Abn logo
Sep 28 2020 @ 03:47AM

జడ్జి రామకృష్ణ తమ్ముడిపై దాడి

Kaakateeya

ముష్టిఘాతాలతో రక్త గాయాలు.. వైసీపీ నేతల పనే: జడ్జి ఆరోపణ 

పండ్లు కొనుగోలు చేస్తుండగా

కారులో వచ్చి ముష్ఠిఘాతాలు కురిపించి

ఇది వైసీపీ నాయకుల పనే: జడ్జి ఆరోపణ 


మదనపల్లె రూరల్‌, సెప్టెంబరు 27: చిత్తూరు జిల్లా బి.కొత్తకోటకు చెందిన దళిత జడ్జి రామకృష్ణ తమ్ముడు రామచంద్రపై కొందరు దుండగులు ఆదివారం దాడిచేశారు. ఈ ఘటనలో రామచంద్ర తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. బి.కొత్తకోట మండలం సూరపవారిపల్లెకు చెందిన కుమార్‌, ఆయన అనుచరులు కలసి తనపై దాడిచేసినట్లు తెలిపారు. బి.కొత్తకోట బస్టాండులో పండ్లు కొనుగోలు చేస్తుండగా కర్ణాటక రిజిస్ర్టేషన్‌ కలిగిన కారులో వచ్చిన వారు తనపై అనూహ్యంగా దాడిచేశారన్నారు. రక్తం కారేలా ముష్ఠిఘాతాలు కురిపించారని తెలిపారు. దాడిచేసిన వారికి, తనకు గతంలో ఎలాంటి గొడవలు లేవని రామచంద్ర చెప్పారు. కాగా, తీవ్రంగా గాయపడిన రామచంద్రను స్థానికులు చికిత్స నిమిత్తం బి.కొత్తకోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మదనపల్లె జిల్లా వైద్యశాలకు పంపారు. దీనిపై మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి మాట్లాడుతూ దాడి పథకం ప్రకారం జరగలేదని, రోడ్డుపై అనుకోకుండా జరిగిన ఘర్షణేనని తెలిపారు. ఈ దాడికి, రాజకీయాలకు సంబంధం లేదన్నారు. 


వైసీపీ నేతల పనే: జడ్జి

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గీయులకు, తమ కుటుంబానికి మధ్య ఇటీవల జరుగుతున్న భూవివాదాలే ఈ దాడికి కారణమని జడ్జి రామకృష్ణ ఆరోపించారు. స్థానిక వైసీపీ నాయకులు తన తమ్ముడిపై హత్యాయత్నానికి పాల్పడ్డారని చెప్పారు.  


రామకృష్ణ గొంతు నొక్కడానికే ‘దాడి’: బాబు

అమరావతి: దళిత న్యాయమూర్తి రామకృష్ణ గొంతు నొక్కడానికే ఆయన సోదరుడిపై దాడి జరిగిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శించారు. ఈ సంఘటనపై ఆదివారం ఆయన డీజీపీకి ఒక లేఖ రాశారు. ‘‘శనివారం విజయవాడలో జరిగిన దళిత మేధావుల రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో న్యాయమూర్తి రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వ దుశ్చర్యలను ఖండించిన మర్నాడే ఆయన సోదరుడిపై దాడి జరిగింది. అధికార వైసీపీ ప్రోద్భలంతో న్యాయమూర్తిని భయపెట్టి, నోరు మూయించడానికే కుట్రపూరితంగా ఈ దాడి జరిగిందని రుజువు అవుతోంది’’ అని చంద్రబాబు అందులో పేర్కొన్నారు. తీవ్ర ఆవేదనతో ఈ సంఘటనలపై డీజీపీకి పదేపదే లేఖలు రాస్తున్నానని పేర్కొన్నారు.  


ఇంకెంతమంది దళితుల్ని బలి తీసుకుంటారు?: లోకేశ్‌

‘‘దళితులపై దమనకాండ ఆపరా? ఎంతమంది దళిత బిడ్డలను బలి తీసుకుంటారు. వైసీపీ చెత్తపాలనలో దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే చంపేస్తారా? ఎందుకంత అహం?’’ అని టీడీపీ నేత లోకేశ్‌ ప్రశ్నించారు. రామచంద్రపై వైసీపీ నేతలు హత్యాయత్నం చేయడాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఖండించారు. నిందితుల్ని 24 గంటల్లో అరెస్టు చేయకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేస్తామన్నారు. కుల, క్షుద్ర రాజకీయాలకు వైసీపీ పేటెంట్‌ పొందిందని మాజీ మంత్రి చినరాజప్ప విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం దళితులపై దురాగతాలకే పెద్దపీట వేసిందని తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత ధ్వజమెత్తారు. 

Advertisement
Advertisement
Advertisement