Abn logo
Sep 13 2021 @ 01:02AM

టెన్షన.. టెన్షన..!

మడకశిర ఐసీడీఎస్‌ ప్రాజెక్టులో 30 మంది ఏసీబీ అధికారులు, సిబ్బంది తనిఖీలు

ఫిర్యాదులతోనే అధికారుల దాడులా !

పాత అవినీతితో ఇతర సీడీపీఓల్లో గుబులు

ఏసీబీ తనిఖీలపై విస్తృత చర్చ

అనంతపురం వైద్యం, సెప్టెంబరు 12: మడకశిర ఐసీడీఎస్‌ ప్రాజెక్టులో గత మంగళవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు దాదాపు 30 మంది ఏసీబీ అధికారులు, సిబ్బంది తనిఖీలు నిర్వహించటం సర్వత్రా చర్చనీయాంశమైంది. సీడీపీఓ కార్యాలయంలో రికార్డులతో పాటు ఆ ప్రాజెక్టు పరిధిలోని వివిధ మండలాల్లో ఉన్న అంగనవాడీ కేంద్రాలను ఏసీబీ అధికారులు పరిశీలించారు.  లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అంగనవాడీల ద్వారా పౌష్టికాహారం, కోడిగుడ్లు, పాలు నెలనెలా సక్రమంగా అందాయా లేదా అని కూడా ఆరా తీశారు.  ఇంత మంది ఒకేసారి, ఒకే ప్రాజెక్టులో తనిఖీలు చేసిన దాఖలాలు ఇది వరకు లేవని ఐసీడీఎస్‌ వర్గాలే చెబుతున్నాయి. అయితే ఇప్పుడు ఏసీబీ అధికారులు, సిబ్బంది రెండు రోజుల పాటు పక్కా గా పరిశీలించి వెళ్లారు. అక్కడ అక్రమాలు జరిగాయా, లేదా అనే విషయం కూడా బయటకు చెప్పకుండా నివేదికలు తీసుకెళ్లారు.  ప్రధానంగా ఇద్దరు అధికారుల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరే ఈ తనిఖీలకు కారణమన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పనిచేస్తున్న ఓ అసిస్టెంట్‌ సీడీపీఓ ఇనచార్జ్‌ సీడీపీఓగా బాధ్యతలు చేపడుతూ వస్తున్నారు. ఆమె మడకశిర ప్రాజెక్టుకు వెళ్లాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక దశలో ఆ ప్రాజెక్టుకు ఉత్తర్వులు తెచ్చుకున్నా అక్కడి ప్రజాప్రతినిధులు ఆ ఉత్తర్వులను నిలుపుదల చేశారని ప్రస్తుత సీడీపీఓకే మద్దతు పలికారని చెబుతున్నారు. అప్పటి నుంచి మడకశిర ప్రాజెక్టుపై ఆ అసిస్టెంట్‌ సీడీపీఓ కక్ష కట్టి అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని పలు దఫాలుగా ఫిర్యాదులు చేయించినట్లు చెబుతున్నారు. కలెక్టర్‌, ఆర్జేడీ, రాష్ట్ర డైరెక్టర్‌, కమిషనర్‌, మంత్రి, ముఖ్యమంత్రి, గవర్నర్‌కు కూడా ఫిర్యాదులు పంపినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కింది స్థాయి అధికారులు విచారణ చేసి ఏమీలేదని నివేదికలు పంపగా వాటిపైన మళ్లీ పై అధికారులు, మంత్రులు, సీఎం, గవర్న ర్‌కు ఫిర్యాదు చేసినట్లు చర్చించుకుంటున్నారు. దీంతో ప్రభుత్వం సీరియ్‌సగా స్పందించి ఏసీబీ అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో మడకశిర ప్రాజెక్టుకు 30 మంది వరకు తనిఖీలకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ తనిఖీలలో ఏమేర అక్రమాలు బయటపడ్డాయో తెలీక అందరిలోనూ ఒకటే ఉత్కంఠ నెలకొంది. 


