Abn logo
Aug 7 2020 @ 03:46AM

హోదా అడిగితే 3 రాజధానుల ఊసెందుకు?

  • ఇప్పుడు ఆకస్మికంగా కౌంటర్‌
  • ఢిల్లీ పెద్దల మనసు అర్థమవుతోంది!
  • 3 రాజధానులకు గ్రీన్‌ సిగ్నలే!
  • అఫిడవిట్‌పై ఇన్నాళ్లూ మీనమేషాలు
  • కేంద్రం తీరుపై సర్వత్రా విస్మయం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అంశాలను అమలు చేయాలని, ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ 2018 మార్చి 29న హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌పై అఫిడవిట్‌ దాఖలు చేయడానికి కేంద్రం ఇన్నాళ్లూ అదిగో.. ఇదిగో అంటూ కాలం గడిపింది. కానీ ఇప్పుడే ఆకస్మికంగా ఎందుకు కౌంటర్‌ వేసింది..? విభజన హామీలను అమలు చేయాలని పిటిషనర్‌ కోరితే.. దానినలా ఉంచి, మూడు రాజధానుల ప్రస్తావన తేవడంలోని ఉద్దేశమేంటి? రాజధాని నిర్ణయంలో కేంద్రానికి పాత్ర లేదంటూ.. పిటిషన్‌లో అడగని ప్రశ్నకు బదులివ్వాల్సిన అవసరమేంటి..? రాష్ట్రవ్యాప్తంగా న్యాయనిపుణులతో పాటు సామాన్యుల మదిని సైతం తొలుస్తున్న సందేహాలివి. ఈ వ్యవహారం చూస్తే కేంద్రం ఉద్దేశమేంటో, ఢిల్లీ పెద్దల మనసులోని మాట ఏంటో అర్థమైపోతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ తలపెట్టిన ‘మూడు రాజధానుల ముచ్చట’కు అడ్డంకులు లేకుండా చేసేందుకే కేంద్రం ఈ కౌంటర్‌ వేసిందన్న విమర్శలు ఉన్నాయి.


పిటిషనర్‌ ఏమడిగారు..?

ఈ పిటిషన్‌ వేసే నాటికి రాజధాని తరలింపు  ఊహే లేదు. చంద్రబాబు అధికారంలో ఉన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామంటూ కేంద్రం రాజ్యసభలో జరిగిన చర్చలో హామీ ఇచ్చింది. ఇప్పుడు ఇవ్వకుంటే ఎలాగని పిటిషనర్‌ ప్రశ్నించారు. అయితే గురువారం కేంద్రం వేసిన అఫిడవిట్‌లో రాజధానుల అంశాన్ని కలిపింది. అంటే పాత కేసులో వేసిన కౌంటర్‌లోనే ప్రస్తుత రాజధాని మార్పు అంశంపైనా తాను చెప్పదలచుకున్నది చెప్పేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ ప్రత్యేక హోదాపై కేసును హైకోర్టు కొట్టేస్తే.. ఆ కేసులో అఫిడవిట్‌లో పేర్కొన్న రాజధాని మార్పుపై కేంద్రానికి సంబంధం లేదన్న అంశం కొత్త కేసులకూ వర్తిస్తుందని అంటున్నారు. అయితే పాత కేసులు పాతవేనని.. ఇటీవల రాజధానులపై దాఖలైన కొత్త పిటిషన్లలోనూ న్యాయస్థానం కేంద్రం అభిప్రాయం అడిగిందని, ఆ కేసుల్లో కేంద్రం మళ్లీ తన వైఖరి తెలుపుతూ అఫిడవిట్‌ వేయాలని ఇంకొందరు చెబుతున్నారు. 


లోటు నిధుల ప్రస్తావన..

కేంద్ర హోంశాఖ వేసిన అఫిడవిట్‌లో కొన్ని అంశాలను ప్రస్తావించలేదు. రాజధాని అమరావతికి 1,500 కోట్లు ఇచ్చిన విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. రాజధాని మార్పుపై వే సిన కేసుల్లో ఇదే కీలకం. అమరావతిలో ఏయే ప్రాజెక్టులు చేపట్టారు.. ఎంతెంత ఖర్చుచేశారని హైకోర్టు ఆ కేసుల్లో అడిగింది కూడా. కేంద్రం ఇచ్చిన రూ.1,500 కోట్లు కూడా అందులో చేరతాయి. ఈ నిధులను అమరావతికే ఇవ్వడం, అక్కడే ఖర్చుచేయడం తెలిసిందే. రాజధాని నిర్ణయం కేంద్రం వేసిన కమిటీ నివేదిక ప్రకారమే జరిగిందని ఇప్పుడు వేసిన అఫిడవిట్‌లో కేంద్రం చెప్పింది. మరి ఆ ప్రకారమే నిర్ణయం జరిగి, కేంద్రం ఇచ్చిన నిధులను అదే రాఽజధానిలో ఖర్చుపెట్టాక.. మళ్లీ ఇప్పుడు రాజధానిని మార్చడం సబబా అన్నదానికి కేంద్రం వివరణ ఇవ్వాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు. 

Advertisement
Advertisement
Advertisement