Advertisement
Advertisement
Abn logo
Advertisement

అయ్యప్ప దీక్ష అంతరార్థం

హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి పేరు వినగానే అద్వైతం అవగతమవుతుంది. శైవం, వైష్ణవం, శాక్తేయం, అవధూతం, గాణపత్యం, షణ్ముఖం, సౌరం... ఇలా అన్ని ఆరాధనా రీతులూ అయ్యప్ప దీక్షా విధానంలో నిబిడీకృతమై ఉన్నాయి. గురువును ఆశ్రయించే సత్సంప్రదాయం, గురూపదేశంతో మాలధారణ, సామూహిక సత్సంగంలో నిత్య పూజలు, భజనలు, కుల వర్ణాలకు అతీతంగా సామూహిక అన్నదానాలు, అందరిలో స్వామిని దర్శిస్తూ చేసే పాదాభివందనాలు, అంతస్తులు మరచి... వినమ్రంగా గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం, తల్లితండ్రులు, గురువు దైవ సమానులనే భక్తి భావన... ఒకటా రెండా... అయ్యప్ప దీక్ష, శబరియాత్ర ఒక ఆధ్యాత్మిక మహోత్సవం.


చలికాలంలో ఇరు సంధ్యలలో చన్నీటి స్నానాలు ఆచరించడం ఒక మహత్తరమైన దీక్షానియమావళి. అరిషడ్వర్గాలను జయించడం ఆధ్యాత్మిక పరమార్థమని అష్టాంగ యోగం, వేదాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. తమో, రజో గుణాలను రెచ్చగొట్టే మాంసాహారం, అల్లం, వెల్లుల్లి లాంటి పదార్థాలకు దూరంగా... వినోదాలు, విలాసాలు వదిలిపెట్టి, మండలకాలం పాటు దీక్షను ఆచరించడం వల్ల బద్ధకం పోతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి పటిష్టమవుతుంది. కోశ శుద్ధి, చక్రశుద్ధి జరిగి మనో వికాసం కలుగుతుంది. అయ్యప్ప దీక్షలో వ్యసనాలు దరి చేరవు. శరీరంలో హార్మోన్లు పుష్కలమై... అనేక రుగ్మతలు దూరమవుతాయి. నిరంతరం అయ్యప్ప నామస్మరణతో, శరణు ఘోషతో, ఒక లక్ష్యంతో మండలం రోజులు దీక్ష చెయ్యడం వల్ల ఏకాగ్రత అలవడుతుంది. జీవితంలో విజయం సాధించడానికి చిత్తశుద్ధి, సంకల్పబలం, క్రమశిక్షణ ఎంత అవసరమో ఈ దీక్షలో అవతమవుతుంది. ఈ ఆరు వారాలూ ఇంట్లోని ఇతర సభ్యులందరూ శుచి, శుభ్రత, నియమం, ఆచారం పాటిస్తూ... స్వామి దీక్షా సాఫల్యతకు ఎంతగానో సహకరించడం వల్ల... క్రమశిక్షణ జీవితంలో ఒక భాగమైపోతుంది. కోపతాపాలు అదుపులోకి వస్తాయి. భయం, భక్తి పెరుగుతాయి. మన సత్రవర్తన వల్లే మనకు గౌరవం, మర్యాద పెరుగుతాయనే సత్యం తెలుస్తుంది.


