Abn logo
Sep 13 2021 @ 01:00AM

ప్రభుత్వాస్పత్రి అదనపు భవన నిర్మాణానికి ఇతర శాఖల స్థలాలు

ఆర్‌అండ్‌బీ కార్యాలయం

ఇది... తగునా ?

ప్రభుత్వాస్పత్రి అదనపు భవన నిర్మాణానికి ఇతర శాఖల స్థలాలు

 సూపర్‌ స్పెషాలిటీ పక్కన ఎందుకు ఆలోచించలేదు...?

 ఆస్పత్రి ప్రాంగణంలోనే ఐదంతస్తుల భవనం సరిపోదా..?

8.3 ఎకరాలు ఎందుకు సేకరిస్తున్నట్లు...?

ప్రభుత్వానికి నష్టం రూ.వంద కోట్లపైనే

భవనాన్ని  ఖాళీ చేయాలని

ఆర్‌అండ్‌బీ అధికారులపై ఒత్తిడి

మంత్రి సొంత ఇలాఖాలో ఆర్‌అండ్‌బీకి భవన కష్టాలు

అనంతపురం కార్పొరేషన, సెప్టెంబ రు 12: జిల్లా ప్రభుత్వ సర్వజనాస్పత్రికి అనుబంధంగా భవనాల నిర్మాణానికి ప్రభుత్వ భవనాలున్న భూములు సేకరిస్తున్నారు. 8.3 ఎకరాల్లో ఆ భవనాలు నిర్మించాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అందుకు జలవనరుల శాఖ, రోడ్లు, భవనాల శాఖ భవనాలను కూల్చివేసేందుకు కూడా రంగం సిద్ధమైంది. అదనపు భవనాల కోసం ఇంత తతంగం అవసరమా...? అని మేధావి వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. దాదాపు పాతిక ఎకరాల వరకు ఉన్న ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలోనే ఎందుకు నిర్మించకూడదనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతోంది. సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి పక్కన ఎందుకు నిర్మించకూడదనే వాదన కూడా వినిపిస్తోంది. కానీ ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆ స్థలాల్లోనే భవనాలు నిర్మించాలనే ప్రతిపాదనను ఎందుకు తీసుకొచ్చా రనేది అంతుబట్టడం లేదు. 


ఐదంతస్తుల భవనం సరిపోదా..?

జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ హౌసింగ్‌ విభాగంలో ఇంజనీరింగ్‌ అధికారులు ఆస్పత్రి ప్రాంగణంలోనే దాదాపు ఐదంతస్తుల విశాల భవనం నిర్మించి, అందులో  వివిధ విభాగాలకు కేటాయించాలని ఏడాది క్రితమే ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఆస్పత్రి ప్రాంగణంలోనే బ్రిటీష్‌ కాలంలో నిర్మించిన ఓ భవనం శిథిలావస్థకు చేరిందని సమాచారం. ఆ భవనం కూల్చివేస్తే దాదాపు రెండెకరాల స్థలం ఖాళీ అవుతుందని చెబుతున్నారు. ఆ స్థలంలోనూ ఐదంతస్తుల భవనం నిర్మించాలని ప్రణాళికలు వేసినట్లు తెలుస్తోంది. ఆ ప్రతిపాదనను ఆమోదించకపోవడం గమనార్హం. ఆ నిర్ణయాన్ని పక్కనపెట్టి ప్రభుత్వ శాఖల భవనాలు కూల్చి వాటి స్థానంలో నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు రూ.300 కోట్లకుపైగా నిధులు కూడా వెచ్చించనున్నట్లు తెలిసింది. తాము ఒకలా అనుకుంటే మరోలా జరుగుతుండటంపై ఆశ్చర్యపోవడం ఆ శాఖ హౌసింగ్‌ ఇంజనీరింగ్‌ విభాగం అధికారుల వంతైంది. 


13 ఎకరాల నుంచి 8.3 ఎకరాలకు....

