Abn logo
Sep 9 2021 @ 01:13AM

సహకారానికి రూ.కోట్ల ముడుపులు

సహకారానికి రూ.కోట్ల ముడుపులు

సహకార సంఘాల్లో అక్రమ నియామకాలు, తొలగింపులు

జిల్లాలో 60 మందిని చేర్చుకున్న త్రిసభ్య కమిటీలు

రూ. 2 కోట్లకు పైగా చేతులు మారినట్లు సమాచారం

హెచఆర్‌ పాలసీ అమలు నేపథ్యంలో ప్రక్రియ ప్రారంభం

విచారణకు ఆదేశించిన అధికారులు

అనంతపురం క్లాక్‌టవర్‌, సెప్టెంబరు 8: జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో (సొసైటీల్లో) అక్రమ నియామకాలతో రూ.కోట్లు చేతులు మారాయి. జిల్లాలో మాత్రమే సుమారు 60 మందికి పైగా సిబ్బందిని అక్రమంగా నియమించుకున్నారు. సొసైటీల త్రిసభ్య కమిటీల నిర్వాకంతోనే ఈ అక్రమ నియామకాల ప్రక్రియ సాగింది. జిల్లాలో 107 సొసైటీల్లో ఒక్కొక్క సొసైటీకి ముగ్గురు చొప్పున సిబ్బంది ఉండాలి. అయితే ఇందుకు విరుద్ధంగా ఒక్కో సొసైటీలో నలుగురు నుంచి ఏడుగురి వరకు సిబ్బందిని ఇష్టానుసారం నియమించుకున్నారు. జిల్లా స్థాయి నియామక కమిటీకి  కనీస సమాచారం ఇవ్వకుండా సిబ్బందిని నియమించుకుని గత రెండేళ్లుగా జీతాలు సైతం చెల్లిస్తున్నారు. ఒక్కో సిబ్బంది నియామకానికి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ముడుపులు చేతు లు మారినట్లు సమాచారం. ఈ లెక్కన మొత్తం జిల్లాలో రూ.2 కోట్ల వరకు ఆమ్యామ్యాలు చేతులు మారినట్టు తెలుస్తోంది. ఒక్కో సొసైటీలో గతంలో నియమించిన సిబ్బందిని తొలగించి తమకు కావాల్సిన వారిని నియమించుకోవడంపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ తతంగమంతా జరిగిన తరువాత మేలుకున్న సహకార, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధికారులు ఆయా బ్రాంచలు, సొసైటీలకు హెచఆర్‌ పాలసీ అమలు నేపథ్యంలో   సిబ్బంది నియామకం, తొలగింపులు చేయరాదని ఆదేశాలు ఇచ్చారు. 60మందికి పైగా సిబ్బందిని అక్రమమార్గంలో నియమించుకున్న త్రిసభ్య కమిటీలు, గతంలో పనిచేస్తున్న సిబ్బంది సుమారు 30 మందిని ఇంటికి పంపించేశారు. జిల్లా స్థాయి నియామక కమిటీ (డీఎల్‌ఈసీ) అనుమతి లేకుండా సిబ్బందిని నియమించుకుని జీతాలు కూడా చెల్లిస్తున్నారు. డీఎల్‌ఈసీ కమిటీలో ఏడీసీసీ బ్యాంకు సీఈఓ కన్వీనర్‌గా, సభ్యులు ఏడీసీసీ బ్యాంకు చైర్మన, డీసీఓ, అప్కాబ్‌ మేనేజర్‌, నాబార్డు డీడీఎంలు ఉన్నారు. అయినా సొసైటీల త్రిసభ్యకమిటీలు, పర్సన ఇనచార్జ్‌లు తమకు నచ్చిన వారిని ముడుపులు తీసుకుని నియమించారని తెలుస్తోంది. 


