Abn logo
Aug 2 2021 @ 00:53AM

ప్రభుత్వ స్థలాలు.. అన్యాక్రాంతం..!

అక్రమ కట్టడాలను పరిశీలిస్తున్న అధికారులు (ఫైల్‌)

నోటీసులిచ్చినా బేఖాతర్‌
యథేచ్ఛగా నిర్మాణాలు

చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు


లక్షలాది రూపాయలు విలువచేసే ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. వాటిపై ప్రజలు.. అధికారుల దృష్టికెళ్లగా.. వారు నోటీసులు కూడా ఇచ్చారు. అయినా.. అక్రమార్కులు ఖాతరు చేయట్లేదు. యథేచ్చగా నిర్మాణాలు చేపడుతన్నారు. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. వారి వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


మడకశిర/అమరాపురం, ఆగస్టు 1: మడకశిర నియోజకవర్గంలో పలుచోట్ల ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. రోడ్లు భవనాలు, నీటిపారుదల శాఖల పరిధిలోని స్థలాల్లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే అవకాశం లేదు. అయినా కొంతమందికి అనుమతులు ఇచ్చినట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సంబంధిత రెవెన్యూ అధికారులు మాత్రం తాము ఎవరికీ అనుమతులు ఇవ్వలేదని పే ర్కొంటున్నారు. నిర్మాణాలకు అనుమతులు ఎలా లభించాయనేది ప్రశ్నగానే మిగిలింది. దర్యాప్తు చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. నియోజకవర్గంలోని అమరాపురం, మడకశిర ప్రాంతాల్లో కొన్నిచోట్ల ప్రభుత్వ స్థలాలు ఆక్రమణల బారిన పడ్డాయి.

అమరాపురంలో సర్వే నెంబరు 636-10లోని చెరువు మరువ వంక పోరంబోకు 0.68 ఎకరాలు భూమి ఉంది. ఇందులో 20 శాతానికిపైగా స్థలాన్ని ఆక్రమించేశారు. 663-1 సర్వే నెంబరులో 1.30 ఎకరాలు రోడ్డుకిరుపక్కలా రోడ్లు, భవనాల శాఖ స్థలం ఉంది. ఇం దులో కూడా కొంతమంది ఆక్రమించుకుని, నిర్మాణాలు చేపట్టారు. మార్కెట్‌ విలువ ఆధారంగా ప్రస్తుతం ఆ భూమి సెంటు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పలుకుతోంది. ఇరిగేషన్‌ శాఖ పరిధిలో ఉన్న వంకపోరంబోకు స్థలాలకు అనుమతులు ఇవ్వడానికి ఆస్కారం లేదు. అయినా కొందరు పది సంవత్సరాల క్రితం గుట్టుచప్పుడు కాకుండా అనుమతులు తీసుకుని, అది తమ స్థలమేనంటూ నిర్మాణాలు చేపట్టారు. అప్పట్లో ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్‌ శాఖల అధికారులు దీనిపై దృష్టి సారించకపోవడంతో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రస్తుతం సంబంధిత శాఖ అధికారుల దృష్టికి సమాచారం వెళ్లడంతో ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా ఆ ప్రాంతానికి వెళ్లి, అక్రమ నిర్మాణాలను పరిశీలించి, వారికి నోటీసులు కూడా ఇచ్చారు. అయినా నిర్మాణాలు చేపడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అమరాపురంలో ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బీకి సంబంధించిన లక్షలాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ స్థలాలపై పలువురి కన్ను పడడంతో ఆ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. భవనాలు నిర్మించుకుంటున్నారు. అన్నీ తెలిసినా అధికారులు చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఆక్రమణల విషయాన్ని పలువురు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా వారు హడావుడి చేసి, అనంతరం అటువైపు చూడరని పలువురు బహిరంగంగానే అంటున్నారు. ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఇప్పటికైనా వాటిని స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉంది.


మా దృష్టికి రావడంతో నోటీసులు ఇచ్చాం

- గంగాద్రి, నీటిపారుదల డీఈ

మైనర్‌ ఇరిగేషన్‌ శాఖ చెరువు పరిధిలో వంక పోరంబోకు స్థలాలు ఆక్రమణల బారిన పడుతున్నాయని మా దృష్టికి రావడంతో నోటీసులు ఇచ్చాం. అమరాపురం చెరువు మరువ వంకకు సంబంధించి 636-10లో 0.68 సెంట్లస్థలం ఉంది. ఇందులో కట్టడాలు చేపడుతున్నట్లు మా దృష్టికి రావడంతో పరిశీలించాం. నిర్మాణాలు చేపట్టకూడదని నోటీసులు ఇచ్చాం. తమ శాఖ పరిధిలోని స్థలాలను ఆక్రమిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.


అనుమతులు ఇవ్వలేదు

అమరాపురంలో ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బీ స్థలాల్లో కట్టడాలకు అనుమతులు ఇవ్వలేదు. అక్రమ నిర్మాణాలను పరిశీలించి, చర్యలు తీసుకుంటాం.

- అపర్ణ, తహసీల్దార్‌, అమరాపురం