Abn logo
May 21 2020 @ 00:40AM

పత్తితో ప్రమాదం సుమా!

తెలంగాణలో పత్తిపంట విస్తీర్ణం పెరగడం దానికదే ఒక సమస్య. ఎంత విస్తీర్ణంలో సాగుభూములు పత్తిపంటలకు అనుకూలమో ప్రభుత్వం స్పష్టం చేయాలి. ఇప్పటికే అనువుకాని భూముల్లోకి పత్తి వెళ్లడం వల్ల దిగుబడులు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఇలాంటి స్థితిలో పత్తిపంట విస్తీర్ణాన్ని 70 లక్షల హెక్టార్లకు పెంచడమనేది ప్రతి సంవత్సరం కంటే రిస్కును మరింత ఎక్కువ చేస్తుంది. ఎగుమతుల, దిగుమతుల విధానం కూడా రైతులకు అనుకూలంగా లేదు. మిగిలిన రాష్ట్రాలతో పోల్చినప్పుడు మన రాష్ట్రంలో పత్తిసాగు ఖర్చు చాలా ఎక్కువ. కాబట్టి మార్కెట్ అంత సులువుగా దొరకకపోవచ్చు. 


తెలంగాణ వ్యవసాయ రంగం, పంటల పొందిక విషయంలో ముఖ్యమంత్రి ఆలోచనలు కలవరం కలిగిస్తున్నాయి. ముఖ్యంగా పత్తి పంటకు సంబంధించి ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ఇప్పటికే సంక్షోభంలో ఉన్న వ్యవసాయ కుటుంబాలను మరింత ప్రమాదంలోకి నెడుతుంది. రాష్ట్ర పర్యావరణాన్ని సైతం దిగజార్చే ఆలోచన అది.


అందమైన షోరూంలలో, ఆకర్షణీయమైన రంగుల్లో బట్టలు కొనుగోలు చేసే వినియోగదారులకు పత్తిపంట విస్తీర్ణం పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయం పెద్ద వార్తగా కనపడకపోవచ్చు. కానీ, తెల్ల బంగారంగా పేరొంది, రాష్ట్రంలో లక్షలాది గ్రామీణ ప్రజల జీవనోపాధిగా మారిన పత్తిపంటసాగు గత 25 సంవత్సరాలలో 35 వేలమంది తెలంగాణ రైతులను ఆత్మహత్యల పాలుచేసి, ‘దూదిపూల దుఃఖం’గా మారిన పరిస్థితులను చూసిన వారికి ముఖ్యమంత్రి ప్రకటన ఆందోళన కలిగిస్తుంది. పత్తి పంట చుట్టూ అల్లుకున్న అనేకానేక సమస్యల పరిష్కారంపై దృష్టి సారించకుండా ఇటువంటి ప్రకటన చేయడం ప్రభుత్వ పెద్దలకు సముచితం కాదు. తెలంగాణ వ్యవసాయ రంగంలో ఏర్పడిన సంక్షోభ పరిస్థితులకు ఏ మాత్రం బాధ్యత తీసుకోవడానికి సిద్ధపడని రాష్ట్ర వ్యవసాయ శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ప్రభుత్వ విధానాన్ని సమర్థించడం ఆశ్చర్యాన్ని కలిగించడం లేదు. కాకపోతే, పత్తిసాగులో ఎకరానికి 50 వేల రూపాయల నికర మిగులు ఉంటుందని చెప్పిన ఆ ‘నిపుణులు’ ఎవరో ప్రజలకు తెలియాలి.


తెలంగాణలో పత్తిపంట విస్తీర్ణం పెరగడం దానికదే ఒక సమస్య. సాధారణ పంటల సాగు విస్తీర్ణం 43,34,487 హెక్టార్లు కాగా, 2019 ఖరీఫ్‌లో 18,52,329 హెక్టార్లలో పత్తిసాగయింది. అంటే, ఇప్పటికే 40 శాతం భూభాగాన్ని పత్తి ఆక్రమించిదన్న మాట. వర్షాల మీద ఆధారపడి పండే పత్తి పంటలో నిజంగా ఎంత విస్తీర్ణంలో సాగుభూములు పత్తిపంటలకు అనుకూలమో ప్రభుత్వం స్పష్టం చేయాలి. ఇప్పటికే అనువు కాని భూముల్లోకి పత్తి వెళ్లడం వల్ల దిగుబడులు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఇలాంటి స్థితిలో పత్తిపంట విస్తీర్ణాన్ని 70 లక్షల హెక్టార్లకు పెంచడమనేది ప్రతి సంవత్సరం కంటే రిస్కును మరింత పెంచుతుంది.