23 సొసైటీలకు పైగా అక్రమ నియామకాలు

సహకార శాఖ, ఆప్కాబ్‌, నాబార్డు ఆదేశాలు, సొసైటీ టర్నోవర్‌ ఆధారంగా సిబ్బంది నియామకం ఉండాలి. ఇం దులో రూ.10 కోట్ల టర్నోవర్‌ ఉన్న సొసైటీలలో ముగ్గురు మాత్రమే సిబ్బంది. రూ.5 కోట్ల టర్నోవర్‌ ఉంటే ఇద్దరు సిబ్బంది ఉండాలి. అయితే మొత్తం జిల్లాలో 107 సొసైటీలకుగాను ఒక్కో సొసైటీకి సగటున 30 మంది సిబ్బంది ఉండాలి. ఒక వేళ రూ.10కోట్ల టర్నోవర్‌ దాటితే మరొకరిని నియమించుకునే వెసులుబాటు ఉంది. ఈ నిబంధనలకు వి రుద్ధంగా ఒక్కో సొసైటీలో నలుగురి నుంచి ఏడుగురి వరకు సిబ్బందిని నియమించుకున్నారు. ఎస్‌ఎల్‌ఈసీకి కనీస సమాచారం లేకుండా, ఇష్టానుసారం నియమించుకున్నారు. జిల్లాలో పరిశీలిస్తే గొట్లూరు సొసైటీలో ఏడుగురు, నల్లమాడలో ఏడుగురు సిబ్బంది ఉన్నారు. శింగనమల, గుంతకల్లు సొసైటీల్లో ఆరుగురు సిబ్బంది పని చేస్తున్నారు. పెనుకొండ- ఇస్లాపురం, కనగానిపల్లి, శెట్టూరు, మల్లిగానిపల్లి, తలమర్ల సొసైటీల్లో ఐదుగురు చొప్పున సిబ్బంది ఉన్నారు. బుక్కాపురం, గూనిపల్లి, దామాజిపల్లి, తాడిమర్రి, సోనగట్ట, వానవోలు, గాండ్లపెంట, మారాల, సైదాపురం, చాపిరి, కొత్తచెరువు, అమరాపురం, రొళ్లలో నలుగురు చొప్పున పనిచేస్తున్నారు. ఇక గత ప్రభుత్వంలో నియమించిన సిబ్బందిని తొలగించిన సొసైటీల్లో ఓబుళాపురం, సోమలాపురం, గుమ్మఘట్ట, బసినేపల్లి, రజాపురం, జంబులదిన్నెలలో ఒక్కరు కూడా సిబ్బంది లేరు. 


కళ్లు మూసుకున్నారా...వాటా తీసుకున్నారా ?

ఏడీసీసీ బ్యాంకు పరిధిలోని సహకార సొసైటీల్లోకి అడ్డ దారుల్లో వచ్చిన సిబ్బందికి వేతనాలు చెల్లిస్తున్నారు. అయి తే పర్యవేక్షించి, పరిశీలించాల్సిన ఉన్నతాధికారులే ఉదా సీనంగా వ్యవహరిస్తుండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. డీఎల్‌ఈసీలోని అధికారులు కళ్లు మూసుకున్నారా లేక ముడుపుల్లో వాటాలు తీసుకున్నారా అనే సందేహం కలుగుతోంది. రెండేళ్ల నుంచి జీతాలు ఇస్తున్నా కూడా పట్టించుకోలేని స్థితిలో అధికారులు ఉన్నారంటే... ఇక ఏ నిబంధనలు అడ్డుకుంటాయో అర్థం కాని పరిస్థితి. సొసైటీ ఉద్యోగులకు హెచఆర్‌ పాలసీ అమలు చేస్తున్న నేపథ్యంలో హడావుడిగా ఏడీసీసీ బ్యాంకు అధికారులు విచారణకు ఆదేశించి, సొసైటీల వివరాల సేకరణకు పూనుకున్నారు. అయితే ఇది కూడా ఉత్తుత్తిదేనా లేక నాటకీయ పరిణామాలు చేస్తున్నారా అనేది ఇక్కడ అనుమానాలకు తావిస్తోంది. 


సొసైటీలో సిబ్బంది వివరాలు సేకరిస్తున్నాం

సొసైటీల్లో ఉన్న సిబ్బంది వివరాలు ఇవ్వాలని ఆయా సంఘాలు, ఏడీసీసీ బ్యాంకు బ్రాంచ మేనేజర్లను ఆదేశించాం. ఎటువంటి నియామకాలు, తొలగింపులు చేయరాదని హెచఆర్‌ పాలసీ అమలు చేస్తున్న క్రమంలో సొసైటీ సిబ్బంది నియామకాలకు ప్రాధాన్యత ఉంది. ఇష్టాను సారం చేసిన సిబ్బంది నియామకాలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటాం. ఇందులో రాజీపడే ప్రసక్తేలే దు. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడైనా సిబ్బంది నియామకం చేపట్టినా, తొలగించినా బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.    - ఏబీ రాంప్రసాద్‌, ఏడీసీసీ బ్యాంకు సీఈఓ