Abn logo
Oct 17 2021 @ 02:42AM

బంగ్లాదేశ్‌లో మరోసారి హిందువులపై దాడి

ఇద్దరి దారుణహత్య.. ఆరుకు చేరిన మృతుల సంఖ్య

ఢాకా, అక్టోబరు 16: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం పలు హిందూ ఆలయాలపై దాడులకు తెగబడ్డ అల్లరి మూకలు.. శుక్రవారం మరోసారి దాడికి దిగాయి. దసరా ఉత్సవాల్లో భాగంగా.. స్థానిక మైనారిటీ హిందువులు ఏర్పాటుచేసిన ఓ మంటపంలో.. ఖురాన్‌ను అవమానించారని ఆగ్రహించిన ముస్లింలు వారిపై దాడులకు దిగి మంటపాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అల్లరిమూకలను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు ఆందోళనకారులు మరణించారు. ఈ క్రమంలో.. దసరా చివరి రోజున శుక్రవారం బేగంగంజ్‌ పట్టణంలో ప్రార్థనలు ముగించుకుని వస్తున్న వందలాది మంది ముస్లింలు.. అక్కడున్న దుర్గామాత మంటపంలోకి ఒక్కసారిగా చొరబడ్డారు. మంటపాన్ని ధ్వంసం చేయడంతో పాటు ఆలయ కమిటీ ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడ్ని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. అలాగే, మరో భక్తుడ్నీ హత్య చేసి పక్కనున్న చెరువులో పడేశారు. శనివారం ఉదయం ఘటనా స్థలిని పరిశీలిస్తున్న పోలీసులు.. చెరువులో పడి ఉన్న ఈ మృతదేహాన్ని కనుగొన్నారు. దీంతో.. ఈ అల్లర్లలో మరణించిన వారి సంఖ్య మొత్తంగా 6కు చేరింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు కీలక ప్రాంతాల్లో భారీగా మోహరించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

తాజా వార్తలుమరిన్ని...