Abn logo
Mar 6 2021 @ 01:22AM

అనంత మేయర్‌ పీఠం నీదా.. నాదా..

వైసీపీ, టీడీపీ  ఎత్తుకు పైఎత్తులు

ప్రచారంలో దూకుడు పెంచిన ఇరు పార్టీలు

అనంతపురం, మార్చి5(ఆంధ్రజ్యోతి):  అనంతపురం నగర పాలక సంస్థ మేయర్‌ పీఠంపై వైసీపీ, టీడీపీ కన్నేశాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీల మధ్య బిగ్‌ఫైట్‌ నడుస్తోంది. మేయర్‌ పీఠం నీదా.. నాదా.. అంటూ ఆ పార్టీ ముఖ్య నేతల్లో ఉత్కంఠకు దారితీస్తోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆయా పార్టీల ముఖ్య నేతలు అభ్యర్థులతో కలిసి ప్రచారంలో దూకుడు పెంచారు. విరామం లేకుండా గడపగడపనూ తడుతూ.. ఓటర్లను అభ్యర్థించటంపైనే ప్రధానంగా దృష్టి సారించారు. ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి.. మేయర్‌ పీఠం కోసం రసవత్తర రాజకీయానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో ఆయా పార్టీల నుంచి బలమైన అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి నామినేషన్లు వేయించటం వరకూ ఎత్తుకు పైఎత్తులు వేశారు. ఏ డివిజన్‌ నుంచి ఎవరు అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నారో అనుచర వర్గాల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ.. ఆ మేరకు ఆ అభ్యర్థికి దీటుగా పోటీలో ఉండేలా ఇరు పార్టీల నాయకులు వ్యూహం పన్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. అధికార పార్టీ నేతలు.. ప్రధాన ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థులను విత్‌డ్రా చేయించి, ఏకగ్రీవాల కోసం ప్రయత్నాలు సాగించినా.. వారి ఆశలకు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి మోకాలొడ్డారు. తాను ఎంపిక చేసిన అభ్యర్థులెవరూ నామినేషన్‌ విత్‌డ్రా చేసుకోకుండా తనదైన శైలిలో క్యాంపు రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. అయినప్పటికీ.. ఒకరిద్దరు టీడీపీని వీడి, వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ స్థానాలు ఏకగ్రీవం కాకుండా ముస్లిం లీగ్‌తో ఒప్పందం చేసుకుని, ఆ స్థానాల్లో ముస్లిం లీగ్‌ అభ్యర్థులకు టీడీపీ మద్దతిచ్చి, ఏకగ్రీవం కాకుండా వ్యూహం పన్నటంలో సఫలీకృతులయ్యారు. నాలుగు స్థానాలను సీపీఐకి కేటాయించారు. దీంతో కార్పొరేషన్‌ ఎన్నికల్లో సీపీఐ, ముస్లిం లీగ్‌ పార్టీల మద్దతును కూడగట్టారు. ఇలా 50 డివిజన్లలో పోటీ అనివార్యమయ్యేందుకు చౌదరి పన్నిన ఎత్తుగడలు ఫలించాయనటంలో సందేహం లేదు.


దూకుడు పెంచిన ఇరు పార్టీలు

నామినేషన్ల విత్‌డ్రా ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో రెండ్రోజులుగా ఇరు పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూకుడు పెంచారు. వైసీపీ అభ్యర్థుల పక్షాన ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, టీడీపీ, సీపీఐ, ముస్లిం లీగ్‌ అభ్యర్థుల పక్షాన మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి, సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీ్‌షతో పాటు ముస్లింలీగ్‌ రాష్ట్ర నాయకులు ప్రచారానికి నేతృత్వం వహిస్తున్నారు. రోడ్‌షోల పేరుతో ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తున్నా.. అనంతలో అభివృద్ధి జాడల్లేవని విమర్శనాస్ర్తాలు గుప్పిస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని, పోలీసులపై ఒత్తిళ్లు తీసుకొచ్చి, బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ వైసీపీపై ఆరోపణలు గుప్పిస్తూ ప్రచారంలో వేగం పెంచుతున్నారు. తాను మున్సిపల్‌ చైర్మన్‌గా చేసిన అనంత అభివృద్ధితోపాటు.. టీడీపీ హయాంలో నగర సుందరీకరణకు పెద్దపీట వేసిన వైనాన్ని ప్రజలకు వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకోవటంపై మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఆస్తి, ఇతరత్రా పన్నులు పెంచి ప్రజలపై భారం మోపుతున్న వైనాన్ని వివరిస్తూ ఓటర్లను అభ్యర్థిస్తూ ముందుకు సాగుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పెరిగిపోయిన అవినీతి, అరాచకాలు, ఆగడాలు, దౌర్జన్యాలు, భూకబ్జాలు తదితర అంశాలను ప్రచారంలో ప్రధాన అజెండాగా ప్రజలకు వివరిస్తున్నారు. ఉద్యోగవర్గాలకిచ్చిన హామీలను తుంగలోకి తొక్కిందంటూ ఆ వర్గాల్లో ఆలోచనా శక్తిని రేకెత్తించే దిశగా ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి వైసీపీ హయాంలో.. అందులోనూ 20 నెలల కాలంలో నగరంలో రోడ్లను ఏ విధంగా అభివృద్ధి చేశామో.. చెప్పుకుంటున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్న వైనాన్ని ఓటర్లకు వివరిస్తున్నారు. ఇలా ఎవరికివారు వారి వారి ప్రభుత్వ హయాంలో అనంత నగరాభివృద్ధికి చేసిన పనులను వివరిస్తూ.. ఓటర్లను అభ్యర్థించడంలో పోటీపడుతుండటం చూస్తే.. కార్పొరేషన్‌ ఎన్నికలు ఇరు పార్టీల నేతలకు ప్రతిష్టాత్మకంగా మారాయనటంలో సందేహం లేదు. నువ్వా.. నేనా.. అన్న రీతిలో ఇరు పార్టీల నేతలు ప్రచారంలో జోరు పెంచారు.

ముచ్చటగా మూడోసారి..

అనంతపురం మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా ఆవిర్భవించిన తరువాత ముచ్చటగా మూడోసారి పాలకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయి. 2004లో అనంతపురం మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా మార్చారు. ఆ తరువాత 2005లో తొలిసారిగా మేయర్‌ పీఠానికి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. అనంతపురం నగర పాలక సంస్థకు అప్పటి కాంగ్రెస్‌ నాయకుడు, ప్రస్తుత వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రాగే పరశురాం తొలి మేయర్‌గా పీఠమెక్కారు. 2010 వరకూ ఆయన కొనసాగారు. ఆ తరువాత నాలుగేళ్ల పాటు కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించలేదు. రాష్ట్ర విభజన తరువాత 2014లో రెండోసారి కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకుంది. మేయర్‌గా అప్పటి టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మదమంచి స్వరూప అనంత రెండో మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2019 వరకూ ఆమె కొనసాగారు. ఆ తరువాత సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. వైసీపీ అధికారంలోకి వచ్చింది. 20 నెలల తరువాత మూడోసారి తాజాగా కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈసారి మేయర్‌ పీఠం కోసం టీడీపీ, వైసీపీ పోటీపడుతున్నాయి. అధికార పార్టీ మాత్రం మేయర్‌ పీఠం తమదేనన్న ధీమాతో ఉండగా.. ప్రధాన ప్రతిపక్ష టీడీపీ అదే భరోసా వ్యక్తం చేస్తోంది. మరి ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతోందో మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Advertisement
Advertisement
Advertisement