Abn logo
Oct 12 2021 @ 00:44AM

ప్రకృతి సంపద మాయం!

మల్లారంలో తవ్వకాలు జరుపుతున్న దృశ్యం, గుండారంలో మట్టి తవ్వకాలతో ఆనవాళ్లు కోల్పోయిన గుట్ట

జిల్లాలో యథేచ్ఛగా మొరం, మట్టి తవ్వకాలు

ప్రభుత్వ, అటవీ, అసైన్డ్‌ భూములనూ వదలని అక్రమార్కులు

సిండికేట్‌గా మారి సరఫరా చేస్తున్న వైనం

అక్రమార్కులకు అధికార పార్టీ నేతల అండ

సమాచారమున్నా.. పట్టించుకోని అధికారులు

నిజామాబాద్‌, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో మట్టి, మొరం తవ్వకాలు అడ్డూ అదుపు లేకుండా సాగుతున్నాయి. పట్టించుకునేవారు లేకపోవడంతో ప్రభుత్వ, అసైన్డ్‌, అటవీ భూములలోనూ యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తూ వేలాది రూపాయలు దండుకుంటున్నారు. నిజామాబాద్‌ నగరం చుట్టుపక్కల, ఆర్మూర్‌ పరిధిలో గుట్టలు, ప్రభుత్వ భూములు గుల్ల అవుతున్నా అధికారులు ఆ వైపు చూడడంలేదు. మట్టి, మొరం తవ్వకాలు చేసేవారికి రాజకీయ అండదండలు ఉండడంతో కిందిస్థాయి అధికారులు పట్టించుకోవడం లేదు. అనుమతులు తీసుకున్న చోటు వదిలి ప్రభుత్వ భూముల్లోనే ఎక్కువ తవ్వకాలు జరుపుతున్నా అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు.

జిల్లాలో పలుచోట్ల మొరం, మట్టి తవ్వకాలు ఇష్జారాజ్యంగా జరుగుతున్నాయి. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు అవసరాల కోసం ఎడపల్లి, మాక్లూర్‌, నిజామాబాద్‌ రూరల్‌, డిచ్‌పల్లి, జక్రాన్‌పల్లి ప్రాంతాల్లో కొంతమందికి మొరం, మట్టి తవ్వకాలకు అధికారులు అనుమతులు ఇచ్చారు. ఇటీవల జిల్లా జైలు అభివృద్ధి కోసం కూడా అనుమతులు ఇచ్చారు. జిల్లాలో ప్రతీ పనికి, నిర్మాణాలకు మట్టి, మొరం అవసరం ఎక్కువగా ఉంటుంది. అయితే, ప్రభుత్వ అనుమతులు తీసుకున్నవారు మినహా ఎక్కువమంది అటవీ, ప్రభుత్వ భూముల్లో తవ్వకాలు చేస్తున్నారు. ట్రాక్టర్‌లు, టిప్పర్‌ల ద్వారా తరలిస్తూ భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. నిజామాబాద్‌ నగరం పరిధిలోని నాగారం, సారంగపూర్‌, గుండారంతో పాటు ఇతర ప్రాంతాల్లోని ప్రభుత్వ, అటవీ, అసైన్డ్‌ భూముల్లో తవ్వకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కొంతమంది ప్రభుత్వ అభివృద్ధి పనులు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కోసం కొన్ని ట్రిప్పులకు మాత్రమే అనుమతులు తీసుకుని ఎక్కువ మొత్తంలో తవ్వకాలు చేస్తున్నారు. నిత్యం వాహనాల ద్వారా మట్టి, మొరాన్ని తరలిస్తున్నారు. నిజామాబాద్‌ నగరంతో పాటు ఎడపల్లి, మాక్లూర్‌, డిచ్‌పల్లి, మోపాల్‌, నిజామాబాద్‌ రూరల్‌ మండలాల పరిధిలో ఎక్కువగా ఈ తవ్వకాలు జరుగుతున్నాయి. తవ్విన మట్టి, మొరంను నగరానికి తరలిస్తూ విక్రయిస్తున్నారు. కొత్త నిర్మాణాలకు మట్టి, మొరం అవసరం ఎక్కువగా ఉండడంతో నగరం పరిధిలో అధికార పార్టీ నేతల అండదండలు ఉన్న కొంతమంది వ్యక్తులు సిండికేట్‌గా ఏర్పడి ఈ తవ్వకాలు కొనసాగిస్తున్నారు. అధికారులు అడ్డుకుంటే తమకు న్న పరపతి ఆధారంగా వారికి ఫోన్‌లు చేయిస్తున్నారు. వారు ఆవైపు రాకుండా చూసుకుంటున్నారు. నెల నెలా మామూళ్లను కూడా ఆ అధికారులకు ఇస్తున్నారు. నిజామాబాద్‌ నగరంలో వీరుకాకుండా వేరే ఎవరైనా సరఫరా చేస్తే వారిని బెదిరించడంతో పాటు అధికారులపై ఒత్తిడి తెచ్చి వారిపైన కేసులు నమోదు చేయించడం, వాహనాలు సీజ్‌ చేయించడం చేస్తున్నారు. అనుమతులు ఉన్న వారు తమకు కేటాయించిన స్థలాలతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా తవ్వకాలు చేస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో కొన్నిచోట్ల గుట్టలు కరిగిపోతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. నేతల నుంచి ఫోన్‌లు రాగానే వదిలేస్తున్నారు. 

