Abn logo
Sep 15 2021 @ 01:36AM

కార్పొరేషన వర్సెస్‌ విద్యుత శాఖ

బిల్లుల పెండింగ్‌తో నగర పాలక సంస్థకు విద్యుత సరఫరా నిలిపివేత

కలెక్టర్‌తో మాట్లాడిన తరువాతే పునరుద్ధరణ

విద్యుతశాఖ బిల్డింగ్‌ ట్యాక్స్‌ పెండింగ్‌పై చర్యలకు 

కార్పొరేషన అధికారులు సిద్ధం..?

కార్పొరేషన బకాయి రూ.5.50 కోట్లు, విద్యుతశాఖ బకాయి రూ.అర కోటి..

అనంతపురం కార్పొరేషన, సెప్టెంబరు 14: 

అనంతపురం నగరపాలక సంస్థ, విద్యుత శాఖ మ ధ్య ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభమైంది. అనంతపు రం కార్పొరేషనకు సంబంధించి విద్యుత బిల్లులు భారీగా పెండింగ్‌లో ఉండటమే ఈ వివాదానికి కారణంగా నిలిచింది. మంగళవారం హఠాత్తుగా నగరపాలక సంస్థ కార్యాలయానికి విద్యుత సరఫరా నిలిపేశారు. ఉదయం 8.30 గంటల సమయంలో విద్యుత కనెక్షన కట్‌ చే శారు. దీనిపై నగరపాలక సంస్థ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులను ప్రభుత్వానికి పంపామనీ, అవి రాకపోతే తామేం చేయగలమంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయానికి విద్యుత సరఫరా ఎలా నిలిపివేస్తారని మండిపడ్డారు. విషయం నగర కమిషనర్‌ పీవీవీఎస్‌ మూర్తి దృష్టికి రావడంతో ఆయన నేరుగా జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజనను కలిసినట్లు తెలిసింది. కలెక్టర్‌తో మాట్లాడిన తరువాతే 11 గంటల సమయంలో విద్యుత సరఫరాను పునరుద్ధరించారు. నగరపాలక సంస్థకు సంబంధించి ఆరు నెలలుగా విద్యుత బిల్లుల పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. పీఏబీఆర్‌ పరిధిలో మోటార్లకు సంబంధించి రూ.4.23 కోట్లు, కార్పొరేషన కార్యాలయం, నగరంలోని వీధిలైట్లకు సంబంధించి రూ.1.63 కోట్లు ఈ ఏడాది మే నెల నుంచి పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.


బిల్డింగ్‌ ట్యాక్స్‌ చెల్లించాల్సిందే...?

‘విద్యుత బిల్లు బకాయిలు ఉంటే పవర్‌ కట్‌ చేస్తారా..? మరి మీ భవనాల బిల్డింగ్‌ ట్యాక్స్‌ మాటేంటి?’ అని నగరపాలక సంస్థ అధికారులు ప్ర శ్నిస్తున్నారు. ప్రభుత్వ శాఖల భవనాలైనా నగరపాలక సంస్థకు బిల్డింగ్‌ ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. గత నెలలోనే నోటీసులు ఇచ్చినట్లు సం బంధిత రెవెన్యూ విభాగ అధికారులు చెబుతున్నారు. వాటిని చెల్లించకపోతే శాఖాపరమైన చర్యలకు సిద్ధమవ్వాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. జేఎనటీయూ కళాశాల రోడ్డులోని ఏపీఎస్పీడీసీఎల్‌ ఎస్‌ఈ కార్యాలయం బిల్లు రూ.13,44,198, మున్నానగర్‌లోని పవర్‌ఆఫీస్‌ బిల్లు రూ.5,10,534, జీసస్‌ నగర్‌లోని సబ్‌స్టేషన బిల్లు రూ.19,19,370, గుత్తిరోడ్డు అసిస్టెంట్‌ డివిజనల్‌ ఆఫీస్‌ బిల్లు రూ.5,83,032, ఆర్ట్స్‌ కళాశాల మైదానం పక్కనున్న డివిజన ఆఫీస్‌ బిల్లు రూ.8,82,397, బళ్లారిరోడ్డులోని మరో సబ్‌స్టేషన బిల్లు రూ.2,22,10, అదనంగా మరికొంత కలిపి మొత్తం రూ.54లక్షలుపైగా పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. వీటిపై చర్యలకు నగర పాలక సంస్థ అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ వివాదం ఎందాకా వెళ్తుందోనని అటు విద్యుత శాఖ, ఇటు కార్పొరేషన వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.