అదనపు భవనాల నిర్మాణాల కోసమని 8.3 ఎకరాల ప్రభుత్వ భూమిని తీసుకుంటున్నారు. తొలుత అగ్నిమాపక శాఖ, నగరపాలక సంస్థ అతిథిగృహం ఉన్న 4 ఎకరాలు కూడా తీసుకోవాలని భావించినట్లు తెలుస్తోంది. అంటే 13 ఎకరాల వరకు ఆ భవనాలకు కేటాయించాలని నిర్ణయించినట్లు తెలిసింది. అయితే తాము ఎక్కడో ఉంటే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని అగ్నిమాపక శాఖ అధికారులు చెప్పడంతో ఆ భూమి విషయంలో వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. దాంతో కార్పొరేషన గెస్ట్‌హౌస్‌ కూడా పక్కన పెట్టేశారని సమాచారం.  రోడ్లు, భవనాల శాఖ 4.5 ఎకరాలు, జలవనరులు, భూగర్భజల శాఖ కార్యాలయ భవనాలు 3.8 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. మొత్తం 8.3 ఎకరాల భూమి అవసరమని భావిస్తూ మూడునెలల కిందట ప్రభుత్వం నుం చి ఉత్తర్వులు వెలువడ్డాయ ని అధికారులు చెబుతున్నారు.


పురావస్తు శాఖ నూతన భవనం

ఆర్‌అండ్‌బీకి భవనమెక్కడ...?

జిల్లా కేంద్రంలోని రోడ్లు, భవనాల శాఖ కార్యాలయం ఖాళీ చేయాలని ఆదేశాలందాయి.  ఆ మేరకు అధికారులు, సిబ్బంది సంసిద్ధులయ్యారు. కానీ ఎక్కడికెళ్లాలి...? వాటన్నింటినీ ఎక్కడ సర్దుకోవాలనే ప్రశ్న వారిని వేధిస్తోంది. అధికారులు ఎక్కడ వెతికినా ప్రభుత్వానికి సంబంధించిన భవన సముదాయాలు కూడా కనిపించలేదని తెలుస్తోంది.  ఇరిగేషన, భూగర్భజల శాఖ అధికారులు, సిబ్బంది సంబంధిత భవనాలను ఇప్పటికే దాదాపు ఖాళీ చేసేశారు. వాటి పాత భవనాల్లో సర్దేసి విధులు నిర్వర్తించేందుకు సిద్ధమయ్యారు. కానీ ఆర్‌అండ్‌బీ కార్యాలయం ఎక్కడ ఉంచాలనేది ఆ శాఖాధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. అటు ఉన్నతాధికారుల నుంచి ఎప్పుడు ఖాళీ చేస్తారంటూ ఒత్తిళ్లు వస్తున్నట్లు సమాచారం.  ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి సొంత ఇలాఖాలోనే ఆ శాఖ జిల్లా కార్యాలయానికి భవనం  వెతుక్కోవాల్సిన పరిస్థితి రావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  హెచ్చెల్సీ కాలనీలోని ఓ ప్రభుత్వ కార్యాలయమున్న భవనం చూపించారని తెలిసింది. కానీ అందులో ఆ శాఖ ఎస్‌ఈ, ఇతర సిబ్బంది విధులు నిర్వర్తించేందుకే ఇబ్బందిపడే పరిస్థితి ఉన్నట్టు సమాచారం. 



పురావస్తు శాఖ భవనం లేనట్లేనా?

