Abn logo
Dec 2 2020 @ 11:03AM

ఆశ్చర్యం.. ఆస్థమా రోగులకు కరోనా రిస్క్ తక్కువట!

న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం ప్రారంభమై ఏడాది కావస్తోంది. కానీ.. ఇప్పటికీ రోగులపై వైరస్ ప్రభావం గురించి  పూర్తి అవగాహన రాలేదు. ఎన్నో ప్రశ్నలకు ఇంకా జవాబులు దొరకాల్సి ఉంది. అయితే.. శాస్త్రవేత్తలు మాత్రం కరోనా గుట్టు మట్లు తెలుసుకునేందుకు నిరంతరంగా కృష్టి చేస్తున్నారు. అసలు కరోనా సంక్షోభాన్ని ఎలా తట్టుకోవాలి..? ఈ వైరస్ ప్రభావం ఎవరిపై అధికంగా ఉంటుంది..? అనే ప్రశ్నలకు పూర్తి స్థాయి సమాధానాలు వెతికే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్‌లో ఇటీవల జరిపిన ఓ అధ్యయనంలో ఆసక్తికర విషయమొకటి వెలుగు చూసింది. ఆస్థమాతో సతమతమయ్యే వారికి కరోనా సోకే అవకాశం తక్కువంటూ శాస్త్రవేత్తలు ఆశ్చర్యకర ప్రకటన చేశారు. మరి వారు ఇటువంటి అంచనాకు ఎందుకు వచ్చారో.. ఇది నిజమని నిరూపించే శాస్త్రపరమైన ఆధారాలు ఏమిటో తెలుసుకుందాం పదండి!

ఈ ఆశ్చర్యకరమైన ఈ అధ్యయనం తాలూకు వివరాలు.. అలర్జీ అండ్ క్లినికల్ ఇమ్యునాలజీ జర్నల్‌లో ఇటువల ప్రచురితమయ్యాయి. ఇజ్రాయెల్‌కు చెందిన హెల్త్ మెయింటెనెన్స్ ఆర్గనైజేషన్‌లోని సమాచారం ఆధారంగా శాస్త్రవేత్తలు ఆస్థమా రోగులపై విస్తృత అధ్యయనం చేశారు. వీరిలో యూదు జాతి వారితో పాటూ అరబ్బులు కూడా ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకూ కరోనా బారిన పడ్డ వారిని ఈ అధ్యయనం కోసం ఎంపిక చేశారు. మొత్తం 37 వేల మంది జరిగిన ఈ పరిశోధనలో పలు ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. 

మొత్తం 37 వేల మందిలో దాదాపు 6 శాతం మంది వివిధ సమయాల్లో కరోనా బారిన పడ్డట్టు తెలిసింది. అయితే..కరోనా రోగుల్లో ఆస్తమా ఉన్న వారి సంఖ్య కేవలం 6 శాతంగా ఉన్నట్టు తేలింది. గణాంకాలతో సహా చెప్పుకోవాలంటే..కరోనా సోకని ఆస్థమా రోగుల సంఖ్య 3 వేల పైచిలుకు కాగా.. కరోనా బారిన పడ్డ ఆస్థమా రోగుల సంఖ్య కేవలం 153. దీంతో..ఆస్తమా రోగులకు కరోనా సోకే అవకాశం తక్కువనే అంచనాకు శాస్త్రవేత్తలు వచ్చారు.

ఇక ఈ ఫలితాలపై నిపుణులు మాత్రం ఆచితూచి స్పందిస్తున్నారు. ఈ విషయంలో మరింత అధ్యయనం జరిగే వరకూ తొందరపాటు అంచనాలు వేసుకోవద్దని చెబుతున్నారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న మరో శాస్త్రవేత్త యూజీన్ మెర్జాన్ కూడా ఇదే సూచన చేశారు. తమకు కరోనా రిస్క్ ఎక్కువని భావించడం వల్ల ఆస్థమా రోగులు ఎక్కువ జాగ్రత్తలు పాటించి ఉండవచ్చని, అందుకే కరోనా బారిన పడ్డ ఆస్తమా రోగుల సంఖ్య తక్కువగా ఉండొచ్చని యూజీన్ స్పష్టం చేశారు. మరోవైపు.. ఆస్పత్రుల్లో చేరిన కరోనా రోగుల సమాచారం ఆధారంగా తాము ఈ అంచనాకు వచ్చామని పరిశోధకులు చెబుతున్నారు.  ఔట్ పేషెంట్ల విషయంలో ఈ గంణాంకాలు మరోలా ఉండే అవకాశం ఉందని కూడా స్పష్టం చేశారు. 


Advertisement
Advertisement
Advertisement