Abn logo
Sep 16 2021 @ 01:18AM

ఊడిపోతున్న చక్రాలు

బస్సు చక్రాలు ఊడిపోవడంతో రోడ్డుపై ఆగిపోయిన ఉరవకొండ డిపో బస్సు (ఫైల్‌)

మొండికేస్తున్నఆర్టీసీ బండి

ఊడిపోతున్న చక్రాలు

ఎక్కడపడితే అక్కడ ఆగిపోతున్న బస్సులు

గ్యారేజీల్లో వేధిస్తున్న సిబ్బంది కొరత

నిర్వహణ గాలికొదిలేసిన అధికారులు

ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం

అనంతపురం టౌన, సెప్టెంబరు 15: ‘ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం’ ఇది సంస్థ స్లోగన. ప్రతి బస్సులోనూ కనిపించే వాక్యం. బస్సు ఎక్కిన ప్రయాణికులు మాత్రం సురక్షితంగా ఉండట్లేదు. అందుకు భిన్నమైన అనుభవాలు ఎదురవుతున్నాయి. బస్సు డుర్రు.. డుర్రు.. అంటూ అతి కష్టమ్మీద స్టార్ట్‌ అవుతోంది. ప్రయాణం కూడా అంతే. పెద్దపెద్ద శబ్దాలు చేస్తూ.. చాలా నిదానంగా నడుస్తున్నాయి. గతుకులు, గుంతలు, స్పీడ్‌బ్రేకర్ల రోడ్లలో అయితే దారుణం. ప్రయాణికులు ఇంత ఎత్తు ఎగిరిపడాల్సిందే. ఇన్ని ప్రయాసలు పడినా.. గమ్యం చేరుతామన్న గ్యారెంటీ ఉండదు. ఎక్కడ బస్సు మరమ్మతులకు వచ్చి ఆగిపోతుందో తెలీదు. అత్యంత భద్రంగా బిగించాల్సిన బస్సు చక్రాలు ఏకంగా ఊడిపోయి, పొలాల వెంట పరుగులు పెడుతున్నాయి. బస్సేమో రోడ్డుపై కునారిల్లుతోంది. డ్రైవర్ల సమయస్ఫూర్తి, ప్రయాణికులకు నూకలు మిగిలే ఉండడంతో ప్రాణాలతో బయటపడుతున్నారు. లేదంటే పదుల సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలిసిపోవాల్సిందే. డిపో నుంచి బస్సు తీయాలంటే డ్రైవర్లు కూడా హడలిపోతున్నారు. కండిషన లేని బస్సులతో ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని బెంబేలెత్తుతున్నారు. నిర్వహణ లోపమే ఈ దుస్థితికి కారణమని వారు పేర్కొంటున్నారు. గ్యారేజీల్లో శ్రామిక్‌ల కొరత తీవ్రంగా ఉంది. బస్సుల మరమ్మతులకు అవసరమైన సామగ్రి కూడా లేకపోవడంతో కండిషనను గాలికొదిలేసి, ప్రయాణికుల ప్రాణాలతో ఆర్టీసీ అధికారులు చెలగాటమాడుతున్నారు.

ఆర్టీసీ బస్సుల నిర్వహణను గాలికొదిలేయడంతో బ్రేక్‌డౌన సమస్యలు తలెత్తుతున్నాయి. రోజూ రీజియనలోని వివిధ డిపోల పరిధిలో అద్దెబస్సులు 194 కలుపుకుని, మొత్తం 925 వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటాయి. వీటిలో వెన్నెల 2, ఇంద్ర 11, సూపర్‌లగ్జరీ 127, అల్ర్టా డీలక్స్‌ 27, ఎక్స్‌ప్రెస్‌ 260, అల్ర్టా పల్లెవెలుగు 6, పల్లెవెలుగు 492 ఉన్నాయి. రోజూ ఎక్కడో ఒకచోట ఆర్టీసీ బస్సులు ప్రమాదాల బారిన పడుతూనే ఉన్నాయి. వీటిలో చాలావరకు కాలం చెల్లిన, కండిషన లేని బస్సులను వినియోగిస్తుండడమే కారణమని తెలుస్తోంది. రీజియనకు గతేడాది మార్చి 21వ తేదీన మాత్రమే కొత్త బస్సులు వచ్చాయి. ఆ తర్వాత ఒక్కటీ రాలేదు. 12 లక్షల కిలోమీటర్లు దాటిన బస్సులను స్ర్కాప్‌కు వేయాల్సుండగా... అధికారులు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా వాటిని పల్లెవెలుగు బస్సులుగా మార్చేస్తున్నారు. ఇలా 12 లక్షల కిలోమీటర్లకుపైగా తిరిగిన బస్సులు 60కిపైగా ఉన్నట్లు ఆర్టీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇంజనలోని భాగాలు అరిగిపోవడం, బస్సు చాసీ మెత్తబడిపోవడం వంటి కారణాలతో పల్లెల మార్గాల్లో గతుకుల రోడ్లపై వెళ్లే సమయంలో బస్సుల విడిభాగాలు దెబ్బతిని, ఆగిపోతున్నాయి. ఈనెల 9వ తేదీన ఉరవకొండ డిపోకి చెందిన బస్సు పాల్తూరు, హావళిగి మీదుగా విడపనకల్లుకు ప్రయాణికులు, విద్యార్థులతో బయల్దేరింది. హావళిగి వద్ద బస్సు యాక్షనట్యూబ్‌ అరిగిపోయి ఉండడంతో చక్రాలు వేరుగా వచ్చేశాయి. ఈ బస్సు ఇప్పటివరకూ 12.5 లక్షల కిలోమీటర్లు తిరిగింది. బస్సులోని వారికి ప్రమాదం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గతనెల 27వ తేదీన రాయదుర్గం డిపోకి చెందిన బస్సు దాదాపు 40 మంది ప్రయాణికులతో అనంతపురం వస్తోంది. జిల్లా కేంద్రంలో కళ్యాణదుర్గం బైపాస్‌ వద్దకు రాగానే ఇంజనలో బాల్‌ఎండ్‌ సీటింగ్‌ అరిగిపోయి ఇంజన పనిచేయకుండా ఉన్నఫలంగా ఆగిపోయింది. 20 నిమిషాల తర్వాత అదే రూట్‌లో వచ్చిన మరో బస్సులోకి ప్రయాణికులను ఎక్కించి, బస్టాండుకు పంపారు. ఇలా ఎక్కడపడితే అక్కడ ఆర్టీసీ బస్సులు మొరాయిస్తుండడంతో ప్రయాణికులు గమ్యస్థానం చేరుకునేవరకూ బిక్కుబిక్కుమంటూ వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.


షెడ్యూల్‌-1కు మంగళం

ఆర్టీసీ గ్యారేజీల్లో బస్సుల కండిషనను నాలుగు స్థాయిల్లో పరీక్షిస్తారు. షెడ్యూల్‌-1 కింద రోజూ డిపో నుంచి బస్సు బయటకు వెళ్లేముందు కండిషనను పరిశీలిస్తారు. వారానికోసారి చేసే పరిశీలనను షెడ్యూల్‌-2, నెలకోసారి చేసేది షెడ్యూల్‌-3, రెండునెలలకోసారి బస్సు కండిషనను పరిశీలిస్తే షెడ్యూల్‌-4గా పరిగణిస్తారు. వీటిలో షెడ్యూల్‌-1 అత్యంత కీలకమైనది. ఏరోజుకారోజు వాహన కండిషనను పరిశీలించడం ద్వారా ఏలోపం ఉన్నా గుర్తించి, పరిష్కరించిన తర్వాతే డిపో నుంచి బయటకు పంపే అవకాశం ఉంటుంది. రీజియనలోని అనంతపురం మినహా మిగిలిన 12 డిపోల్లో శ్రామిక్‌ల కొరత ఉంది. దీంతో షెడ్యూల్‌-1కు అధికారులు మంగళం పాడేశారు. ఇదే ఇటీవలి బస్సు ప్రమాదాలకు కారణమని ఆర్టీసీ సిబ్బందే పేర్కొంటున్నారు.


అడుగుతున్నా పట్టించుకోవడం లేదు..

 - గంగాధర, డ్రైవర్‌

రోజూ డిపో నుంచి బస్సు బయటకు తీసుకెళ్లే ముందు గ్యారేజీ సిబ్బందిని అడిగి బస్సు కండిషన పరిశీలించాలని కోరుతుంటాం. అయినా గ్యారేజీ అధికారులెవరూ స్పందించరు. ఇక చేసేదేమీ లేక దేవుడిమీద భారం వేసి, బస్సును అలాగే బయటకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి. మార్గమధ్యలో ఎక్కడైనా బస్సు ఆగితే సమీపంలోని గ్యారేజీ సిబ్బందికి ఫోన చేసి, పిలిపించుకోవాల్సి వస్తోంది. షెడ్యూల్‌-1ను కచ్చితంగా అమలు చేస్తే ఈ సమస్యలు తలెత్తవు.


సిబ్బంది కొరతను అధిగమించాలి

- షబ్బీర్‌, ఎనఎంయూ ప్రాంతీయ కార్యదర్శి

అనంతపురం మినహా అన్ని డిపోల్లోనూ శ్రామిక్‌ల కొరత ఉంది. ఆ పోస్టులను భర్తీ చేసి, కారుణ్య నియామకాలు చేపడితే సమస్య తీరుతుంది. గ్యారేజీల్లో బస్సుల మరమ్మతులకు కావాల్సిన మెటీరియల్‌ను సంపూర్ణంగా అందిస్తే కండిషనకు ఢోకా ఉండదు. 12 లక్షల కిలోమీటర్లు దాటి, కండిషన లేని బస్సుల స్థానంలో నూతనంగా కొనుగోలు చేయాలి.


ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం..

-  సుమంత ఆర్‌ ఆదోని, ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌

బస్సుల కండిషనపై సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాం. ఉరవకొండ డిపో బస్సు ఘటనలో సూపర్‌వైజర్‌ బస్సు కండిషనను సరిగా పరిశీలించకుండా బయటకు పంపాడు. దీనిపై విచారణ చేసి, సూపర్‌వైజర్‌పై చర్యలకు ఆదేశించాం. కొత్తబస్సులు కొనుగోలు చేయాలంటే బీఎ్‌స-6వి కావాలి. కరోనా పరిస్థితుల దృష్ట్యా బీఎస్‌-6 ఇంజన బస్సులు ఉత్పత్తి చేయలేదు. త్వరలో రాష్ట్ర అధికారులకు ప్రతిపాదనలు పెట్టి, కొత్తబస్సులను తెప్పించేందుకు కృషిచేస్తాం.