రాష్ట్రంలో బి.టి పత్తి 98 శాతాన్ని ఆక్రమించింది. ఒక అంచనా ప్రకారం, ఎటువంటి చట్టబద్ధ అనుమతులు లేని, కలుపు మందులను తట్టుకునే (HT) పత్తి 15 లక్షల ఎకరాల వరకూ విస్తరించింది. బి.టి పత్తి విత్తనాలలో బి.టి. టెక్నాలజీ పనిచేయడం లేదని, గులాబీ రంగు పురుగు మళ్లీ విజృంభిస్తోందని, పురుగు మందుల వాడకం గణనీయంగా పెరిగి తద్వారా ఖర్చు కూడా పెరిగిందన్నది రైతుల స్వీయ అనుభవం. అయినా, కం పెనీలు బి.టి. టెక్నాలజీకి రాయల్టీ వసూలు చేస్తూనే ఉన్నాయి. ఎక్కువ రేట్లకు విత్తనాలను అమ్ముతూనే ఉన్నాయి. పైగా, బి.టి. పత్తి విత్తనాలను పండించే గద్వాల జిల్లా రైతులది మరో విషాదం. ఆ రైతులు పత్తి విత్తన కంపెనీలకు కట్టుబానిసలు. కంపెనీలు రంగంలో కనపడవు. ఆర్గనైజర్ల పేరుతో దోపీడీ కొనసాగుతుంది. అడ్డుకునే అధికారులు కానీ, ప్రభుత్వం కానీ లేవు. హెచ్.టి కాటన్‌లో వినియోగించే గ్లైఫోసేట్ క్యాన్సర్ కారకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ప్రభుత్వం దాన్ని నిషేధించింది. కానీ, హెచ్.టి. కాటన్ విస్తరిస్తూనే ఉంది.


రాష్ట్ర వ్యవసాయ శాఖ పత్తిపంట ఉత్పత్తి ఖర్చులను లెక్కవేస్తున్నది కానీ, అవి, ‘కేంద్ర వ్యవసాయ ఖర్చుల, ధరల నిర్ణాయక కమీషన్’ (CACP) నివేదికలో కనిపించవు. 2020-–21 సంవత్సరానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ అంచనా వేసిన క్వింటాలు పత్తి ఉత్పత్తి ఖర్చు 10,043 రూపాయలు. దీని ఆధారంగా స్వామినాథన్‌ కమీషన్ సిఫారసు ప్రకారం క్వింటాలుకు 15,064 రూపాయల కనీస మద్దతు ధర ప్రకటించాలని కేంద్రానికి ఉత్తరం రాసింది కూడా (వార్తా కథనం). రాష్ట్రంలో ఎకరానికి పత్తి సగటు దిగుబడి 8 క్వింటాళ్లు మాత్రమే. 2019లో కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర 5,550 రూపాయలు మాత్రమే. కరోనా పరిస్థితులలో ప్రపంచ వ్యాప్తంగా ఎటువంటి మార్పులు వస్తాయో, కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరానికి ఎంత కనీస మద్దతు ధర ప్రకటిస్తుందో స్పష్టత లేదు.


ప్రతి సంవత్సరం ప్రకటించే వాతావరణ నివేదికలు కూడా వాస్తవాలకు దగ్గరగా ఉండడం లేదు. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా సీజన్లు అతలాకుతలమైపోతున్నాయి. కరువులు, భారీ వర్షాలు, వర్షాభావం, వడగండ్ల వానలు రైతులను చావు దెబ్బ తీస్తున్నాయి. ఎగుమతుల, దిగుమతుల విధానం కూడా రైతులకు ఏ మాత్రం అనుకూలంగా లేదు. మిగిలిన రాష్ట్రాలతో పోల్చినప్పుడు మన రాష్ట్రంలో పత్తిసాగు ఖర్చు చాలా ఎక్కువ. కాబట్టి మార్కెట్ అంత సులువుగా దొరకకపోవచ్చు. ఈ నేపథ్యంలో పత్తిపంట విస్తీర్ణాన్ని 70 లక్షల ఎకరాలకు పెంచడం అంటే రైతులను మృత్యుముఖానికి నెట్టడమే.