ఆర్మూర్‌ డివిజన్‌లో ఒకరి కనుసన్నల్లోనే.. 

ఆర్మూర్‌ డివిజన్‌ పరిధిలో మట్టి, మొరం దందా ఒక వ్యక్తి కనుసన్నల్లోనే జరుగుతోంది. ఆర్మూర్‌కి చెందిన ఓ వ్యక్తి చుట్టుపక్కల గుట్టలు, ప్రభుత్వ భూముల్లో తవ్వకాలు చేస్తున్నాడు. ఆర్మూర్‌తో పాటు ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తూ భారీగా దండుకుంటున్నాడు. ఓ బడా నేతకు అనుచరుడిగా చెప్పుకొంటూ ఆయన.. అధికారులను, ఇతరులను మేనేజ్‌ చేస్తూ ఈ మొరం, మట్టి సరఫరా చేస్తున్నాడు. దీంతో ఆర్మూర్‌ చుట్టూ ఉన్న గుట్టలు, ప్రభుత్వ భూముల్లో భారీగా తవ్వకాలు చేపడుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. ఎవరైనా అధికారి ఆవైపు వెళితే నేతల ద్వారా హెచ్చరికలను చేయిస్తున్నాడు. ఏవైనా వాహనాలను సీజ్‌ చేస్తే వెంటనే విడిచిపెట్టే విధంగా చూస్తున్నాడు. అంతేకాకుండా ఆర్మూర్‌ పరిధిలో ఆయన చెప్పిన రేటుకే మట్టి కొనేవిధంగా హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. గతంలో ఇద్దరు ముగ్గురు అధికారులు ఆయన వాహనాలను పట్టుకుంటే తర్వాతి కాలంలో వారిని బదిలీ చేయించాడు. దీంతో ప్రస్తుతం ఎవరూ అతని వైపు చూడడంలేదు. ఈ డివిజన్‌ పరిధిలో నందిపేట, జక్రాన్‌పల్లి మండలాల్లో భారీగా మట్టి, మొరం తవ్వకాలు జరుగుతున్నాయి. రోడ్ల వెంట తవ్వకాలు జరుగుతున్నా అధికారులు కూడా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. 

బోధన్‌, రుద్రూర్‌ మండలాల పరిధిలోనూ..

బోధన్‌, రుద్రూర్‌ మండలాల పరిధిలో కూడా మొరం, మట్టి తవ్వకాలు కొనసాగుతున్నాయి. రోడ్లు, డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాలు, ప్రైవేటు వెంచర్‌లకు మట్టి, మొరాన్ని పెద్దఎత్తున సరఫరా చేస్తున్నారు. ఆ డివిజన్‌ల పరిధిలో స్థానిక నేతల సహకారం ఉండడం వల్ల ఈ తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. అక్రమార్కులకు అధికార పార్టీ నేతల అండదండలు ఉండడంతో అధికారుల కూడా వారిపై చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. జిల్లాలో కొన్నిచోట్ల మట్టి, మొరం తవ్వకాలకు అనుమతులు ఇచ్చామని గనులు, భూగర్భశాఖ అధికారి సత్యనారాయణ తెలిపారు. అనుమతులు లేనిచోట తవ్వకాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కొన్నిచోట్ల అక్రమ తవ్వకాలు చేస్తున్నట్టు తమ దృష్టికి రాగా వాహనాలను సీజ్‌ చేశామన్నారు. ప్రభుత్వ అభివృద్ధి పనుల కోసం తాత్కాలిక అనుమతులు ఇస్తున్నామని ఆయన తెలిపారు.