Abn logo
Jul 31 2021 @ 01:14AM

డబ్బులిస్తే.. ఏమైనా చేసేస్తారు..!

నగరపాలక సంస్థ హెల్త్‌ విభాగంలో అక్రమార్కుల హవా

కారుణ్య నియామకానికి రూ.6.50 లక్షలు వసూలు

ఓ మహిళా ఉద్యోగి స్థానంలో 

మరొకరి మార్పునకు రూ.4 లక్షలు

సూపరింటెండెంట్‌, 

సీనియర్‌ అసిస్టెంట్‌, ఆపరేటర్‌ బాగోతం

శాలరీ సర్టిఫికెట్‌కూ ముడుపులు

అనంతపురం కార్పొరేషన్‌, జూలై30: వీళ్లు ఉద్యోగులు కారు. ముదుర్లు. డబ్బులిస్తే ఏమైనా చేసేస్తారు. డబ్బు కోసం ఎంతటి అక్రమానికైనా వెనుకాడరు. కారుణ్య నియామకం ఇచ్చేందుకు ఏకంగా రూ.6 లక్షలు గుంజారంటే అమ్మో..! మామూలోళ్లు కాదు. ఒక ఉద్యోగి స్థానంలో మరొకరిని చేర్చారంటే వారు ఏస్థాయిలో అక్రమాలకు పాల్పడుతున్నారో.. అంచనాలకు కూడా అందదు. వీరు ఈ రేంజ్‌లో అవినీతికి పాల్పడుతున్నా.. ఉన్నతాధికారులు కళ్లు మూసుకున్నారో.. ఏమో.. అంతుపట్టడం లేదు.

అనంతపురం నగర పాలక సంస్థలో అవినీతి తారాస్థాయికి చేరింది. చివరికి డబ్బు తీసుకుని ఉద్యోగాలిచ్చే స్థాయికి దిగజారారు. కొందరు చేస్తున్న నీతిమాలిన వ్యవహారాలతో కార్పొరేషన్‌ అవినీతి కంపు కొడుతోంది. న్యాయబద్దంగా రావాల్సిన కారు ణ్య నియామకానికి సైతం ముడుపులు పుచ్చుకుంటున్నారంటే వారెంత కక్కుర్తి పడుతున్నారో అర్థమవుతుంది. నగరపాలక సంస్థ కార్యాలయంలోని మెయిన్‌హాల్‌లో తిష్ట వేసిన ఆ ముగ్గు రు సాగిస్తున్న వ్యవహారం చిన్నస్థాయి ఉద్యోగులైన వర్కర్ల విషయంలో పెను సమస్యగా మారింది. ఇప్పటికే పలు ఉద్యోగాల వ్యవహారాల్లో వేలుపెట్టి, వసూళ్లు చేసిన వారి తాజా ఉదంతాలు పాలకవర్గాన్ని సైతం ఆశ్యర్య పరుస్తున్నాయి. హెల్త్‌ విభాగంలో ప్రతి ఫైల్‌కు ఓ రేటు అన్న చందంగా బేరం పెట్టి, మరీ వసూలు చేస్తున్నారు. వారి వ్యవహారం అధికారులకు తెలిసినా చూసీచూడనట్లు ఉంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


కారుణ్య నియామకానికే రూ.లక్షలు..!

నగరంలో పారిశుధ్య విభాగంలో మొత్తం 50 డివిజన్లకుగాను ఆరు సర్కిళ్లున్నాయి. అందులో మొదటి సర్కిల్‌లో పనిచేస్తున్న రెగ్యులర్‌ వర్కర్‌ ఏడాది క్రితం మృతి చెందారు. ఆమె స్థానంలో ఆమె పెంచుకున్న దత్తత కుమారుడికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాల్సి ఉంటుంది. నిబంధనల మేరకు సంబంధిత డాక్యుమెంట్లు అందజేస్తే చాలు. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. పలు సర్టిఫికెట్ల కోసం తహసీల్దార్‌ కార్యాలయానికి తిరగాల్సి వచ్చింది. ఇక్కడ ఆలస్యమయ్యేలా ఆ ముగ్గురూ ఉద్దేశపూర్వకంగా చేశారు. దీంతో బాధిత కుటుంబం ఓ సామాజికవర్గానికి చెందిన సంఘాన్ని ఆశ్రయించింది. ఆ ముగ్గురూ, ఈ సంఘం నాయకులు కుమ్మక్కై రూ.6.50 లక్షలకు బేరం పెట్టేశారు. ముందు సగం ఇచ్చి, ఉద్యోగం రాగానే మిగతా డబ్బు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. ఆ కుటుంబం ఆర్థికంగా బాగానే ఉండటంతో ఇబ్బంది లేకపోయింది. అలా ఆ ముడుపులు అందగానే ఫైల్‌ ముందుకు కదలడం మూడు నెలల క్రితం ఉద్యోగం రావడం జరిగిపోయాయి. పై అధికారులకు కూడా తెలియకుండా ఈ వ్యవహారం నడిపారు. సంబంధిత విభాగంలో ఓ సూపరింటెండెంట్‌, సీనియర్‌ అసిస్టెంట్‌, కంప్యూటర్‌ ఆపరేటరే ఈ మొత్తం కథ నడిపారు. డబ్బు బాగా ఉన్నవారినే వారి పట్టేస్తారట.


