Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆఫ్రికా నుంచి 30 మంది రాక

వివరాల సేకరణలో అధికారులు

అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ వెల్లడి

అనుమానం వస్తే నమూనాలు హైదరాబాద్‌ సీసీఎంబీకి...

ఇకపై అంతర్జాతీయ ప్రయాణికులకు ఎయిర్‌పోర్టులోనే పరీక్షలు

లక్షణాలు కనిపిస్తే ఐసోలేషన్‌కు...

ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించాలి

బీచ్‌రోడ్డులో రాకపోకలపై ఆంక్షలు


విశాఖపట్నం, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): కరోనా కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో జిల్లాలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో విలేఖరులతో ఆయన మాట్లాడుతూ ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల వల్ల బెంగళూరులో రెండు కేసులు నమోదయ్యాయన్నారు. ఈ నేపథ్యంలో మూడు, నాలుగు రోజుల క్రితం ఆఫ్రికా దేశాలతోపాటు బోట్స్‌వానా తదితర ప్రాంతాల నుంచి విశాఖ వచ్చిన సుమారు 30 మంది ప్రయాణికులకు పరీక్షలు చేయాలని నిర్ణయించామన్నారు. వీరిలో కొందరు ఫోన్లకు స్పందించగా...మరికొందరు స్విచ్‌ ఆఫ్‌ చేశారన్నారు. అయితే అందరి వివరాలు తెలుసుకుని పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఒమైక్రాన్‌ జీనోమ్‌ నిర్థారణ కోసం నమూనాలను హైదరాబాద్‌లో సీసీఎంబీకి పంపిస్తామన్నారు.  జీనోమ్‌ పరీక్ష ఫలితం రావాలంటే 15 రోజులు పడుతుందన్నారు. అంతర్జాతీయ ప్రయాణికులకు విమానావ్రయంలో తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించి జలుబు, జ్వరం, దగ్గు తదితర లక్షణాలుంటే ఐసోలేషన్‌కు పంపుతామని కలెక్టర్‌ చెప్పారు. ఇందుకోసం ఎయిర్‌పోర్టులో బృందాలను నియమిస్తామన్నారు. స్థానికంగా కూడా కొవిడ్‌ పరీక్షలు పెంచుతామన్నారు. ప్రస్తుతం రోజుకు 2 వేల నుంచి 2,200 పరీక్షలు చేస్తున్నామన్నారు. అదేవిధంగా వ్యాక్సినేషన్‌ను కూడా ముమ్మరంగా చేపట్టనున్నట్టు చెప్పారు. జిల్లాలో ప్రస్తుతం నాలుగు లక్షల డోసుల టీకాలు అందుబాటులో వున్నాయని కలెక్టర్‌ తెలిపారు. పద్దెనిమిది సంవత్సరాలలోపు పిల్లలకు వ్యాక్సినేషన్‌పై త్వరలో కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని, బూస్టర్‌ డోసుపై ఇంకా స్పష్టత రాలేదన్నారు. కొత్త వేరియంట్‌ వ్యాప్తి చెందుతున్నందున  జన సంచారం ఎక్కువగా వుండే మాల్స్‌, సంతలు, జాతరలు, బీచ్‌లు, పాఠశాలలు, కళాశాలలపై దృష్టిసారించామన్నారు. ప్రతిచోట మాస్క్‌ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు ఇస్తున్నామన్నారు. నగరంలో ఆర్కే బీచ్‌ రోడ్డుకు వెళ్లే మార్గాల్లో కొన్నింటిని మూసివేస్తామన్నారు. నగరంతోపాటు అనకాపల్లి, నర్సీపట్నంలో కొవిడ్‌ పరీక్షలకు ల్యాబ్స్‌ సిద్ధం చేసినట్టు కలెక్టర్‌ తెలిపారు. 

Advertisement
Advertisement