Abn logo
Aug 14 2020 @ 00:00AM

అజాన్‌... నమాజ్‌కు మేలుకొలుపు

దైవ ప్రార్థన ఒక పవిత్రమైన కర్తవ్యం. ఇస్లాంలో నమాజ్‌ చేయడం విశ్వాసులు తప్పనిసరిగా పాటించాల్సిన విధి. ‘అజాన్‌’ అంటే నమాజ్‌కు విశ్వాసులను సమాయత్తం చేయడం కూడా సమున్నతమైన కార్యంగా మహాప్రవక్త మహమ్మద్‌ ప్రకటించారు. ‘అజాన్‌’ అనే పదానికి ‘తెలియజేయడం’, ‘ప్రకటించడం’ అని అర్థం. షరీయత్‌ పరిభాషలో ప్రతిరోజూ ఫర్జ్‌ నమాజుల కన్నా ముందు... నమాజ్‌ చేసేవారిని పిలవడానికి చేసే ప్రకటననూ లేదా సమాచారం తెలియజేయడాన్నీ ‘అజాన్‌’ అంటారు. 


‘‘ఏ ప్రదేశంలో అనునిత్యం అజాన్‌ వినిపిస్తుందో ఆ ప్రదేశంలో దైవకారుణ్యం వర్షిస్తుంది. ప్రజలు దైవ శిక్షలకూ, విపత్తులకూ గురికాకుండా ఉంటారు. అజాన్‌ ధ్వని వ్యాపించే మేర సైతాన్‌ నిలువనే నిలువడు. అజాన్‌ చెప్పేవారి మెడలు ప్రళయదినాన పొడవవుతాయి. అంటే వారు ప్రత్యేక గౌరవం పొందుతారు. స్వర్గంలో దైవప్రవక్తలు, అమరవీరుల తరువాత స్వర్గంలోకి ప్రవేశించేది అజాన్‌ చెప్పేవారే!’’ అని మహా ప్రవక్త మహమ్మద్‌ స్పష్టం చేశారు.


మొదట్లో అంచనా ప్రకారం నిర్ణీత సమయానికి విశ్వాసులందరూ ఒకచోట చేరి నమాజ్‌ చేసేవారు. నమాజ్‌ కోసం ఒక పద్ధతి ప్రకారం పిలుపునిచ్చే విధానాన్ని హిజ్రీ శకం రెండో సంవత్సరంలో ప్రవేశపెట్టారు. అప్పట్లో ‘అస్సలాతుల్‌ జామియా’ అనే పదాలను ఆ పిలుపునకు ఉపయోగించేవారు. తదనంతర కాలంలో కొందరు సహచరులకు మహా ప్రవక్త కలలో కనబడి సూచించిన మేరకు ప్రస్తుతం ఆచరిస్తున్న అజాన్‌ పదాలను నిర్ధారించారు. ‘‘అఅజ్జన్‌ (అజాన్‌ పిలుపును ఇచ్చే వ్యక్తి) చేసిన అజాన్‌ ధ్వని ఎంత మేరకు వినిపిస్తుందో ఆ ప్రదేశంలోని ప్రతి వస్తువూ ప్రళయ దినాన ఆ పిలుపునకు సాక్ష్యం ఇస్తుంది. అజాన్‌ పలికిన వ్యక్తి మెడ ప్రళయదినాన అందరికన్నా ఉన్నతంగా కనిపిస్తుంది’’ అని మహా ప్రవక్త తెలిపారు. 

సందర్భానుసారం ఆజాన్‌ను వివిధ పేర్లతో వ్యవహరిస్తారు. పురుషుల విషయానికొస్తే, ప్రతి ఫర్జ్‌ నమాజ్‌కూ పూర్వం అజాన్‌ పలకడాన్ని ‘సున్నెతె ముఅక్కిదా’ అంటారు. ఒక్కరే నమాజ్‌ చేస్తున్నా, ఎక్కువమంది చేస్తున్నా, ప్రయాణంలో ఉన్నా, నివాసంలో ఉన్నా, వేళకు చేసినా, వేళ దాటిన తరువాత (కజా) చేసినా... ఆ నమాజ్‌లకు ముందు అజాన్‌ చేయడాన్ని ‘సున్నత్‌’ అంటారు. కాగా మహిళలు పలికే అజాన్‌ను ‘మక్రూహె తహ్రీమీ’ అంటారు. ఈద్‌, బక్రీద్‌ ప్రార్థనలకూ, ఖననం తరువాత చేసే ప్రార్థనలకూ ముందు చెప్పే అజాన్‌ను ‘మక్రుహె తహ్రీమి’ అని పిలుస్తారు. అజాన్‌ చేసే వ్యక్తి అంటే ముఅజ్జన్‌ ఎత్తైన ప్రదేశంలో నిలబడి, తన రెండు చూపుడు వేళ్ళనూ చెవుల్లో పెట్టుకొని ఆజాన్‌ పదాలను పలకడం సంప్రదాయం. అజాన్‌ తరువాత ముఅజ్జన్‌, నమాజ్‌ చేసే ఇతరులు కూడా దరూద్‌, దువా చదవాలన్నది నియమం. 

- మహమ్మద్‌ వహీదుద్దీన్‌


Advertisement
Advertisement
Advertisement