Abn logo
Sep 30 2020 @ 05:15AM

బ్యాంకులో చెప్పులతో దాడి

Kaakateeya

తాడిపత్రి, సెప్టెంబరు29: ఆంధ్రాబ్యాంకు స్థానిక శాఖలో మంగళవారం ఫీల్డ్‌ ఆఫీసర్‌ గంగాధర్‌రెడ్డి, వెంకటాంపల్లికి చెందిన పుల్లమ్మ బంధువులు పరస్పరం చెప్పులతో దాడి చేసుకోవటం కలకలం రేపింది. పుల్లమ్మకు ఆంధ్రాబ్యాంకులో ఖాతా ఉంది. అందులో నుంచి రూ.30వేలు అదే గ్రామానికి చెందిన పుల్లమ్మ అనే మరో మహిళకు బ్యాంకు అధికారులు పొరబాటున డ్రా చేసి, ఇచ్చారు. విషయం ఆలస్యంగా తెలుసుకున్న పుల్లమ్మ.. కుటుంబసభ్యులు, బంధువుల దృష్టికి తీసుకెళ్లింది. వారు వారం రోజుల క్రితం బ్యాంకు అధికారులను సంప్రదించారు. పేరు ఒకటే కావటంతో పొరబడ్డామనీ, అప్పటికప్పుడు రూ.10వేలు అందజేసి, మిగిలిన మొత్తాన్ని వారం రోజుల్లో ఇస్తామని సర్దిచెప్పి, పంపించారు. వారంరోజులు తర్వాత మంగళవారం పుల్లమ్మతోపాటు కుటుంబసభ్యులు, బంధువులు బ్యాంకుకొచ్చారు. బ్యాంకులోని ఫీల్డ్‌ ఆఫీసర్‌ గంగాధర్‌రెడ్డిని సంప్రదించి, మిగిలిన రూ.20వేలు ఇవ్వాలని కోరారు.


ఆయన అందుకు నిరాకరించారు. అదే గ్రామానికి చెందిన పుల్లమ్మ తమకు నగదు ఇంకా చెల్లించలేదనీ, ఆమె ఇచ్చాక ఇస్తామని చెప్పారు. అవసరమైతే మీరందరూ కలిసి ఆమె వద్దకు వెళ్లి, డబ్బు ఇప్పించుకోవాలని సలహా ఇచ్చారు. ఆమెతో తమకు మాటల్లేవనీ, నగదు ఇప్పించుకుని, తమకివ్వాలని ఫీల్డ్‌ ఆఫీసర్‌తో వారు వాగ్వాదానికి దిగారు. అది తారాస్థాయికి చేరుకుంది. ఆగ్రహావేశాలతో ఫీల్డ్‌ ఆఫీసర్‌, పుల్లమ్మ బంధువులు పరస్పరం బ్యాంకులోనే చెప్పులతో కొట్టుకున్నారు. కాళ్లతో తన్నుకున్నారు. ఫీల్డ్‌ ఆఫీసర్‌ను చొక్కా పట్టుకొని, బయటకు లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. ఈ పరిణామంతో బ్యాంకులోని వినియోగదారులు నివ్వెరపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు బ్యాంకుకు చేరుకుని, ఫీల్డ్‌ ఆఫీసర్‌, పుల్లమ్మ బంధువులను స్టేషన్‌కు తీసుకెళ్లారు. దాడిపై వారిని విచారించారు.

Advertisement
Advertisement
Advertisement