుతోంది. మహారాష్ట్రలో రెండు దఫాలుగా, తాజాగా బిహార్‌ ఎన్నికలు, త్వరలో జరుగనున్న యూపీ, గుజరాత్‌ ఎన్నికల్లో బీజేపీకి ఆయాచిత లబ్ధిని చేకూర్చడంలో మజ్లిస్‌ సహాయసహకారాలు అందిస్తోంది. మహారాష్ట్రలో శివసేనతో కాంగ్రెస్‌ – ఎన్‌సీపీ పొత్తుపెట్టుకోవడాన్ని తప్పుపట్టే ఆ పార్టీ, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మైనార్టీలు ఏ పరిస్థితిలో ఉన్నారో, శివసేన – కాంగ్రెస్‌ – ఎన్‌సీపీ పాలిత ప్రాంతాలలో ఏ పరిస్థితిలో ఉన్నారో తేడా గుర్తిస్తే మేలు. బలంగా ఉన్నచోట బీజేపీ నేరుగా కాంగ్రెస్‌ – సెక్యులర్‌ శక్తులతో పోరాడుతుండగా బలంగా లేనిచోట బీ–టీమ్‌ల సహాయం తీసుకుంటుంది. పొరుగు రాష్ట్రం ఏపీని పరిశీలిస్తే– అధికారంలో ఉన్న వైసీపీ జాతీయ స్థాయిలో బీజేపీ బీ–టీమ్‌ అనేకన్నా, దాదాపు అనుబంధ పార్టీగానే సహాయ సహకారాలు అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో వచ్చినప్పటి నుంచే కాకుండా అంతకుముందు నుంచే ఆ పార్టీ బీజేపీకి బలంగా సహాయపడుతోంది. బీజేపీకి ప్రధానవనరుగా ఉన్న ముకేష్‌ అంబానీ సన్నిహిత సహచరుడు పరిమళ్‌ నత్వానీకి 2020లో రాజ్యసభ సీటు ఇవ్వడం ద్వారా బీజేపీతోను, ఆ పార్టీ ప్రధాన మద్దతుదారు ముకేష్‌ అంబానీతోను వైసీపీకి ఉన్న అనుబంధమేమిటో తేలిపోయింది. 2009 సెప్టెంబరులో ఏపీ సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్‌ ప్రమాదంలో చనిపోతే, ఆ చావుకు రిలయన్స్‌ అధినేత కూడా  కారణమంటూ జగన్‌ మద్దతుదారులు రాష్ట్రంలో ఉన్న రిలయన్‌ ఫ్రెష్‌ దుకాణాలపై చేసిన దాడులు మరిచిపోలేనివి. తన తండ్రి చావుకు కారణమంటూ ఏ వ్యక్తిపై అభియోగాలు మోపారో ఆ వ్యక్తికి మేలు చేసేలా కీలకమైన రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు! దీనితో వైసీపీ బీజేపీలో అంతర్భాగమన్న సంగతి అర్థమైపోతుంది. ఆ పార్టీ వైఎస్‌ పేరు పెట్టుకున్నప్పటికీ దానికి సైద్ధాంతిక భూమిక అంటూ ఏమీ లేదని పలు పరిణామాలు నిరూపించాయి. తెలంగాణలో వరిధాన్యం విషయంలో కేంద్రాన్ని కాకుండా బీజేపీ రాష్ట్ర నేత బండి సంజయ్‌ను లక్ష్యంగా చేసుకున్నారు సీఎం కేసీఆర్‌.  ఆ విధంగా రాష్ట్రంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ మాత్రమే మనుగడలో ఉండాలనే సంకేతాలు ఇచ్చారు. ఈ పరిణామాలు తన యుద్ధం బీజేపీతో తప్ప, కాంగ్రెస్‌తో కాదనే సత్యాన్ని చాటిచెప్పాయి. అచ్చం ఇవే ఎజెండాలు త్వరలో ఎన్నికలు జరుగనున్న పంజాబ్‌, గోవా, ఉత్తరాఖండ్‌, యూపీ, మణిపూర్‌తో పాటు ఇప్పటికే ఎన్నికలు పూర్తయిన ఢిల్లీ, బెంగాల్‌లో కూడా అమలు అవుతున్నాయి. తెలంగాణలో ఈ వ్యూహాలు మరే రూపాన్ని సంతరించుకుంటాయో చూడాలి. లేక తికాయత్‌ హెచ్చరికలతో తెలంగాణ సమాజం మేల్కొంటుందా అన్నదీ గమనించాలి.

డాక్టర్‌ సయ్యద్‌ మొహినుద్దీన్‌

Advertisement
Advertisement

ప్రత్యేకం మరిన్ని...