పాత అవినీతితో ఆందోళన

ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని విమర్శలు వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా ఆరోపణలు రావడంతో అప్పటి కలెక్టర్‌ గంధం చంద్రుడు దీన్ని తీవ్రంగా పరిగణించి విచారణకు జిల్లా అటవీశాఖ అధికారి నిషాంతరెడ్డిని నియమించారు. ఆయన దాదాపు రెండు నెలల పాటు విచారణ సాగించారు. పౌష్టికాహారం, పాలు, గుడ్లు పంపిణీలో పెద్దఎత్తున అవకతవకలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై ఆయన పక్కాగా విచారణ సాగించారు. క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పరిశీలన సాగించారు. గత ఏడాది మార్చి 23 నుంచి కరోనా లాక్‌ డౌన మొదలైంది. పౌష్టికాహారం, పాలు, గుడ్లు సరఫరాకు బ్రేక్‌ పడింది. అయితే మార్చి, ఏప్రిల్‌, మే నెలలో కూడా సరఫరా చేసినట్లు ట్రాన్సపోర్ట్‌ అలవెన్స బిల్లులను సీడీపీఓలు పెట్టినట్లు విచారణలో తేలిందని చెబుతూ వచ్చారు. కొందరు సీడీపీఓలు బిల్లుల విషయంలో మాయా జాలం చూపినట్లు కూడా ఆ విచారణలో తేల్చారు. గత ఏడాది మార్చి నెలలో పెట్టిన బిల్లులు ఆ తర్వాత వరుసగా మరో రెండుమూడు నెలలు అదే బిల్లులు పెట్టి డబ్బులు డ్రా చేసుకున్నట్లు ఆ విచారణలో వెలుగులోకి వచ్చిందని అధికారులు అప్పట్లో చెప్పుకొచ్చారు. గత ఏడాది నిధులకు సంబంధించి అంగనవాడీ కేంద్రాలకు ప్లేట్‌లు, గ్లాస్‌లు పంపిణీ చేయకుండానే సరఫరా చేసినట్లు సంతకాలు పెట్టి కాంట్రాక్టర్‌కు బిల్లులు ఇచ్చి సీడీపీఓలు దొరికిపోయారు. దాదాపు రూ.18 లక్షల ఈ కుంభకోణంపై కలెక్టర్‌తో పాటు ఐసీడీఎస్‌ ఆర్జేడీ పద్మజ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా చేసిన 16 మంది సీడీపీలకు ఆర్జేడీ షోకాజులు కూడా జారీ చేశారు. సీడీపీఓలు, కాంట్రాక్టర్‌, ఐసీడీఎస్‌ జిల్లా కార్యాలయం రికార్డులకు చాలా వ్యత్యాసాలు ఉన్నట్లు విచారణలో బయటపడ్డాయని తేల్చారు. జిల్లా వ్యాప్తంగా సీడీపీఓలు, సూపర్‌వైజర్లు, అంగనవాడీల ద్వారా రూ.కోట్లలో అక్రమాలు జరిగాయని ఆ విచారణ సమయంలో పెద్దఎత్తున ప్రచారం సాగింది. పలువురు సీడీపీఓలపై వేటు పడుతుందని, ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకుంటే కొందరు సీడీపీఓల ఉద్యోగాలకే ఎసరు వస్తుందని భారీగా ప్రచారం సాగింది. అయితే ఆ విచారణ నివేదికలు బుట్టదాఖలు అయ్యాయి. ఆరు నెలల కిందట ముగ్గురు సీనియర్‌ అసిస్టెంట్‌లను సస్పెండ్‌ చేశారు. దీంతో సీడీపీఓలపై వేటు తప్పదని ఉత్కంఠగా చూస్తూ వచ్చినా ఆ వ్యవహారం సద్దుమణిగింది. ఇప్పుడు మడకశిర ప్రాజెక్టుపై ఏసీబీ తనిఖీలు చేయడంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర సీడీపీఓల్లోనూ గుబులు మొదలైంది. ఇది ఎందాక వస్తుందోనని ఐసీడీఎస్‌ అధికారుల్లోనూ ఆందోళన నెలకొంది.