తనకంటే ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి సైతం వినమ్రంగా ‘శరణమయ్యప్ప’ అని సంబోధించడంతో... అందరిలో భగవంతుడు ఉన్నాడనే ఆర్యోక్తి అర్థమవుతుంది.  అయ్యప్ప దీక్షలో ఆహార నియమావళికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఏకభుక్తం... ఒక పూట సంపూర్ణ భోజనం, రెండో పూట అల్పాహారం. దీనివల్ల రోజుకు 16 గంటల ఉపవాసం జరుగుతుంది. అంటే ఇంటర్‌మిటెంట్‌ ఫాస్టింగ్‌ వల్ల కలిగే సత్ఫలితాలన్నీ లభిస్తాయి. కాళ్ళకు చెప్పులు లేకుండా నడవడం వల్ల పాదాలలోని అనేక నాడులు ఉత్తేజితమై... ఆక్యుప్రెషర్‌ వైద్యం తాలూకు ప్రయోజనాలను పొందుతారు. శబరిమల యాత్రలో తలపై ఇరుముడిని స్వాములు మోస్తారు. అళుద, కరిమల, నీలిమల కొండల్లో రాళ్ళు, ముళ్ళు దాటుకుంటూ వెళ్తారు. అళుద, పంపా నదుల్లో స్నానాలు ఆచరిస్తారు. దూరాలు, భారాలు లెక్క చెయ్యకుండా, సుఖ భోగాలు, విలాసాలు ఆశించకుండా, అయ్యప్ప దివ్య దర్శనమే లక్ష్యంగా యాత్ర చేస్తారు. దీనివల్ల జీవితంలో ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే సంకల్పబలం, పట్టుదల అలవడతాయి.


అడవి మార్గంలో వనయాత్ర చేస్తున్నవారికి కేరళలోని మూలికల గాలి సోకి ఆరోగ్యం మెరుగుపడడం, నిరంతరం బీజాక్షర సమ్మిళితమైన శరణాలు, నినాదాలు చెయ్యడం వల్ల అనేక మనోవికారాలు అదృశ్యమై... పాజిటివ్‌ వైబ్రేషన్లు చిగురించడం, మానసిక పరిపక్వత కలగడం అందరూ గమనిస్తున్నారు. కాబట్టే ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు అయ్యప్ప దీక్ష చెయ్యడానికి సంసిద్ధులవుతున్నారు. స్వామి సన్నిధానంలో ప్రజ్వరిల్లుతూ కనిపించే అగ్నిగుండం అనేక దోషాలను హరిస్తుందన్నది విశ్వాసం. అక్కడ వెలిగించే కర్పూర పరిమళాలు, చిలికించే పన్నీరు, సుగంధ ద్రవ్యాలు, చెవుల్లో నిరంతరం మార్మోగే శరణుఘోషలు చెరగని ముద్ర వేస్తాయి. దీక్షానంతరం కూడా ఒక పవిత్ర భావనను మిగులుస్తాయి. అష్టాదశ సోపానం అధిరోహిస్తున్న భక్తులు విచిత్రమైన ఉద్వేగానికి గురవుతారు. అనేక యంత్ర, మంత్ర, తంత్రాలతో ప్రతిష్ఠితమైన ధ్వజస్తంభం మీద అయ్యప్ప తురగ వాహనాన్ని చూడగానే... శరీరంలోని మూలాధార చక్రం ఉత్తేజితమై... జీవితంలో ఏదైనా సాధించాలనే పట్టుదల పదింతలవుతుందంటారు పెద్దలు. అయ్యప్ప ప్రధాన సన్నిధానం చేరుకొని, ఆ చిన్ముద్రాసన దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించి, ‘స్వామియే శరణమయ్యప్పా’ అని నినదిస్తూ ఉంటే... ‘‘ఇన్ని రోజుల దీక్ష, ఇంత కఠినమైన యాత్ర, ఇంతటి శ్రమ, ప్రయాసలు ఈ అద్భుతమైన క్షణం కోసమే కదా!’’ అని అంతరాత్మ పరవశిస్తుంది. జీవితంలో విజయ శిఖరాలను అధిరోహించడానికి ఎటువంటి కష్ట, నష్ట, నిష్టూరాలనైనా అకుంఠిత దీక్షతో సాధించవచ్చనే జీవితసత్యం బోధపడుతుంది. మండల దీక్ష ఒక బలం. శబరి యాత్ర ఒక వరం. అయ్యప్ప స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం.

వి.యస్‌.పి. తెన్నేటి

Advertisement
Advertisement