కార్మికురాలి స్థానంలో మరొకరు..

ఇది మరింత ఘోరం. నగరంలోని ఆరో సర్కిల్‌లో పనిచేసే ఓ మహిళాఔట్‌సోర్సింగ్‌ కార్మికురాలు తన భర్త అనారోగ్యం కోసమని ఓ వ్యక్తి వద్ద రూ.2.50 లక్షలు అప్పుగా తీసుకుంది. ఆ సమయంలో అవతలి వ్యక్తి డబ్బు ఇవ్వకపోతే నీ ఉద్యోగం ఇవ్వాలంటూ ఒప్పందం చేసుకున్నాడట. డబ్బు అవసరం కావడంతో ఆమె వడ్డీతోనైనా చెల్లిస్తాననే నమ్మకంతో రాయించి, ఇచ్చింది. ఆమె డబ్బు చెల్లించడం ఆలస్యమైంది. దీంతో ఓ సంఘం నాయకులు ఆమె ఉద్యోగానికి బేరం పెట్టేశారు. అలా ఉద్యోగాల ఫైల్‌ ముందుకు కదలాలంటే మెయిన్‌హాల్‌లో ఉన్న ఈ ముగ్గురే కీలకం. ఉద్యోగం కోసం ఆసక్తి ఉన్న వీరందరూ బేరం కుదిర్చినట్లు సమాచారం. మొత్తం రూ.4.50 లక్షలకు డీల్‌ కుదిరింది. డబ్బు చేతికందగానే ఫైల్‌ ముందుకు కదిలింది. ఇలాంటి ఫైల్‌లో ఉన్నతాఽధికారుల వరకు ఎలా అనుమతించారో వారికే తెలియాలి. ఆరో సర్కిల్‌లో లక్ష్మి అనే మహిళ స్థానంలో రాజు అనే పేరు ఎలా వచ్చిందని ఆరాతీస్తే అధికారులకు ఆ గుట్టు తెలిసిపోతుంది. ఆ సమయంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌కు కూడా తెలియకుండా గుట్టుగా వ్యవహారం నడిపారంటే వీరెంత ఘటికులో అర్థం చేసుకోవచ్చు.


శాలరీ సర్టిఫికెట్ల నుంచి...

ఆ ముగ్గురు వసూళ్ల వ్యవహారం అంతా ఇంతా కాదు. పదవీ విరమణ చెందిన వారికి రావాల్సిన బెనిఫిట్స్‌ విషయంలోనూ వారికి ముడుపులు అందుతుంటాయి. ఉద్యోగ విరమణ ప్రయోజనాల కోసం కార్పొరేషన్‌ సిబ్బందే అన్నింటినీ పూర్తిచేసి, ట్రెజరీ శాఖకు పంపాలి. కానీ ఈ ముగ్గురూ ఉద్యోగులను ట్రెజరీ వద్దకు పంపుతారు. అక్కడ వీరితో సంబంధమున్న ఓ వ్యక్తి రూ.50 వేలు ఇస్తే నీ డబ్బు నీ ఖాతాలో పడుతుందని చెబుతాడట. మళ్లీ ఆ ఉద్యోగులు ఈ ముగ్గురి వద్దకు వస్తే తామేదో బేరం నడిపినట్లు రూ.40వేలు అందజేస్తారని చెబుతారట. వచ్చే బెనిఫిట్స్‌ రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల కోసం ఆ రిటైర్డ్‌ ఉద్యోగులు ఆ మొత్తాన్ని కట్టబెడుతున్నట్లు సమాచారం. ఇక బ్యాంకు రుణం, ఇతరత్రా వాటి కోసం వర్కర్లు శాలరీ సర్టిఫికెట్‌ కోసం వెళ్తే రూ.1000 ముట్టజెప్పాల్సిందేనట.