దాదాపు నాలుగున్నర ఎకరాల స్థలంలో ప్రభుత్వ కళాశాల ఎదురుగా ఆర్‌అండ్‌బీ కార్యాలయం ఉంది.  ఆర్‌ అండ్‌బీ అతిథిగృహం పక్కనున్న స్థలంలోని భవనాల్లో ఆర్‌అండ్‌బీ, ఎనహెచ అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారు. భవిష్యత్తులో అక్కడ భవనం నిర్మించుకోవాలని అప్పటివరకు తాత్కాలికంగా పురావస్తు శాఖ భవనంలో విధులు నిర్వర్తించాలని ఆ శాఖాధికారులు ఆదేశాలిచ్చారని తెలుస్తోంది.  వాస్తవానికి డీఆర్‌డీఏ కా ర్యాలయ సమీపంలో హౌసింగ్‌ కార్యాలయం ఎదురుగా పురావస్తు శాఖకు సంబంధించి నూతనంగా ఓ భవనం నిర్మిస్తున్నారు. నిర్మాణం కూడా దాదా పు పూర్తయింది. ఆ భవనాన్ని ఆర్‌అండ్‌బీకి కేటాయించినట్లు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలందాయి. జిల్లా కలెక్టర్‌ సైతం అదే విషయాన్ని చెప్పినట్లు ఆర్‌అండ్‌బీ అధికారులు  చెబుతున్నారు. కానీ ఆ భవనంలోకి అడుగుపెట్టడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు. పురావస్తు శాఖ అధికారులు ఆ భవనాన్ని ఇవ్వడానికి సుముఖంగా లేర ని తెలుస్తోంది. మ్యూజియంగా వాడుకుంటామని ఆ శాఖ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపినట్లు వారు చెబుతున్నారు. వీటితో పాటు రూ.1.5 కోట్లతో చేపట్టాల్సిన పనులు  ఇంకా ఆ భవనంలో పెండింగ్‌లో ఉన్నాయని చెబుతున్నారు. మరో విషయమేంటంటే... ఆర్‌అండ్‌బీకి అప్పగిస్తే పది, పన్నెండేళ్లపాటు పురావస్తుశాఖకు దక్కదనే ఆలోచనలో సైతం వారున్నట్లు తెలుస్తోంది.  ఈ నేపథ్యంలో ఆ భవనం కూడా ఆర్‌అండ్‌బీకి అప్పగించకపోతే ప్రత్యామ్నాయంగా ఎక్కడ కేటాయిస్తారనేది  ప్రశ్నార్థకంగా మారింది. 


నష్టం రూ.వంద కోట్లపైనే

ప్రస్తుతమున్న జలవనరుల శాఖ, భూగర్భజలశాఖ, ఆర్‌అండ్‌బీ కార్యాలయాలున్న భవనాలను త్వరలోనే కూల్చేయనున్నారు. వీటి నష్టం రూ.100 కోట్లపైనే ఉంటుందనేది ఒక అంచనా. దీనికితోడు ఆయా శాఖల కార్యాలయాలకు ప్రత్యేకంగా భవనాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి. ప్రైవేట్‌ భవనాలైతే బాడుగ రూపంలో ప్రభుత్వానికి అదనపు ఖర్చయినట్లే. ఇప్పటికే తహసీల్దార్‌, ఆర్డీఓ, రూరల్‌ పోలీ్‌సస్టేషన కార్యాలయాలను కూల్చివేశారు. ఐదేళ్లవుతున్నా వాటిని నిర్మించే పరిస్థితులు ఏమాత్రం కనిపించడం లేదు. జిల్లా కేంద్రంలో పన్నులశాఖ, సబ్‌రిజిస్ర్టార్‌, గనుల శాఖ తదితర ప్రభుత్వ శాఖల కార్యకలాపాలు ప్రైవేట్‌ భవనాల్లోనే కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ భవనాలను సరిగా వినియోగించుకోకపోతే భారీగానే నష్టాన్ని భరించాల్సి వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 


మ్యూజియంగానే వాడుకుంటామని  ప్రతిపాదన పెట్టాం : రజిత,ఏడీ, పురావస్తు శాఖ  

ఆర్‌అండ్‌బీ కార్యాలయానికి ఈ భవనం కేటాయించాలని ఆదేశాలందాయి. కానీ ఇంకా రూ1.5 కోట్లతో ప్రహారీ నిర్మాణం, పెయింటింగ్‌తో పాటు చిన్నచిన్న పనులు చేయాల్సి ఉంది. ఈ భవనాన్ని మ్యూజియం కోసమే నిర్మించాం. కార్యాలయం కోసం కాదు. ఆ మేరకు మ్యూజియం కోసం పురావస్తుశాఖకే కేటాయించాలని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాం.