Abn logo
Jul 9 2020 @ 05:29AM

రికార్డుల తారుమారుకు ప్రయత్నాలు

పట్టుకొని మందలించిన రెవెన్యూ యంత్రాంగం

రూ. 10 కోట్ల భూమిని తారుమారు చేయడానికి సైట్‌ను లాగిన్‌ చేశారని ప్రచారం

లబోదిబోమంటున్న ప్లాట్ల కొనుగోలుదారులు 


గద్వాల, జూలై 8 (ఆంధ్రజ్యోతి) : గద్వాల తహసీల్దార్‌ కార్యాలయంలో రికార్డులను తారుమారు చేయడానికి ప్రయత్నించిన ప్రైవేట్‌ ఆపరేటర్‌ను రెవెన్యూ యంత్రాంగం పట్టుకున్నది. ఏ రకమైన తప్పిదాల కోసం ఈ రకమైన పని చేశావని, క్రిమినల్‌ కేసు నమోదు చేస్తామని హెచ్చరించడంతో జడిసిన ఆపరేటర్‌ అసలు కథ వెల్లడించాడు. ఈ విషయాన్ని రెవెన్యూ యంత్రాంగం జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారని సమాచారం. నిందితుడిని తీవ్రంగా మందలించారనే ప్రచారం జరుగుతోంది. కంప్యూటర్‌ ఆపరేటర్‌ ప్రభుత్వ సైట్‌ ఐఎల్‌ఆర్‌ఐఎంఎస్‌ (ఇంటిగ్రేటెడ్‌ ల్యాండ్‌ రికార్డ్సు అండ్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌) ఈ సైట్‌ను కేవలం తహసీల్దార్ల వద్ద ఉండే డిజిటల్‌ కీతో ఓపెన్‌ చేయడానికి సాధ్యం అవుతుంది. ఆపరేటర్‌కు డిజిటల్‌ కీ ఎలా వచ్చింది. ఎందుకు ఆపరేటర్‌ ఓపెన్‌ చేయాల్సి వచ్చింది అనే అంశాలపై రెవెన్యూ ఉద్యోగులు విచారణ జరుపుతున్నట్లు తెలిసింది.


ఆర్డీవో జారీ చేసిన పట్టా మార్పిడి కోసం..?

గద్వాల పట్టణంలోని 434, 435, 436 సర్వే నెంబర్లలో ఉన్న ఆరు ఎకరాల భూమిని గద్వాల సంస్థానాధీశులు సంస్థానంలో ఉద్యోగిగా పని చేసిన నూగురు నర్సింహారావు పేరున ఇనాం ల్యాండ్‌ ఇచ్చారు. ఆయన అనంతరం ఆ భూమి నర్సింహారావు కుమారుడు నరహరిరావు పేరున పట్టా అయ్యింది. గద్వాల నుంచి హైదరాబాద్‌కు మాకాం మార్చారు. నరహరిరావు పేరున ఉన్న భూమిని ఆయన సతీమణి సుశీల దేవి పేరున మార్పిడి జరిగింది. తమ అవసరాల కోసం సుమారు 4 ఎకరాల భూమిని ఇతరులకు అమ్మనారు. మిగిలిన 2.04 ఎకరాల భూమిని చాలా కాలంగా కాపాడుకుంటున్నారు. నాలుగు ఎకరాలు కొనుగోలు చేసిన వారు ఆరు ఎకరాల్లో ప్లాట్లు చేసి అమ్మకాలు సాగించారు.


బడలు రాళ్లు లేకుండా అమ్మకాలు చేపట్టారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నది. సుశీల దేవి పేరున ఉన్న రెండు ఎకరాలు 4 గుంటల స్థలంపై కొందరు వ్యక్తులు నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలు సృష్టించారు. సుశీలదేవికి ప్రస్తుతం 93 సంవత్సరాలు. బయటకురాలేని స్థితిలో మనుమడు యశ్వంత్‌ భూమిపై పోరాటం చేశాడు. చివరకు డిసెంబరు 2009లో ఆర్డీవో సుశీల దేవి పేరున 1.33 ఎకరాలు భూమి ఉన్నట్లు పట్టా ఇచ్చారు. ఈ భూమిలో వారం రోజుల క్రితం కంచె వేశారు. ఈ స్థలాన్ని తాము ఇంటి స్థలాలుగా కొనుగోలు చేశామని కొందరు బాధితులు వచ్చి కంచెను అపే ప్రయత్నం చేశారు. మా భూమిలో తానే కంచ వేశానని, మీకు అమ్మిన వ్యక్తిని అడగండి అంటూ భూమి హక్కుదారులు కంచెను ఏర్పాటు చేసుకున్నారు. ఈ విషయంపై ఇంటి స్థలంగా కొనుగోలు చేసుకున్న లబ్ధిదారులంతా కలిసి జిల్లా కలెక్టర్‌కు, గద్వాల మునిసిపాలిటీ కమిషనర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. పట్టాదారులకు తెలియకుండా భూమిని ప్లాట్‌గా నకిలీ పత్రాలతో అమ్మకాలు జరిపిన వ్యక్తి కోసం కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఐసీఆర్‌ఐఎంఎస్‌ను ఓపెన్‌ చేసే ప్రయత్నాలు చేశారని తెలియ వచ్చింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎకరానికి రూ. 10 కోట్ల నుంచి రూ. 12 కోట్ల మేర విలువ పలుకుతున్నట్లు తెలుస్తోంది.


ఇలాంటి విలువైన భూమిలో పైసా పైసా కూడబెట్టుకొని ఇంటి స్థలం కొనుగోలు చేసుకుంటే ఈ భూమి తమది అంటూ కంచెవేశాడని బాధితుడు వెంకటేష్‌ వాపోతున్నాడు. తనతో పాటు మరికొంత మంది కలిసి కలెక్టర్‌కు, కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చామని తెలిపారు. తమ భూమిలో తాము కంచె వేసుకున్నామని సుశీల దేవి మనుమడు యశ్వంత్‌ తెలిపారు. ఇద్దరి రికార్డులను పరిశీలించి ఓ నిర్ణయం తీసుకుంటామని గద్వాల మునిసిపల్‌ కమిషనర్‌ నర్సింహ తెలిపారు. ప్రభుత్వ సైట్‌ను లాగిన్‌ విషయంలో విచారణ జరుగుతుందని రెవెన్యూ అధికారులు చెప్పారు.

Advertisement
Advertisement