ప్రభుత్వ అంచనా ప్రకారం పత్తి ఎకరం సాగు ఖర్చు 80 వేల రూపాయల పైనే ఉండబోతోంది. కానీ, ఇప్పటివరకూ బ్యాంకులు ఎకరానికి 30వేలు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌గా నిర్ణయించాయి. ఆ మేరకు కూడా రుణాలు ఇవ్వడం లేదు. రుణమాఫీ అమలు కాకపోవడం వల్ల, బ్యాంకులు రైతులకు సీజన్‌లో పంట రుణాలు ఇవ్వడం తగ్గిపోయింది. 2019–-20 ఖరీఫ్‌ సీజన్‌లో బ్యాంకులు మొత్తం 41,95,865 ఖాతాలకుగానూ, 18,60,155 ఖాతాలకు మాత్రమే పంటరుణాలు ఇచ్చాయి.


ప్రకృతి వైపరీత్యాలకు అత్యధికంగా గురయ్యే పంటల్లో పత్తి ఒకటి. అందువల్లనే పత్తిపంటను వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కిందకు చేర్చారు. ఈ పథకంలో బీమా ప్రీమియం రేట్లు చాలా ఎక్కువ. ఎక్కువ జిల్లాల్లో బీమా మొత్తంలో 20 నుండి 25 శాతం వరకూ ఉన్నాయి. రైతులు 5 శాతం ప్రీమియం మాత్రమే చెల్లించినా, మిగిలిన ప్రీమియంను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం చెల్లించేవి. కానీ, ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం తన వాటా 50 శాతానికి బదులు 30 శాతమే చెల్లిస్తానని ప్రకటించింది. మిగిలిన 20శాతం రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందా? లేక రైతుపై భారం పడుతుందా? స్పష్టత లేదు. ఇప్పటికే రైతులు ఎకరానికి 1750 రూపాయలు ప్రీమియం చెల్లిస్తున్నారు. కానీ, ఉత్పత్తి ఖర్చుల లెక్కింపులో ఈ మొత్తాన్ని సిఎసిపి కలపడం లేదు. 2019 ఖరీఫ్‌లో ఈ బీమా పరిధిలోకి వచ్చిన రైతులు 2,73,890మంది మాత్రమే. బ్యాంకులు సకాలంలో రైతులకు రుణాలు ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. ఆదాయం పరంగా చూసినా, రైతుకు నికర మిగులు చాలా తక్కువ. 2019–-20 సిఎసిపి నివేదిక ప్రకారం 8 క్వింటాళ్ల పత్తి పండి, 5,500 రూపాయల కనీస మద్దతు ధర అందితే, పత్తి రైతుకు ఎకరానికి మిగిలేది 1,160 రూపాయలు మాత్రమే, సిఎసిపి ఖర్చుల అంచనా ప్రకారం రైతుకు నికర మిగులు ఎకరానికి 3,280 రూపాయలు మాత్రమే.


పై విషయాలను లోతుగా పరిశీలించి పత్తిపంటపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. 70 లక్షల ఎకరాలలో పండే పత్తిని ఒకవేళ సిసిఐ, వ్యాపారులు కొనుగోలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతుధరతో మిగిలిన పత్తిని తాను కొనుగోలు చేస్తానని హామీ ఇవ్వవలసి ఉంటుంది. రైతుబంధు సహాయం భూమి యజమానులకే ఇస్తున్నారు. పత్తిసాగులో కౌలు రైతుల సంఖ్య చాలా ఎక్కువ. రైతుబంధు సహాయాన్ని కౌలు రైతుకు ఇవ్వకుండా తాను చెప్పిన పంటలనే వేయాలని ప్రభుత్వం రైతుల్ని ఎలా ఆదేశిస్తుంది? విత్తన, పురుగుమందుల, డ్రిప్ ఇరిగేషన్ కంపెనీల ప్రయోజనాలు, స్వప్రయోజనాల ప్రాతిపదికన రాష్ట్ర పంటల విధానాన్ని ప్రకటిస్తే వ్యవసాయ కుటుంబాలు మరింత సంక్షోభంలోకి వెళతాయి. మరిన్ని ఆత్మహత్యలు జరుగుతాయి. తెలంగాణ కూడా పంజాబ్ లాగా ఒక క్యాన్సర్ ట్రైన్‌ను ఆయా జిల్లాల మీదుగా నడపవలసి వస్తుంది.

కన్నెగంటి రవి 

(రైతు స్వరాజ్య వేదిక)

Advertisement
Advertisement
Advertisement